తెలుగు .. తమిళ భాషల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను .. మరోవైపున నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. రీసెంటుగా ఆమె చేసిన సినిమానే 'సరస్వతి'. ఈ సినిమాలో ఆమె టైటిల్ రోల్ ను పోషించడమే కాదు, దర్శక నిర్మాతగా కూడా వ్యవహరించారు. మార్చి 6వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
హైదరాబాదులో లక్ష్మీ (వరలక్ష్మీ శరత్ కుమార్) ఒక హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. తన కూతురు 'సరస్వతి'తో కలిసి నివసిస్తూ ఉంటుంది. 12 ఏళ్ల సరస్వతిని ఒక స్కూల్లో చదివిస్తూ ఉంటుంది. ఆమె మాజీ భర్త ఆదిత్య (జీవా) ముంబైలో ఓ డాక్టర్. సరస్వతి బర్త్ డే రోజున స్కూల్లో వదిలి వెళుతుంది లక్ష్మీ. సాయంత్రం స్కూల్ కి వెళ్లిన ఆమెకి అక్కడ సరస్వతి కనిపించదు. ఆ ఇంటిపేరు గల అమ్మాయి తమ స్కూల్లో చదవడం లేదని యాజమాన్యం సమాధానమిస్తారు.
దాంతో లక్ష్మీ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి, సీఐ కృష్ణారెడ్డి( మురళీశర్మ)ను కలుస్తుంది. తన కూతురు సరస్వతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసి హత్య చేశారని ఫిర్యాదు చేస్తుంది. స్కూల్ బిల్డింగ్ నుంచి పాపను తీసుకెళ్లి ఫలానా చోటున పాతిపెట్టానని చెబుతుంది. అక్కడికి వెళ్లి చూసిన కృష్ణారెడ్డికి డెడ్ బాడీ కనిపించదు. ఆధారాలు లేకుండా తానేమీ చేయలేనని అతను చేతులెత్తేస్తాడు. అలాంటి పరిస్థితులలో లక్ష్మీ, లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్)ను కలుస్తుంది.
రామానుజం ఆ కేసును పరిశీలిస్తూ ఉండగానే, ఒక కలెక్టర్ ను .. పోలీస్ ఆఫీసర్ ను .. జడ్జిని లక్ష్మీ హత్య చేస్తుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురినీ దారుణంగా చంపుతుంది. దాంతో రామానుజం అయోమయంలో పడిపోతాడు. లక్ష్మీ గురించిన విషయాలను తెలుసుకోవడం కోసం, ముంబైలోని ఆదిత్య దగ్గరికి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడతను ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.
ఇది సాయిమాధవ్ బుర్రా రాసిన కథ. సమాజంలో ఉన్నతమైన పదవులలో ఉన్న ముగ్గురు వ్యక్తులను లక్ష్మీ చాలా దారుణంగా హత్య చేస్తుంది. తన 12 ఏళ్ల కూతురు చనిపోవడానికి కారకులు వాళ్లేనని న్యాయస్థానంలో చెబుతుంది. ఆ ముగ్గురూ నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లభించవు. అలాగే వాళ్లను లక్ష్మీ అంతం చేసిందనడానికి సాక్ష్యాలు ఉండవు. దాంతో అటు న్యాయం - ఇటు చట్టం ఎలా స్పందించాయనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
లక్ష్మీ పాత్రను ప్రధానంగా చేసుకుని రచయిత ఈ కథను అల్లుకున్నాడు. ప్రధానమైన పాత్ర అయిన లక్ష్మీ, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ వెళుతుంటుంది. తెరపై డాక్టర్లను .. లాయర్లను .. న్యాయమూర్తులను .. పోలీస్ ఆఫీసర్లను ఆమె అయోమయంలోకి నెడుతూ ఉంటుంది. ఈ అయోమయంలో నుంచే ఆసక్తి పుట్టేలా రచయిత కథను మలుపులు తిప్పుతూ వెళ్లాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ .. లక్ష్మీ ఫ్లాష్ బ్యాక్ ఆడియన్స్ లో మరింత కుతూహలాన్ని పెంచే అంశాలుగా కనిపిస్తాయి.
లక్ష్మీ తీరు .. ఒక వైపున ఆరోపణలు చేస్తూనే .. మరో వైపున హత్యలు చేసే ఆమె ధోరణి గురించి మాజీ భర్త ద్వారా తెలుసుకోవడానికి లాయర్ రామానుజంగా ప్రకాశ్ రాజ్ ముంబై వెళ్లిన దగ్గర నుంచి కథలో ట్విస్ట్ పడుతుంది. అయితే ఆ ట్విస్ట్ ను ఎంజాయ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అసలు ఏం జరిగి ఉంటుందనేది ఆడియన్స్ గెస్ చేయడానికి అవసరసమైన సంకేతాలను కూడా ఆ ట్విస్ట్ ఇచ్చేస్తుంది.
లక్ష్మికి జరిగిన అన్యాయం .. ఆమె గతం .. కూడా రొటీన్ గా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఏం జరిగి ఉంటుందనేది ప్రేక్షకులకు అర్థమైపోతుందో అప్పటి నుంచి ఇక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆధారాల కోసం పరుగులు .. ఇన్వెస్టిగేషన్ హడావిడి కథలో పెద్దగా కనిపించవు. లక్ష్మీ పాత్ర తరువాత కాస్త ప్రభావితం చేసే పాత్ర ఏదైనా ఉందంటే, అది ప్రకాశ్ రాజ్ పాత్రనే. మురళీశర్మ .. నాజర్ .. రావు రమేశ్ పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది.
సాయిమాధవ్ బుర్రా తయారు చేసిన కథనే అయినప్పటికీ, అంత విభిన్నమైనదిగా .. విలక్షణమైనదిగా అనిపించదు. సంభాషణల పరంగా కూడా అంతగా ప్రభావితం చూపలేకపోయింది. మంచి క్రేజ్ ఉన్న తారాగణాన్నే తీసుకున్నారుగానీ, ఆ పాత్రలను సమర్థవంతంగా డిజైన్ చేయలేకపోయారు. ఎడ్విన్ సకాయ్ ఫొటోగ్రఫీ .. తమన్ నేపథ్య సంగీతం .. వెంకట్ రాజన్ ఎడిటింగ్ ఫరవాలేదు.
వరలక్ష్మీ శరత్ కుమార్ విలనిజాన్ని చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. ఆమె నిండుగా ఉండటాన్ని చూడటానికి ఆసక్తిని చూపుతారు. అయితే అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఆమె కనిపిస్తుంది. ఆమె సన్నబడటం కొంతవరకూ మైనస్ అయితే, ఆమె సినిమాకి 'సరస్వతి' అనే సాఫ్ట్ టైటిల్ సెట్ చేయడం కూడా మరో మైనస్ గా అనిపిస్తుంది. రొటీన్ స్టోరీతో కాకుండా, మరో ఇంట్రెస్టింగ్ లైన్ తో వచ్చి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.
'సరస్వతి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Saraswathi Review
Movie Details
Movie Name: Saraswathi
Release Date: 2026-04-03
Cast: Varalakshmi Sarath Kumar, Prakash Raj, Priyamani, Rao Ramesh, Murali Sharma, Jiiva, Kishore
Director: Varalakshmi Sarath Kumar
Music: Thaman S
Banner: Dosa Diaries
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer