'మెన్షన్ హౌస్ మల్లేశ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

మాగంటి శ్రీనాథ్ హీరోగా రూపొందిన సినిమానే 'మెన్షన్ హౌస్ మల్లేశ్'. బాల సతీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాజేశ్ నిర్మాతగా వ్యవహరించాడు. కథానాయికగా ఈ సినిమాతో గాయత్రి రమణ పరిచయమైంది. మార్చి 6వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

'యాదగిరిగుట్ట'లో 2004వ సంవత్సరంలో ఈ కథ మొదలవుతుంది. భిక్షపతి - శంకరమ్మ సంతానంగా మల్లేశ్ ఉంటాడు. భిక్షపతి ఎప్పుడు చూసినా తాగడం .. మల్లేశ్ ను కొట్టడం చేస్తుంటాడు. దాంతో తండ్రిపై ద్వేషం పెంచుకుని ఇల్లొదిలి వెళ్లిపోయిన మల్లేశ్, తండ్రి చనిపోయిన తరువాతనే తన ఊరికి తిరిగొస్తాడు. తాగుడికి బానిసైన అతనికి, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేయాలని తల్లి ఆరాటపడుతూ ఉంటుంది. అలా మొత్తానికి 'జ్యోతి' (గాయత్రి రమణ)తో పెళ్లిజరిపిస్తుంది. 

ఆ ఊరికి కేశవ పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అతని భార్యనే పద్మావతి (కామాక్షి భాస్కర్ల). కేశవను అందరూ చిన్నపటేల్ అని పిలుస్తుంటారు. పెద్ద పటేల్ కి ఒక మనవడు కేశవ అయితే .. మరో మనవడు మల్లేశ్ అన్నమాట. తమకి ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణంగా మల్లేశ్ తల్లిని పెద్ద పటేల్ కుటుంబం దూరం పెడుతుంది. చిన్నపటేల్ పది ఎకరాల భూమి మధ్యలో, మల్లేశ్ కి సంబంధించిన పది గుంతల భూమి ఉంటుంది. ఆ భూమిని సొంతం చేసుకోవడానికి చిన్నపటేల్ ప్రయత్నిస్తూ ఉంటాడు.     
 
మల్లేశ్ ఫస్టు నైట్ వృథాగా గడిచిపోతుంది. అతను విపరీతంగా ఆల్కాహాల్ తీసుకోవడమే  అందుకు కారణమని డాక్టర్లు చెప్పడంతో షాక్ అవుతాడు. మల్లేశ్ దగ్గర విషయం లేదనే సంగతి చిన్న పటేల్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? మల్లేశ్ భూమిని కాజేయాలనే అతని ప్లాన్ ఫలిస్తుందా? మల్లేశ్ తన బలహీనతను జయించగలుగుతాడా? అనేది మిగతా కథ. 

గ్రామాలలో పొలం తగాదాలు .. గట్టు పంచాయితీలు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. వారసుల మధ్య ఈ గొడవలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవతలివారి బలహీనతలపై దెబ్బకొట్టేసి, తమకి కావలసిన దానిని సొంతం చేసుకోవాలనే ఆలోచన కొంతమందిలో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రధానమైన అంశాన్ని ఎంచుకుని దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.

ఒక గ్రామం .. రెండు కుటుంబాలు .. ఆ రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణమైన ఒక బలమైన సంఘటన .. ఆ ద్వేషాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్న పొలం తగాదా ఈ కథలో ప్రధానమైనవిగా మనకి కనిపిస్తాయి. ఈ ఘర్షణకు .. సంఘర్షణకు ప్రతీకలుగా మల్లేశ్ - చిన్నపటేల్ పాత్రలను మలిచారు. చాలావరకూ ఈ కథ, ఈ రెండు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 

ఆస్తుల కోసం చిన్నపటేల్ ఆలోచన చేయడం .. ఆచరణలో పెట్టడం ద్వారా ఆయనలోని విలనిజాన్ని ఆవిష్కరించారు. ఇక పిల్లల కోసం మల్లేశ్ ఆరాటపడటం .. అందుకోసం చేసే ప్రయత్నాలు కాస్త ఫన్నీగా అనిపిస్తాయి. ఈ రెండు ట్రాకులే ఈ కథలో  ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. చివరికి చిన్నపటేల్ విసిరే ఛాలెంజ్ తో కథ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది.

హీరో అల్లరిచిల్లరగా పెరగడం .. బుట్టలు బుట్టలుగా సీసాలు పేరుకుపోయే స్థాయిలో తాగేయడం .. స్నేహితులతో కలిసి తిరిగేయడం .. పేరుకి ఒక టెంట్ హౌస్ నడుపుతూ ఉండటం .. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే గొడవకి వెళ్లడం వంటి రొటీన్ సీన్స్ తోనే ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఏదో కొత్తగా ఉందే .. నెక్స్ట్ ఏమౌతుందో అనే ఉత్కంఠ మాత్రం ఉండదు.   

 రొమాన్స్ .. కామెడీ .. ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమా నడుస్తుంది. హీరో - హీరోయిన్స్ మధ్య నడిచే రొమాన్స్, మల్లేశ్ స్నేహితులైన సుధాకర్ రెడ్డి .. వీరబాబు పాత్రల ద్వారా కామెడీ వర్కౌట్ చేయడానికి చేసిన ప్రయత్నం కొంతవరకూ అలరిస్తుంది. ఎటొచ్చి ఎమోషన్ అనేది ఏ మాత్రం పండలేదు. బలంగా ఉంటుందనుకున్న ఫ్లాష్ బ్యాక్ కి కామెడీ టచ్ ఇచ్చేసి బలహీనంగా మార్చేశారు. 

 హీరో తన చిన్నప్పుడు తండ్రిపై కోపంతో, అతను తాగే మందులో మూత్రం పోయడం, పెద్దయిన తరువాత తన తండ్రి ఫోటోపై చెడ్డీ ఆరేయడం కాస్త గీత దాటినట్టుగా అనిపిస్తుంది. మాగంటి శ్రీనాథ్ .. గాయత్రి రమణ నటన బాగానే ఉంది. మురళీధర్ గౌడ్ .. కామాక్షి భాస్కర్ల వంటి ఆర్టిస్టులకు సరైన పాత్రలు పడలేదనే అభిప్రాయం కలుగుతుంది.

 అమ్మ ముత్తు ఫొటోగ్రఫీ .. గ్యారీ బీ హెచ్ ఎడిటింగ్ .. సురేశ్ బొబ్బిలి సంగీతం కథకి తగినట్టుగానే కనిపిస్తాయి. ఎలాంటి ట్విస్టులు లేకుండా .. రొటీన్ గా సాగిపోయే ఈ సినిమా, ఓ మాదిరిగా అనిపిస్తుంది అంతే. 

Movie Details

Movie Name: Mansion House Mallesh

Release Date:

Cast: Srinath Maganti, Gayathri Ramana, kamakshi Bhaskarla, Rajesh, Muralidhar Goud, Raj Kumar Kasireddy

Director: Bala Sathish

Producer: Rajesh

Music: Suresh Bobbili

Banner: Dheeraj Entertainments

Mansion House Mallesh Rating: 1.75 out of 5

Trailer

More Movie Reviews