'రోస్లిన్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!



మలయాళం నుంచి మరో థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది. ఆ సిరీస్ పేరే 'రోస్లిన్'. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్ కి 'షో రన్నర్' గా జీతూ జోసెఫ్ ఉండటంతో సహజంగానే, అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. 6 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్ కి సుమేశ్ నందకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ రోజు (ఫిబ్రవరి 27) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, ఆడియన్స్ అంచనాలను అందుకోగలిగిందా అనేది చూద్దాం.

శోభ (మీనా) జాన్ (వినీత్) భార్యాభర్తలు. వారి పెద్ద కూతురే రోస్లిన్ (సంజన దీపు) పసివాడైన ఆరోన్. ఇదే వాళ్ల ఫ్యామిలీ. 'రోజ్ వ్యాలీ'కి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ అక్కడి బంగ్లాలో వాళ్లంతా నివసిస్తూ ఉంటారు. రోస్లిన్ తరువాత పుట్టిన 'అలెన్' చనిపోవడంతో, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి వాళ్లకి చాలా సమయం పడుతుంది. అలెన్ కి సంబంధించిన జ్ఞాపకాలు రోస్లిన్ ను మరింత ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. 

17 ఏళ్ల రోస్లిన్ కి తరచూ ఒక కల వస్తుంటుంది. ఆకుపచ్చ వర్ణంతో కూడిన కళ్లు కలిగిన ఒక ముసుగు వ్యక్తి తనని తరుముతుండటమే ఆ కల. ఆ స్వప్నం గురించి తల్లిదండ్రులకు ఎన్నిమార్లు చెప్పినా వాళ్లు లైట్ తీసుకుంటారు. అలాంటి పరిస్థితులలో ఒక రీసెర్చ్ వర్క్ ఉందంటూ, జాన్ ఇంటికి 'జెర్రీ' అనే యువకుడు వస్తాడు. అతను శోభ స్నేహితురాలైన కవితకి దూరపు బంధువు. అందువలన పేయింగ్ గెస్ట్ గా ఉండటానికి శోభ - జాన్ అంగీకరిస్తారు. 

తన కలలో తరచూ  కనిపించే వ్యక్తి అతనేనని గ్రహించిన రోస్లిన్ భయపడిపోతుంది. ఆ విషయాన్ని తలిదండ్రులకు చెబుతుంది. అతని కదలికలు అనుమానంగా ఉన్నాయని అంటుంది. అతని కారణంగా ఏదో ప్రమాదం ముంచుకు రానుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పుడు రోస్లిన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు? జెర్రీ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? రోస్లిన్ ఎదుర్కోబోయే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
        
ఎక్కడ మొదలుపెట్టాము .. ఎలాంటి మలుపులలో పరిగెత్తించాము .. ఎలా ముగించాము అనే విషయాలపైనే ఏ కథ అయినా ఆధారపడి ఉంటుంది. కథను చెప్పడంలో .. కథనాన్ని నడిపించడంలోనే అసలైన వ్యవహారమంతా ఉంటుంది. మొదట్లోనే ఏం జరిగిందో చూపించి, ఎలా జరిగిందో చూపించడమనేది కొన్ని కథల్లో కనిపిస్తుంది. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వెళ్లడం మరికొన్ని కథల్లో కనిపిస్తుంది. ఇక చివరివరకూ వెయిట్ చేయించడమనేది మరో స్టైల్. 

అలా చివరి ఎపిసోడ్ లో .. చివరి సీన్ వరకూ ఏం జరుగుతుందో తెలియకుండా నడిచిన కథ .. నడిపించిన కథనమే 'రోస్లిన్'. ఒక 'రోజ్ వ్యాలీ' .. భార్యభర్తలు .. టీనేజ్ కూతురు .. ఓ పసిబిడ్డ .. కొత్తగా ఆ ఇంటికి గెస్టుగా వచ్చిన ఒక యువకుడు. ఈ పాత్రల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. టీనేజ్ అమ్మాయికి తరచుగా వచ్చే 'పీడకల' గురించే ఆడియన్స్ ఆలోచన చేస్తూ వెళతారు.

ఆ అమ్మాయికి ఆ పీడకల ఎందుకు వస్తోంది .. అందుకు గల కారణం ఏమిటి? అనే విషయం ఎప్పుడు రివీల్ అవుతుందా అనే కుతూహలంతో ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. కానీ వాళ్లు ఏ మాత్రం గెస్ చేయని మరో కోణం ఈ కథలో అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది.'షో రన్నర్' గా జీతూ జోసెఫ్ పేరు విన్నప్పుడే ఈ తరహా ట్విస్టులు ఉంటాయనే విషయం మనకి అర్థమైపోతూ ఉంటుంది. నిజంగానే ఆయన ఆడియన్స్ మరోసారి ఉలిక్కిపడేలా చేయగలిగారు.

ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 5 ఎపిసోడ్స్ వరకూ ఆడియన్స్ ఆలోచనలోనే ఉంటారు. 6 ఎపిసోడ్ దగ్గర పడుతున్నా ఇంకా ఏమీ తేలడంలేదే అనే ఒక చిన్నపాటి అసహనానికి లోనవుతారు. అలా 5 ఎపిసోడ్స్ లో అసంతృప్తిని కలిగించే సమయాలను భర్తీ చేసేస్తూ 6 ఎపిసోడ్ ఉంటుంది. కథ మొత్తాన్ని మోసే ఎపిసోడ్ ఇది. అనేక కీలకమైన మలుపులకు క్లారిటీ ఈ ఎపిసోడ్ లోనే దొరుకుతుంది.

ఫ్లాష్ బ్యాక్ .. వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు .. ఇవన్నీ కూడా ఈ కథలోని షేడ్స్ ను ఎప్పటికప్పుడు మార్చేస్తూ వెళుతుంటాయి. పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా కొత్తగా అనిపిస్తుంది. 5 ఎపిసోడ్స్ చూసిన ప్రేక్షకులు ఏదైతే ఊహించుకుంటారో, అందుకు భిన్నంగా జరిగే ఆరో ఎపిపోడ్ హైలైట్ గా నిలుస్తుంది. పాత్రల స్వభావాలు .. కథా స్వరూపం మారిపోయే తీరు ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది. 

వినీత్ .. మీనా .. సంజన దీపు .. హకీమ్ షాజహాన్ నటన గొప్పగా అనిపిస్తుంది. సీనియర్ ఆర్టిస్టుల సంగతి అలా ఉంచితే, సంజన దీపు నటన గొప్పగా అనిపిస్తుంది. ఉన్నికృష్ణన్ ఫొటోగ్రఫీ .. విష్ణు శ్యామ్ నేపథ్య సంగీతం .. రియాజ్ ఎడిటింగ్ ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పచ్చు. 

కథ .. కథనం .. పాత్రలను ఆవిష్కరించిన విధానం .. ట్విస్టులు .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఇలా అన్నీ కుదిరిన సిరీస్ ఇది. చాలా తక్కువ పాత్రలతోనే ఉత్కంఠను రేకెత్తించే అవుట్ పుట్ ఇది. చాలా రోజుల తరువాత ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ ను చూసిన భావన కలుగుతుంది. ఫ్యామిలీతో  కలిసి ఈ సిరీస్ ను చూడొచ్చు.  


Movie Details

Movie Name: Roslin

Release Date:

Cast: Meena, Sanjana Dipu, Vineeth, Hakim Shahjahan, Anishma Anilkumar

Director: Sumesh Nandakumar

Producer: Mathew George

Music: Vishnu Shyam

Banner: Central Advertising

Roslin Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews