'10/G రైల్వే క్వార్టర్స్' (ఈటీవీ విన్)మినీ మూవీ రివ్యూ!

ఈటీవీ 'కథాసుధ' శీర్షిక క్రింద వరుసగా లఘు చిత్రాలను అందిస్తూ వస్తోంది. విభిన్నమైన ... విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వెళుతోంది. ప్రతి కథ చాలా తక్కువ నిడివితో .. తక్కువ పాత్రలతో ఆలోచింపజేసేవిగా .. ఎమోషనల్ గా కనెక్ట్ చేసేవిగా ఈ లఘుచిత్రాలు ఉంటున్నాయి. అలా రూపొందిన లఘు చిత్రమే '10/G రైల్వే క్వార్టర్స్'. రాజీవ్ కనకాల ప్రధామైన పాత్రను పోషించిన ఈ మినీ మూవీ, ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

అది ' 10/G రైల్వే క్వార్టర్స్' .. ఆ కాలనీలో ప్రకాశ్ రావు (రాజీవ్ కనకాల) ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. భార్య పద్మ .. చెల్లెలు జ్యోత్స్న .. ఇదే అతని ఫ్యామిలీ. ఆ కాలనీలోకి కొత్తగా సురేశ్ (ఆర్యన్) దిగుతాడు. అతని భార్య నందిని (వాసంతి). వారికి వివాహమై రెండేళ్లు అవుతూ ఉంటుంది .. కానీ పిల్లలు లేరు. లేనిది ఉన్నట్టుగా .. ఉన్నది లేనట్టుగా ఊహించుకునే ఒక మానసిక వ్యాధితో నందిని బాధపడుతోందని ఆ వీధిలోని వాళ్లందరితో సురేశ్ చెబుతాడు. 

నందిని ఇంట్లో నుంచి బయటికి రాదు .. ఎవరితోను కలవదు. ఎప్పుడూ కూడా టీవీ చూస్తూ కూర్చుంటుంది. అయినా ఆమెను సురేశ్ ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. ఆమెపై పెద్దగా బాధ్యతలు పెట్టకుండా ఇంటి పనులన్నీ సురేశ్ చేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లంతా అతనిని చూసి పాపం అనుకుంటారు. ఆమెను సరైన డాక్టర్ కి చూపించమని కొందరు .. అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేయించమని కొందరు సలహా ఇస్తారు. 
       
ప్రకాశరావు దంపతులు చెప్పినట్టు నందిని పేరుపై పూజ చేయించడానికి సురేశ్ సిద్ధమవుతాడు. ప్రకాశ్ రావు దంపతులు కూడా షాపింగ్ కి వెళుతున్నట్టు చెప్పి వెళ్లిపోతారు. సురేశ్ అమ్మవారి ఆలయానికి వెళ్లడంతో, ఇంట్లో నందిని ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఊహించని ఆ సంఘటన ఏ నిజాన్ని బయటపెడుతుంది? ఎవరి ముసుగులు తొలగిపోతాయి? అనేది కథ.

 '10/G రైల్వే క్వార్టర్స్' .. దర్శకుడిగా 'జై' వ్యవహరించిన లఘు చిత్రం ఇది. రైల్వే కాలనీలో కొన్ని కుటుంబాలు. వాటిలో రెండు కుటుంబాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. చాలా తక్కువ పాత్రలతో ఈ కంటెంట్ నడుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలోనే ఈ కథ కదలడం మొదలవుతుంది. ప్రకాశ్ రావు .. పెళ్లీడు చెల్లెలు, సురేశ్ .. మానసిక వ్యాధితో బాధపడుతున్న భార్య నందిని. ప్రధానమైన కథ ఈ నాలుగు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 

కథ మొదలైన దగ్గర నుంచి మానసిక వ్యాధితో బాధపడే నందినికి, ఎవరు ఎలాంటి వైపు నుంచి అన్యాయాన్ని తలపెడతారోనని ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. అయితే అప్పటివరకూ ఉన్న ప్రేక్షకుల దృష్టి కోణాన్ని మారుస్తూ ట్విస్ట్ ఎదురవుతుంది. ఈ ట్విస్ట్ తో ఈ కథ మరింత బలపడుతుంది. సమాజంలో మనచుట్టూ ఉన్నవారి స్వభావాలను మనం అంచనా వేయలేము అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తుంది. 

 ఇది చాలా సింపుల్ కంటెంట్. చాలా తక్కువ బడ్జెట్ లో .. తక్కువ లొకేషన్స్ లో రూపొందిన కంటెంట్. అయినా దర్శకుడు సాధ్యమైనంత వరకూ సహజత్వాన్ని అద్దడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఈ కథలో కొత్తదనం లేదు .. పాత్రలను కూడా అంత బలంగా డిజైన్ చేసుకోలేదు. కేవలం ఒక ట్విస్ట్ పై ఆధారపడి .. ఆ పాయింట్ ను నమ్ముకుని ముందుకు వెళ్లారు. 

సస్పెన్స్ థ్రిల్లర్స్ కి సంబంధించిన కథల్లో ప్రేక్షకులకి ఏ వైపు నుంచి డౌట్ రాకూడదు. పూజ చేయించడానికి పక్కింటి వ్యక్తిని అమ్మవారి ఆలయానికి పంపిస్తూ, ప్రకాశరావు తన చెల్లెలిని తోడుగా పంపించడం సహజత్వాన్ని దెబ్బతీసింది. ఈ కారణమే ప్రేక్షకులను ఆలోచనలో పడేసింది. అలా కాకుండా మరో రకంగా రాసుకోవలసింది. 

రాజీవ్ కనకాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. మిగతావారి నటన గురించి మాట్లాడుకునే స్థాయిలో ఆ పాత్రలను డిజైన్ చేయలేదు. జోస్య భట్ల నేపథ్య సంగీతం .. యోగి ఫొటోగ్రఫీ .. శశి కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

  నిజానికి '10/G రైల్వే క్వార్టర్స్' అనే టైటిల్ అందరిలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ముందుకు రాబోతోంది అనే ఒక భావన కలిగించింది. కానీ రొటీన్ కంటెంట్ ను మాత్రమే అందించగలిగింది. ఓ మాదిరి కంటెంట్ కేటగిరీలోనే ఆడియన్స్ ను పలకరించే కథ ఇది. 

Movie Details

Movie Name: 10/G Railway Quarters

Release Date:

Cast: Rajeev Kanakala, Vasanthi, Aryan, Jyothsna, Madhuri, Rajitha

Director: Jai

Producer: Prasad Devineni- Shobhu yarlagadda

Music: Josya Bhatla

Banner: Arka Media Works

10/G Railway Quarters Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews