'ది రాజాసాబ్‌ ' సినిమా రివ్యూ

  • ఫాంటసీ హారర్‌ కామెడీగా ' ది రాజాసాబ్‌' 
  • ఆకట్టుకోని కథ, కథనాలు 
  • అలరించే ప్రభాస్‌ నటన,లుక్‌ 
  • విసుగు తెప్పించే సెకండాఫ్‌ 


బాహుబలి' తరువాత పాన్‌ ఇండియా కథలనే ఎంచుకుంటున్న హీరో ప్రభాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథతో  సినిమాను చేసి చాలా కాలమైంది. అందుకే ప్రభాస్‌ ఈసారి అభిమానుల కోసం హారర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కథాంశంతో  'ది రాజాసాబ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ అందర్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఫాంటసీ హారర్‌ కామెడీగా రూపొందిన 'ది రాజాసాబ్‌' ఎలా ఉంది? ప్రభాస్‌ అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? లేదా సమీక్షలో తెలుసుకుందాం. 

కథ: రాజు అలియాస్‌ రాజాసాబ్‌కు (ప్రభాస్‌) నాన్నమ్మ గంగా దేవి (జరీనా వహాబ్‌) అంటే ప్రాణం.  ఆమెతో కలిసి ఉంటూ, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. వయసు రీత్యా గంగా దేవి అల్జీమర్స్‌ (మతిమరుపు వ్యాధి)తో బాధపడుతుంటుంది. గంగమ్మ తనకు సంబంధించిన విషయాలు మరిచిపోయినా తన భర్త కనకరాజును  (సంజయ్‌దత్‌) మాత్రం మరిచిపోదు. ఎప్పటికైనా తాతను తీసుకరమ్మని మనవడిని కోరుతుంది. అనుకోకుండా ఓసారి ఓఫోటోలో కనిపించిన కనకరాజును వెతుక్కుంటూ హైదరాబాద్‌ బయలుదేరుతాడు రాజాసాబ్‌. కానీ కనకరాజ్‌ తన మాయాలతో నాన్నమ్మ, మనవడిని నర్సాపూర్‌ అడవిలోని తన భవంతికి రప్పించుకుంటాడు. అంతేకాదు ఇద్దరిని అంతమెందించాలని ప్రయత్నిస్తాడు. అసలు రాజాసాబ్‌ ఎవరు? కనకరాజ్‌ ఎందుకు రాజాసాబ్‌, గంగాదేవిని చంపాలనుకుంటాడు? గంగాదేవికి రాజవంశానికి ఉన్న సంబంధమేమిటి? రాజాసాబ్‌ ముగ్గురమ్మాయిలు భైరవి (మాళవిక మెహనన్‌), బ్లెస్సీ (నిధి అగర్వాల్‌) అనిత (రిద్దికుమార్‌)లను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? కథను ముందుకు నడిపించడంలో వీరి పాత్రలు ఎలా ఉపయోగపడ్డాయి? చివరకు కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: కొంతకాలంగా సీరియస్‌ కథలను చేస్తూ వచ్చిన ప్రభాస్‌ ఈ సారి 'ది రాజాసాబ్‌'తో ఓ వినోదాత్మక కథతో ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఇప్పటి వరకు తను టయ్‌ చేయని హారర్‌, ఫాంటసీ,ఎంటర్‌టైనర్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక కథ విషయానికొస్తే ఆరంభంలో చూస్తే ఇదేమీ కొత్త కథ కాదు అనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. ప్రభాస్‌లోని కామెడీ టైమింగ్‌తో ఓ ఎంటర్‌టైనర్‌ కోసం దర్శకుడు మారుతి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్‌ పేపర్‌మీద రాసుకున్నప్పుడు కొత్తగా అనిపించినా, ఈ కథను తెర మీదికి తీసుకరావడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదని అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో దర్శకుడు చెప్పాలనుకున్నా విషయంపై క్లారిటీ లేదనే భావన కలుగుతుంది. ఫస్టాఫ్‌ పర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమాలో సన్నివేశాలు జరిగిపోతున్నా, అవీ ప్రేక్షకులను కథలో లీనమై చేసేంత బలమైన సన్నివేశాలు కాకపోవడమే ఈ సినిమాకు మైనస్‌. హారర్‌ సన్నివేశాలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. సినిమాలోని ప్రతి సన్నివేశం ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. సినిమా ఆద్యంతంలో ఎక్కడా కూడా ఓ కొత్త సన్నివేశం చూశామనే సంతృప్తి ఉండదు. ముఖ్యంగా నాన్నమ్మ, మనవడి మధ్య ఉండే బాండింగ్‌లో కూడా ఎమోషన్‌ మిస్‌ అయ్యింది. సంజయ్‌దత్‌ పాత్రను, ఆ పాత్ర అలా మారిపోవడానికి గల కారణం బలంగా ఉన్నప్పటికీ ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందనిపించింది. హీరో పాత్ర చిత్రణ కూడా శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు. మార్మిక విద్య, మాయాలు.. ఇలాంటి  సన్నివేశాలు ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజన్‌లోకి లాగేస్తాయి. సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఫర్వాలేదనిపిస్తాయి. అయితే కంటెంట్‌లో బలం లేకపోతే టెక్నికల్‌గా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికి అది వృథా ప్రయత్నమే అనిపిస్తుంది. చివర్లో 'రాజాసాబ్‌ సర్కస్‌' అంటూ రెండో భాగానికి లీడ్‌ ఇచ్చి ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచడానికి ప్రయత్నించారు. 

నటీనటుల పనితీరు: రాజాసాబ్‌గా ప్రభాస్‌గా ఎంతో ఎనర్జీతో కనిపించాడు. చాలా రోజుల కామెడీ జోనర్‌లో  తన టైమింగ్‌తో  అలరించాడు. అంతేకాదు లుక్‌ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. కథానాయికల్లో మాళవిక మెహన్‌ గ్లామర్‌గా కనిపించడంతో పాటు ఓయాక్షన్‌ ఏపిసోడ్స్‌లో కూడా కనిపించింది. నిధి అగర్వాల్‌, రిద్దికుమార్‌లు పాటల్లో ఆకర్షణీయంగా ఉన్నారు. సంజయ్‌ దత్‌లోని పూర్తి స్థాయి నటనకు తగ్గ పాత్రలా అనిపించలేదు. నాన్నమ్మగా జరీనా వహబ్‌ పాత్ర హుందాగా ఉంది. బొమన్‌ ఇరానీ,  సముద్రఖని తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభాస్‌ శీను, సప్తగిరి, వీటీ గణేషన్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి ప్రయత్నించారు. తమన్‌ నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్‌ చేసే విధంగా లౌడ్‌గా ఉంది. కార్తీక్‌ పళని కెమెరా ప్రతిభ సినిమాకు ప్లస్‌ అయ్యింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. 


ఫైనల్‌గా : కొత్తదనం లేని కథతో తెరకెక్కిన ఈ ఫాంటసీ హారర్‌ కామెడీ అక్కడక్కడా మెప్పిస్తుంది!

Movie Details

Movie Name: THE RAJA SAAB

Release Date:

Cast: Prabhas, Nidhhi Agerwal, Malavika Mohanan, Riddhi Kumar, Sanjay Dutt, Boman Irani

Director: Maruthi

Producer: TG Vishwa Prasad, Krithi Prasad

Music: Thaman

Banner: People Media Factory

THE RAJA SAAB Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews