తమిళంలో ఈ మధ్యకాలంలో తెరపైకి వచ్చిన టీనేజ్ లవ్ స్టోరీగా 'విత్ లవ్' కనిపిస్తుంది. 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్, ఈ సినిమాతో హీరోగాను ఎంట్రీ ఇచ్చాడు. మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న అనశ్వర రాజన్ తోనే తన తొలి సినిమాను చేయడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైన ఈ సినిమా, 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా, తమిళంతో పాటు ఇతర భాషలలోను ఈ నెల 6వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
సత్య (అభిషన్ జీవింత్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. కొంతకాలం క్రితం తల్లిని కోల్పోగా, తండ్రి సొంత ఊళ్లో ఉంటూ ఉంటాడు. దాంతో సత్య పెళ్లి గురించి ఆయన అక్కయ్యనే పట్టించుకుంటూ ఉంటుంది. పెళ్లి విషయంపై ఒకరి అభిప్రాయాలు ఒకరు ముందుగా తెలుసుకోవడం అవసరమంటూ, ఆమె మోనీషా (అనశ్వర రాజన్) ను ఒక రెస్టారెంట్ లో కలుసుకోమని సత్యతో చెబుతుంది. మోనీషా - సత్య మాటల సందర్భంలో, గతంలో వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారనే విషయం బయటపడుతుంది.
సత్య - మోనీషా తమ టీనేజ్ ఒకే స్కూల్లో గడిచిందని మాట్లాడుకుంటారు. అప్పట్లో తన క్లాస్ మేట్ అనీషా (కావ్య అనిల్)ను తాను లవ్ చేశాననీ, అయితే తన మనసులోని ప్రేమను వ్యక్తం చేయలేకపోయానని సత్య అంటాడు. అనీషా తనకి దక్కకపోవడానికి కారకుడు దినేశ్ అని చెబుతాడు. ఆ తరువాత దినేశ్ తో బ్రేకప్ చేసుకున్న అనీషా, వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తాడు.
అదే స్కూల్లో తన క్లాస్ మేట్ బాలాజీ (సచిన్)ను తాను ఎంతగానో ఇష్టపడ్డానని మోనీషా చెబుతుంది. అయితే ఒక చిన్న కారణంగా తనని అతను అపార్థం చేసుకున్నాడని అంటుంది. అతనిని కలిసి సారీ చెప్పలేకపోయిన గిల్ట్ తనకి ఉందని మోనీషా చెబుతుంది. అనీషా - బాలాజీ ఎక్కడ ఉంటున్నారనేది తెలుసుకుని, అప్పుడు చెప్పదలచుకున్నవి ఇప్పుడు చెబితే మనసు తేలిక పడుతుందని సత్యను మోనీషా ఒప్పిస్తుంది. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? చివరికి వీళ్లిద్దరి పెళ్లి సంగతి ఏమౌతుంది? అనేది కథ.
సాధారణంగా పెళ్లైన చాలా కాలం వరకూ .. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేంత వరకూ తమ బ్రేకప్ స్టోరీలను బయటికి చెప్పరు. కానీ ఒక అబ్బాయి .. అమ్మాయి తమ బ్రేకప్ స్టోరీలతోనే పెళ్లిచూపుల
కార్యక్రమాన్ని మోడ్రన్ గా మొదలుపెట్టడం ఈ కథలోని కొత్త కోణం. అలా ఈ కథ ఆరంభంలోనే మార్కులు కొట్టేస్తుంది.
ఇక టీనేజ్ లో క్లాస్ మేట్స్ తో లవ్ పడటం .. అక్కడ చదువు పూర్తికాగానే దూరమైపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పట్లో ఉండే అనేక రకాల భయాల కారణంగా .. బిడియం కారణంగా .. తమ ప్రేమ విషయాన్ని చెప్పలేకపోయినందుకు చాలామంది ఫీలవుతూ ఉంటారు. అలాంటివారిని కలిసి అదే మాటను ఇప్పుడు చెప్పడం వలన మనసులోని భారం దిగుతుందనే ఒక పాయింట్ తో దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.
ఒక అబ్బాయికీ .. అమ్మాయికి పెళ్లికి ముందు ఒకరిని గురించి ఒకరికి తెలియాలి. అందుకోసం కొన్ని రోజుల పాటు వాళ్లు జర్నీ చేయాలి. అందుకోసం దర్శకుడు క్రియేట్ చేసిన సందర్భం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ జర్నీని వాళ్ల స్కూల్ డేస్ చుట్టూ .. అప్పట్లో వేరొకరితో జరిగిన తమ లవ్ ట్రాక్ చుట్టూ ఈ కథను తిప్పిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. స్కూల్ డేస్ లోని వారి ప్రేమకథలను .. ఇప్పటి వారి ప్రయాణాన్ని కలిపి చూపించే ప్రయత్నం మెప్పిస్తుంది.
దర్శకుడు మదన్ ఎంచుకున్న ఈ కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు. గతంలో ఈ తరహా కాన్సెప్ట్ తో కాస్త ఆటు ఇటుగా కొన్ని సినిమాలు వచ్చాయి. గతంలోకి వెళ్లి థ్యాంక్స్ చెప్పడాలు .. సారీ చెప్పడాలు గట్రా కథలు చూసినవే. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. టీనేజ్ ప్రేమలు ఇప్పుడు వీరిద్దరినీ విడదీస్తాయా ఏంటి? అనే ఒక కుతూహలాన్ని పెంచినతీరు ఆడియాన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది.
టీనేజ్ లోకి వెళ్లాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మన స్కూల్ .. మన తరగతి గదులు .. మనం కూర్చున్న బల్లాలను తడిమి చూసుకోవాలనిపించే కథ ఇది. హీరో - హీరోయిన్స్ గా అభిషన్ - అనశ్వర రాజన్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. అనీషా పాత్రను పోషించిన కావ్య అనిల్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథను బలంగా సపోర్ట్ చేయడం కనిపిస్తుంది. అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, లవ్ .. కామెడీని కలిపి నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. కాకపోతే కొన్ని సీన్స్ .. సాగదీసినట్టుగా .. కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి.
అపార్థాలు .. అలకలు .. బుజ్జగింపులు ప్రేమలో మామూలే. అలాంటి అన్ని అంశాలు ఈ కథలో వేసి కలపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. టీనేజ్ లో ఆకర్షణకి .. ప్రేమకి మధ్య అంతరాలు అంతుబట్టవు. భయపడితే ప్రేమ కూడా దూరమవుతుంది. నిజమైన ప్రేమను గుర్తించాలంటే పరిపక్వత అవసరమే అనే సందేశాన్ని సున్నితంగా అందించిన సినిమా ఇది. యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినప్పటికీ, ఫ్యామిలీతో కలిసి చూడగలిగే కథనే ఇది.
'విత్ లవ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
With Love Review
Movie Details
Movie Name: With Love
Release Date: 2026-03-06
Cast: Abhishan Jeevinth, Anashwara Rajan, Kavya Anil, Harish Kumar, Sacchin
Director: Madan
Music: Sean Roldan
Banner: Zion Films- Mrp Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer