'అమరావతికి ఆహ్వానం' (ఆహా) మూవీ రివ్యూ!

హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి ఓటీటీ సెంటర్లలో మంచి డిమాండ్ ఉంది. ప్రతివారం ఈ జోనర్ నుంచి ఏ సినిమా వచ్చిందా అని వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం 'అమరావతికి ఆహ్వానం' అనే ఓ హారర్ థ్రిల్లర్ ఓటీటీ ట్రాక్ పై దిగిపోయింది. ఫిబ్రవరి 13వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి జీవీకే దర్శకత్వం వహించాడు. ఈ  సినిమాలో ధన్య బాలకృష్ణ .. ఎస్తేర్ .. సుప్రీత ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈశ్వర్ ( శివ కంఠమనేని) భానుమతి ( ధన్య బాలకృష్ణ) భార్యాభర్తలు.హైదరాబాద్ లోని ఓ విలాసవంతమైన ఇంట్లో వాళ్లు నివసిస్తూ ఉంటారు. భానుమతి చెలెళ్లు ఇద్దరూ ఆమె దగ్గరే ఉంటూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈశ్వర్ కీ, జగదీశ్ తలనొప్పిగా మారతాడు. అతని కారణంగా ఈశ్వర్ జాబ్ పోగొట్టుకుంటాడు. ఇంటిని కూడా కోల్పోయే పరిస్థితికి వస్తాడు. భానుమతి పెద్ద చెల్లెలు భార్గవి (సుప్రీత) యూ ట్యూబర్ గా ఉంటుంది. దెయ్యాలనేవి లేవని నిరూపించే దిశగా ఆమె వీడియోలు చేస్తూ ఉంటుంది. అలా ఒకసారి ఆమె చేసిన ఇక వీడియో బాగా వైరల్ అవుతుంది. 

అలాంటి సమయంలోనే ఆమెకి ఒక కాల్ వస్తుంది. దెయ్యాలనేవి ఉన్నాయనీ, తమ ఊరికి వస్తే తాను నిరూపిస్తానని ఆ వ్యక్తి చెబుతాడు. దాంతో భార్గవి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అతనిది ఏ ఊరో చెబితే తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని అంటుంది. అప్పుడు అతను 'అమరావతి' పేరు చెబుతాడు. భార్గవితో పాటు తాము కూడా వెళ్లాలని ఈశ్వర్ - భానుమతి భావిస్తారు. పనిమనిషి కాత్యాయనితో పాటు, ఈశ్వర్ స్నేహతుడైన లాయర్ కామేశం .. భార్గవి లవర్ మహేశ్ తో కలిసి అందరూ ఒక వ్యాన్ లో అక్కడికి బయల్దేరుతారు.

 ఫోన్లో ఆ వ్యక్తి చెప్పిన ఒక ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఇబ్బందిగా అనిపించడంతో, ఆ ఊరు జమిందారు గారికి సంబంధించిన బంగళాకి వెళతారు. జమీందారు వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్) గురించి తెలుసుకుంటూ లోపలికి అడుగుపెడతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది కథ. 

'అమరావతికి ఆహ్వానం' అనే టైటిల్ లోనే హారర్ ఛాయలు కనిపిస్తాయి. అందుకు తగినట్టుగానే కథ మొదలవుతూ ఉండగానే దెయ్యం జాడలు .. నీడలు పడటం మొదలవుతుంది. యూ ట్యూబ్ వీడియోల కోసం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిన ఒక ఫ్యామిలీ, దెయ్యం కారణంగా అక్కడ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

సాధారణంగా హారర్  కథల్లో మనకి రెండు రకాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రేతాత్మలను నిద్రలేపి తమకి నిద్ర లేకుండా చేసుకోవడం ఒక రకం. ఇక ఆల్రెడీ నిద్రలేచి తిరుగుతున్న దెయ్యాల బంగ్లాలోకి తమంతట తాముగా వెళ్లి ఇరుక్కోవడం. ఆ రెండో కోవకి చెందిన అంశాన్ని తీసుకుని దర్శకుడు ముందుకెళ్లాడు. 'అమరావతికి వెళ్లడానికి ముందు పావుగంట కథ నడిస్తే, మిగతా కథ అంతా అమరావతిలోనే నడుస్తుంది. దెయ్యం కథలకు ఒక ఆనవాయితీ ఉంది. అవి బంగాళా దాటి బయటికి రావు. ఈ కథ కూడా అంతే .. 80 శాతం కథను బంగాళాలో .. నాలుగు గోడల మధ్యలోనే నడిపించారు. 

అయితే ఈ దెయ్యానికీ .. ఈ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏమిటనే ఒక ఆసక్తి ఆడియన్స్ లో ఉంటుంది. అందువలన ఆ సమయం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తారు.దెయ్యాలను దెయ్యాల మాదిరిగా చూపిస్తూ భయపెట్టే సినిమాలు కొన్నయితే, దెయ్యాలను మనుషుల కంటే అందంగా చూపిస్తూనే కంగారు పెట్టేసే సినిమాలు మరికొన్ని. ఈ విషయంలో కూడా ఇది రెండో కోవకి చెందినదిగానే కనిపిస్తుంది. ఇక బట్టలు మార్చుకున్నంత తేలికగా ఒకరి తరువాత ఒకరిగా మనుషులను దెయ్యాలు ఆవహించడం వంటి సన్నివేశాలు మామూలే. 

భయపడుతూనే దెయ్యాల కథలను చూడటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే కథలో ఊహించని మలుపులు .. ట్విస్టులు ఉండాలని కోరుకుంటారు. అలాంటివారిని నిరాశపరిచే కంటెంట్ గానే ఈ సినిమా కనిపిస్తుంది. ఏం జరగబోతుందనేది ఆడియన్స్ ముందుగానే గెస్ చేస్తూ ఉంటారు. వాళ్లు గెస్ చేసినట్టుగానే జరుగుతూ ఉంటుంది. ఇదే ఈ సినిమాకి సంబంధించిన ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది.ఈ కథకి ప్రధానమైన బలం ప్రేతాత్మ ఫ్లాష్ బ్యాక్. అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ గా అనిపించడమే కాదు .. వీక్ గా కూడా ఉంది.

 మాంత్రికుడి ఎపిసోడ్ .. దెయ్యం తన అసలు రూపాన్ని బయటపెట్టడం వంటి ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా తేలిపోతాయి. ఇక డెవిల్ హౌస్ అంటూ వేసిన సెట్ కూడా చాలా కృతకంగా అనిపిస్తుంది. ఎస్తేర్ .. ధన్య బాలకృష్ణ .. సుప్రీత నటన పాత్రపరిధిలోనే కనిపిస్తుంది. ప్రభాకర్ రెడ్డి ఫొటోగ్రఫీ .. పద్మనాభ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం .. సాయిబాబు ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, కథాపరంగా ప్రేక్షకులను ఎంతమాత్రం భయపెట్టలేకపోయింది. చాలా సాదాసీదా కంటెంట్ తో రొటీన్ గా సాగిపోయింది.        

Movie Details

Movie Name: Amaraavathiki Aahvanam

Release Date:

Cast: Shiva Kanthamaneni, Dhanya Balakrishna, Ester, Supreetha, Bhadram, Gemini Suresh

Director: GVK

Producer: Shankar Rao - Venkareshwara Rao

Music: Padmanabh Bharadwaj

Banner: Light House Cine Magic

Amaraavathiki Aahvanam Rating: 1.50 out of 5

Trailer

More Movie Reviews