'ది గ్రేట్ ఫ్లడ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

కొరియన్ సినిమాలకు .. సిరీస్ లకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దక్షిణ కొరియా నుంచి వదిలిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులో ఉంది. క్రితం ఏడాది డిసెంబర్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో నడిచే ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. కిమ్ డా-మి  ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, కిమ్ బ్యున్గ్ వూ దర్శకత్వం వహించాడు. 

గు-అనా (కిమ్ డా-మి) ఓ సైంటిస్ట్. ఆమె తన ఆరేళ్ల కొడుకు 'జా - ఇన్'తో కలిసి ఓ 30 అంతస్తుల అపార్టుమెంటులో .. 3 అంతస్తులో నివసిస్తూ ఉంటుంది. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో భర్తను  కోల్పోయిన ఆమె, ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ సంఘటనను తన కొడుకు మరిచిపోయేలా చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

'గు-అనా' 'డార్విన్ సెంటర్' చేపట్టిన ఒక రహస్య ప్రాజెక్టుపై పనిచేస్తూ ఉంటుంది.మానవాళి అంతరించిపోతే, తిరిగి కృత్రిమ మానవులను తయారు చేసే AIతో కూడిన ఒక ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అలా తయారు చేయబడిన మానవ దేహాలకు ఎమోషన్ ఇంజిన్ ను సెట్ చేయడం ఆమెకి మాత్రమే తెలుసు. ఆ ఎమోషన్ ఇంజిన్ ను అమర్చడం వలన, సాంకేతిక పరిజ్ఞానంతో క్రియేట్ చేసిన కొత్త తరం మానవులు, సాధారణ మానవుల మాదిరిగానే ఎమోషన్స్ ను కలిగి ఉంటారు. 

ఒక రోజున అంటార్కిటికా ప్రాంతాన్ని ఒక గ్రహశకలం ఢీ కొంటుంది. దాంతో మంచు పర్వతాలు కూలిపోయి సముద్రంలో కలిసిపోతాయి. సముద్ర నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయి, తీరప్రాంతాలను ముంచేస్తూ ఉంటుంది. అలా 'గు-అనా' .. ఆమె కొడుకు 'జా-ఇన్' నివసిస్తున్న అపార్టుమెంట్, సముద్రపు నీటిలో చిక్కుకుంటుంది. అక్కడి నుంచి బయటపడటానికి వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది మిగతా కథ.

సముద్రంలో ప్రయాణం .. అనుకోకుండా తుఫానులో చిక్కుకుని అతికష్టం మీద బయటపడటం, లేదంటే భారీ వరదలలో చిక్కుకుని, ఆ వరదలలో నుంచి ప్రాణాలతో బయటపడటానికి పోరాడటం .. ప్రకృతి వైపరీత్యం ఒక ప్రళయంలా మీద పడినపుడు, తన వాళ్లను కాపాడుకోవడం కోసం ఒక యుద్ధమే చేయవలసిన పరిస్థితుల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి.  అలాంటి కథలకు కాస్త భిన్నంగా అనిపించే కంటెంట్ తో వచ్చిందే 'ది గ్రేట్ ఫ్లడ్'.

ఆయా సందర్భాలలో నీటికి సంబంధించిన ప్రమాదాలలో ప్రధానమైన పాత్రలు చిక్కుకునే తీరును తెరపై ఆవిష్కరించడం ఆడియన్స్  చూశారు. అయితే హఠాత్తుగా దూసుకొచ్చిన సముద్రపు నీరు,  అనేక బ్లాకులను కలిగిన ఒక 30 అంతస్తుల భవనాన్ని ముంచేస్తూ వెళ్లే విధానాన్ని ఉత్కంఠ భరితంగా ఆవిష్కరించారు. బాధితులుగా భవనంలో చాలామంది కనిపించినా, మూడే మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

సాధారణంగా భాష ఏదైనా .. ప్రాంతం ఏదైనా తల్లీబిడ్డల ఎమోషన్స్ తో కూడిన కథలకు ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. ఈ కథలోనూ అదే ప్రధానమైన అంశం. ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని తెలిసికూడా ఒక తల్లి .. తన బిడ్డను కాపాడుకోవడానికి ఎలాంటి రిస్క్ చేసిందనేదే ఈ సినిమాకి హైలైట్. తల్లీబిడ్డలకు సంబంధించిన ఈ ఎమోషన్ ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది.

మంచు పర్వతాలను గ్రహశకలాలు ఢీ కొనడం .. సముద్ర నీటిమట్టం పెరిగిపోవడం .. అది నగరంలోని అపార్టుమెంటును ముంచెత్తడం వంటి సన్నివేశాలు ఆడియన్స్ లో అంతకంతకూ కుతూహలన్ని పెంచుతూ వెళతాయి. దాంతో వాళ్లంతా కూడా ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా భావిస్తారు. తల్లీకొడుకుల పాత్రలతో కలిసి పరిగెత్తడం మొదలుపెడతారు. అయితే సరిగ్గా ఈ సమయంలోనే ఈ కథ సైన్స్ ఫిక్షన్ వైపుకు టర్న్ తీసుకుంటుంది. 

సైన్స్ ఫిక్షన్ ట్రాక్ వైపు నుంచి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది మనకి అర్థమవుతుంది. అయితే ఆ దిశగా డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఆడియన్స్ ను అయోమయంలో పడేస్తాయి.
ఒక మాదిరి ప్రేక్షకులకు అసలు అర్థం కాదు కూడా. కొద్ది మార్పులతో మళ్లీ అవే సీన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అక్కడ దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? అనేది మాత్రం ఒక పట్టాన అర్థం కాదు.

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ బాగున్నాయి. కథలోని బలమైన సమస్య .. అందుకు గల కారణం ఆసక్తికరంగానే అనిపిస్తాయి. మానవాళికి  ముంచుకొస్తున్న ప్రమాదం .. తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక తల్లిపడే ఆరాటం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను డిజైన్ చేసినతీరు కరెక్టుగా లేకపోవడంతో, ప్రేక్షకులను గందరగోళంలోకి నెట్టినట్టు అయింది. 

Movie Details

Movie Name: The Great Flood

Release Date:

Cast: Kim Da-mi,Park Hae-soo ,Kwon Eun-seong,Jeon Yu-na,Jeon Hye-jin

Director: Kim Byung-woo

Producer: Kim Kyung-min

Music: Lee Jun-oh

Banner: Hwansang Studios

The Great Flood Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews