'ప్రతిఛాయ' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాకి సంబంధించిన సినిమాలను తెరకెక్కించడంలో మలయాళ మేకర్స్ ఎప్పటికప్పుడు తమ ప్రత్యేకతను చాటుతూనే వెళుతున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాల తరువాత, పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను ఉత్కంఠ భరితంగా ఆవిష్కరించడంలో వాళ్లు ఎప్పటికప్పడు తమదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. అలా వాళ్లు రూపొందించిన సినిమానే 'ప్రతిఛాయ'. నివిన్ పౌలీ కథానాయకుడిగా, మార్చి 26న విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'జియో హాట్ స్టార్'లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. 

కేరళ ముఖ్యమంత్రి వర్గీస్ (బాలచంద్ర మీనన్)పై అనేక ఆరోపణలు ఉంటాయి. అయినా ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా ఆయన తెలివిగా చక్రం తిప్పుతూ వెళుతుంటాడు. ఆయన పెద్ద కొడుకు 'టోబిన్' తండ్రి తరువాత ముఖ్యమంత్రి కావాలనే ఆశలతో ఉంటాడు. చిన్నకొడుకు జాన్ (నివిన్ పౌలీ)ఐటీ రంగంలో ఉంటాడు. ఒక అవినీతి కేసు నుంచి వర్గీస్ బయటపడినందుకు ఆ కుటుంబమంతా హ్యాపీగా ఉంటుంది. 

అదే సమయంలో నిషా రామచంద్రన్ అనే యువతి మీడియా ముందుకు వస్తుంది. ఒక పనిపై తాను ముఖ్యమంత్రి సాయం కోరగా, తనని ఆయన లైంగింకంగా వేధించాడని ఆరోపిస్తుంది. ఆయన నిజస్వరూపం తనకి మాత్రమే తెలుసునని అంటుంది. దాంతో రాష్ట్రంలో గందరగోళ  వాతావరణం ఏర్పడుతుంది. వర్గీస్ తన పదవికి రాజీనామా చేస్తాడు. తీవ్రమైన మనోవ్యధను అనుభవించిన ఆయన, ఆ రాత్రే చనిపోతాడు.

తన తండ్రి గురించి జనం చెడుగా చెప్పుకోవడం .. దానిని తమకి అనుకూలంగా మార్చుకుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి కొందరు ప్రయత్నించడం జాన్ గమనిస్తాడు. తన తండ్రిపై ఆరోపణలు చేసిన నిషా రామచంద్రన్ ఎవరు? ఆమెతో ఈ నాటకం ఆడించిన సూత్రధారులు ఎవరు? తన తండ్రిని వాళ్లు టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవడం కోసం జాన్ రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? అనేది కథ.

రాజకీయాలలో నెగ్గుకురావడం అంత తేలికైన విషయం కాదు. కేవలం ప్రతిపక్షం నుంచి మాత్రమే కాదు, సొంత పార్టీ వైపు నుంచి కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇక వీధిలోనే కాదు .. ఇంట్లోనే శత్రువులు ఉంటారు. ఏ సమయంలో ఎటువైవు నుంచి ఎవరు దెబ్బతీస్తారనేది అంచనా వేయడం  కష్టమనే చెప్పాలి. ఇక్కడ నింద వేయడానికి నిమిషం పడితే, నిజాన్ని నిరూపించడానికి జీవితకాలం పడుతుంది. అలాంటి రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ ఇది.

సాధారణంగా రాజకీయాలలో వారసుల పోరు కూడా ఉంటుంది. అధికారం కోసం ఎంతకు తెగించడానికైనా వారసులు వెనుకాడరు. కానీ ఈ సినిమాలో హీరో తన తండ్రిపై పడిన అపనిందను తొలగించడానికి తాను అధికారంలోకి రావాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయనకి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అనే అంశంపై అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.

ఈ కథలో ఒక వైపున పొలిటికల్ వార్ జరుగుతూ ఉంటే, మరో వైపున రవి మాధవ్ ట్రాక్ ను టచ్ చేస్తూ వెళుతుంటారు. ముఖ్యమంత్రికి .. రవి మాధవ్ కి గల సంబంధం ఏమిటా అనేది దర్శకుడు చాలా సేపు సస్పెన్స్ లో పెట్టాడు. ఆ తరువాత ఆ పాత్రను పూర్తిస్థాయిలో తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు .. వాటి వెనుక దాగిన కుట్రలు ఎలా ఉంటాయనేది చూపించిన విధానం సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది.

రాజకీయాలలో ఎలాంటి నిందలు వచ్చిపడినా, తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవచ్చు. కానీ లైంగిక వేధింపులకు సంబంధించిన నిందపడితే మాత్రం ఇక కోలుకోవడం ఉండదు అంటూ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసే తీరు, ఈ సినిమా మొత్తానికి కలిపి చెప్పిన 'కీ' డైలాగ్ అనుకోవచ్చు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్లను నమ్మించడమే కష్టమనే విషయాన్ని చూపించిన విధానం మెప్పిస్తుంది. 

ఈ కథలో తండ్రీ కొడుకుల ఎమోషన్ ఉంది .. భార్యాభర్తల ఎమోషన్ ఉంది .. అయితే వాటి శాతం చాలా తక్కువ. 80 శాతం రాజకీయాల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. పార్టీలు .. ప్రెస్ మీట్లు .. మీడియా హడావిడి .. పోలీస్ హంగామా ఎక్కువగా కనిపిస్తాయి. ఎలాంటి వినోదపరమైన అంశాలకు అవకాశం లేకుండా, పూర్తిస్థాయి రాజకీయాలతో కూడిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కడం కష్టమే. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.          

నివిన్ పౌలి .. షర్ఫుద్దీన్ .. బాలచంద్ర మీనన్ నటన ఆకట్టుకుంటుంది. అన్ అగస్టీన్ .. సబితా ఆనంద్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. దర్శకుడిగా ఉన్ని కృష్ణన్ తాను అనుకున్న కంటెంట్ ను క్లారిటీతోనే తెరకెక్కించాడు. కాకపోతే కథలోనే ఎలాంటి కొత్తదనం లేకుండా రొటీన్ గా సాగుతుంది.  

Movie Details

Movie Name: Prathichaya

Release Date:

Cast: Nivin Pauly, Nishanth Sagar, Sharafudheen,Balachandra Menon, Sabitha Anand, Ann Augustine

Director: Unnikrishnan

Producer: Gokulam Gopalan

Music: Justin Varghese

Banner: Sri Gokulam

Prathichaya Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews