'తాయ్ కిళవి' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

ఈ మధ్య కాలంలో అందరి నోళ్లలో నానిన సినిమా 'తాయ్ కిళవి'. రాధికా శరత్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. సుధాన్ సుందరంతో పాటు శివ కార్తికేయన్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 75 కోట్లు రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా 'జియో హాట్ స్టార్' లో ఈ రోజు నుంచి తమిళంతో పాటు ఇతర భాషలలోను స్ట్రీమింగ్ అవుతోంది.

అది కొండవాలులోని ఒక మారుమూల గ్రామం. ఆ విలేజ్ లో పవునుతాయి (రాధికా శరత్ కుమార్) తన కూతురు సురుళి (రేచల్)తో .. మనవుడు రాజుతో కలిసి జీవిస్తూ ఉంటుంది. సురుళి పుట్టింటి దగ్గరే ఉండిపోవడానికి కారణం, మూడు తులాల బంగారం విషయంలో తన భర్త పట్టుబట్టడమే. పవునుతాయికి ముగ్గురు కొడుకులు కూడా ఉంటారు. అయితే ఆస్తి విషయంలో తల్లితో గొడవపడి, నాలుగు సంవత్సరాల క్రితం తమ భార్యలతో ఇల్లొదిలి వెళ్లిపోతారు.  

పవునుతాయి ఆ ఊళ్లో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఎవరికీ భయపడకుండా ముక్కుపిండి వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది. అందువలన ఆమె దగ్గర అప్పు తీసుకున్న వాళ్లంతా భయపడిపోతుంటారు. అలాంటి పరిస్థితులలో ఒక రోజున ఆమెకి 'పక్షవాతం' వస్తుంది. కాళ్లు .. చేతులు .. మాట పడిపోతాయి. దాంతో ఇకపై తమకి ఆమె వేధింపులు ఉండవని భావించిన ఊళ్లో వాళ్లు, ఆనందంతో ఎగిరి గంతేస్తారు.  ఆస్తుల కోసం కొడుకులు - కోడళ్లు మళ్లీ వాలిపోతారు. 

తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ముగ్గురు కొడుకులు ఎదురుచూస్తుంటారు. తనకి రావలసిన మూడు తులాల బంగారం కోసం అల్లుడు కూడా వచ్చేస్తాడు. గోల్డ్ కుమార్ అనే బంగారం షాపు అతను కూడా అక్కడికి వస్తాడు. కొన్ని రోజుల క్రితమే పవునుతాయి తన దగ్గర నుంచి 160 తులాల బంగారం తెచ్చిందని ఆమె ముగ్గురు కొడుకులతో చెబుతారు. అది ఎక్కడ దాచిందనే విషయం తమతో చెప్పడానికే తల్లి ప్రయత్నిస్తుందనే సంగతి అప్పుడే వాళ్లకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? పర్యవసానంగా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయి? అనేది కథ.

ఈ ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కోరికలు తీరుస్తున్నప్పుడే దేవుడికైనా విలువ ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడే మనుషులకు విలువ ఉంటుందనే విషయాన్ని వినోదభరితంగా ఆవిష్కరించిన సినిమా ఇది. మనిషి బ్రతకడానికీ .. ఆ మనిషిని బ్రతికించడానికి కూడా డబ్బే అవసరం. డబ్బులేనివాడిని ఈ సమాజం ఎలాంటి తీర్పు లేకుండానే వదిలేస్తుంది .. వెలి వేస్తుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఆ సమాజంలో చేరిపోవడమే ఇక్కడి తమాషా.

పవునుతాయి నుంచి అప్పు తీసుకున్న వాళ్లంతా ఆమె చనిపోవాలని కోరుకుంటారు. బంగారం ఎక్కడ దాచింది చెప్పేంతవరకూ ఆమె బ్రతికితే చాలని కొడుకులు -  కోడళ్లు భావిస్తారు. ఒక మనిషి ప్రాణం డబ్బుతో ముడిపడిపోవడమే ఈ కథ ద్వారా దర్శకుడు చెప్పదలచుకున్న ప్రధానమైన విషయం. డబ్బులేనివారి ప్రాణాలకు విలువలేదనే విషయాన్ని స్పష్టం చేయడమే ఉద్దేశం అనేది అర్థమైపోతుంది. 

జీవితాన్ని చదివిన ఒక తల్లి .. ఆమె ఆస్తుల కోసం కాచుకుని ఉన్న ముగ్గురు కొడుకులు .. ఈ విషయంలో మాత్రమే వారిని ప్రోత్సహించే భార్యలు .. భార్య కంటే బంగారమే ముఖ్యమని భావించే అల్లుడు .. ఇలాంటి ప్రధానమైన పాత్రలను దర్శకుడు డిజైన్ చేసిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం వాస్తవ పరిస్థితులను కళ్లకు కడుతుంది ..  సహజత్వంతో హృదయానికి హత్తుకుంటుంది.

పవునుతాయి పాత్రను దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఆమె లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ఈ కథ వెంట చివరివరకూ నడిచేలా చేస్తాయి. మొదటి నుంచి చివరివరకూ కూడా ఈ పాత్రను నడిపించిన తీరు మెప్పిస్తుంది. ఇక ఆమె కొడుకులు .. వారి బలహీనతలు కామెడీ టచ్ ఇస్తూ ఈ కథను వినోదభరితంగా మారుస్తూ ఉంటాయి. రియల్ లొకేషన్స్ ఈ కథకు మరింత సహజత్వాన్ని ఆపాదిస్తాయి.  

ప్రతి పాత్ర విషయంలో శ్రద్ధ తీసుకోవడం కనిపిస్తుంది. అనవసరమైన పాత్రలు కనిపించవు. కథ ఒక ఫ్లోలో కొనసాగుతూ మన ఊళ్లో మన కళ్లముందు జరుగుతున్న భావన కలిగిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఈ కథా బలాన్ని మరింత పెంచుతుంది. సంభాషణలు ఆలోచింపజేస్తాయి. వివేక్ విజయ్ కుమార్ కెమెరా పనితనం .. నివాస్ కె ప్రసన్న నేపథ్య సంగీతం .. సాన్ లోకేశ్ ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పొచ్చు.       
    
రోజులు మారిపోతున్నాయి .. బంధాలు మసకబారిపోతున్నాయి.మనుషుల మధ్య డబ్బుకి తప్ప మరి దేనికీ విలువలేకుండా పోతోంది. డబ్బు అవసరమే .. డబ్బుతోనే విలువ పెరుగుతుందనే మాట కూడా నిజమే. అయితే ఆ డబ్బును కష్టపడి సంపాదించుకోవాలి. అంతేగానీ కన్నవాళ్లు పోతే వచ్చే డబ్బు కోసం ఎదురుచూడకూడదు అనే సందేశాన్ని అందించిన సినిమా ఇది. వినోదాన్ని జోడించి అందించిన ఈ సినిమాను కుటుంబ సభ్యులందరితో కలిసి చూడవలసిందే.  

Movie Details

Movie Name: Thaai Kizhavi

Release Date:

Cast: Radikaa Sarathkumar,Singampuli,Aruldoss,Munishkanth,Bala Saravanan,Ilavarasu

Director: Sivakumar Murugesan

Producer: Sudhan Sundaram - Sivakarthikeyan

Music: Nivas K Prasanna

Banner: Passion Studios-Sivakarthikeyan Productions

Thaai Kizhavi Rating: 3.25 out of 5

Trailer

More Movie Reviews