'మిస్ పెర్ఫెక్ట్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

Miss Perfeci

Movie Name: Miss Perfeci

Release Date: 2024-02-02
Cast: Lavanya Tripathi, Abhijeeth, Harshavardhan, Abhignya, Jhansi, Mahesh Vitta, Sunaina
Director:Vishwak Khande Rao
Producer: Supriya Yarlagadda
Music: -
Banner: Annapurna Studios
Rating: 2.75 out of 5
  • 'మిస్ పెర్ఫెక్ట్'గా లావణ్య త్రిపాఠి
  • లాక్ డౌన్ నేపథ్యంలో నడిచే కథ  
  • అపార్టుమెంటులో దాగుడుమూతలాట
  • కథ పుంజుకోవడంలో జరిగిన ఆలస్యం
  • అక్కడక్కడా మాత్రమే కనిపించే ఫన్  
  • తక్కువ పాత్రలతో చేసిన ప్రయోగం

లావణ్య త్రిపాఠి ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లపై ఎక్కువగా దృష్టి పెట్టడం కనిపిస్తుంది. ఆ మధ్య ఆమె నుంచి వచ్చిన 'పులి మేక' సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తాజా సిరీస్ గా రూపొందిన 'మిస్ పెర్ఫెక్ట్' 8 ఎపిసోడ్స్ గా నిన్నటి నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో టైటిల్ రోల్ ను ఆమెనే పోషించింది. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో అంచనాలు పెంచుతూ వచ్చిన ఈ సిరీస్, ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం.

లావణ్య (లావణ్య త్రిపాఠి) ఢిల్లీలో జాబ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా సరే పెర్ఫెక్ట్ గా ఉండాలి .. ఎక్కడ ఏది ఉండాలో అదే ఉండాలి. శుభ్రత .. పరిశుభ్రత పాటించకపోతే ఆమెకి ఇరిటేషన్ వస్తుంది. తనే అక్కడ శుభ్రం చేయడానికి ఎంతమాత్రం వెనుకాడదు. అలా చేయకపోతే ఆమెకి మనశ్శాంతి ఉండదు. అది ఒక రకమైన మానసిక రుగ్మతనే అని స్నేహితురాలు ఇందూ ( సునయన) చెబుతూనే ఉంటుంది. అయినా లావణ్య వినిపించుకోదు. 

 బిజినెస్ రీత్యా లావణ్య తండ్రి గోకుల్ (హర్షవర్ధన్) ముంబైలో ఉంటూ ఉంటాడు. అయితే గతంలో గోకుల్ హైదరాబాదులో ఒక అపార్టుమెంటులో ఫ్లాట్ తీసుకుంటాడు. హైదరాబాద్ కి ఏ పనిపై వచ్చినా, సొంత ఫ్లాట్ లోనే దిగుతూ ఉంటాడు. ఆ అపార్టుమెంటు అసోసియేషన్ కి ప్రెసిడెంటుగా రాజ్యలక్ష్మి (ఝాన్సీ) ఉంటుంది. అక్కడ ఆమె పెత్తనమే కొనసాగుతూ ఉంటుంది. ఆమె అంటే సెక్యూరిటీ గార్డు శ్రీను (మహేశ్ విట్టా)కి  చచ్చేంత భయం.

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడానికి ముందు, ఉద్యోగ రీత్యా లావణ్య హైదరాబాద్ చేరుకుంటుంది. తన తండ్రికి కాల్ చేసి విషయం చెప్పి సొంత ఫ్లాట్ లో దిగిపోతుంది. అక్కడ వంటమనిషిగా జ్యోతి (అభిజ్ఞ) ఎంట్రీ ఇస్తుంది. ఆమెకి పాటలు పాడటమంటే ఇష్టం. సెలక్షన్స్ కోసం తమ్ముడు కార్తీక్ తో కలిసి హైదరాబాద్ వచ్చేస్తుంది. ఇక అప్పటి నుంచి అక్కడే ఉండిపోతుంది. 'యూత్ అంటే యూ ట్యూబ్' అంటూ కార్తీక్ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటూ ఉంటాడు. జ్యోతి మాత్రం  గలగలమని మాట్లాడుతూ, పైపైనే పనులు కానిస్తూ రోజులు గడిపేస్తూ ఉంటుంది.

జ్యోతి ఇంటి దగ్గర ఒకరికి కరోనా రావడంతో, కంటోన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తారు. తాను పనికి రాలేనని లావణ్యకి కాల్ చేసిన జ్యోతి, ఆ విషయాన్ని మరో ఫ్లాట్ లో ఉన్న రోహిత్ ( అభిజిత్)కి చెప్పమంటుంది. ఆ మాట చెప్పడానికి వెళ్లిన లావణ్యను మరో పనిమనిషి అని అతను అనుకుంటాడు. ఒకానొక సందర్భంలో తన పేరు లక్ష్మి అని లావణ్య అతనికి అబద్ధం చెబుతుంది. ఆమె గ్లామర్ చూసి మనసు పారేసుకున్న రోహిత్, జ్యోతిని పనిలో నుంచి తీసేస్తాడు. 

తన పై అధికారిగా లావణ్య వచ్చిందనే విషయం లాక్ డౌన్ వలన రోహిత్ కి తెలియదు. తన ఆఫీసులోనే అతను పనిచేస్తున్నాడని లావణ్యకి తెలియదు. ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఇక ఆ అపార్టుమెంటులో రాజ్యలక్ష్మితో గోకుల్ కి వివాహేతర సంబంధం ఉంటుంది. లావణ్యకి తెలియకుండా అదే అపార్టుమెంటుకి సీక్రెట్ గా వచ్చిన గోకుల్, లాక్ డౌన్ కారణంగా రాజ్యలక్ష్మి ఫ్లాట్ లోనే చిక్కుబడతాడు. 

ఇక తార అనే యువతితో రోహిత్ పెళ్లి జరిపించాలని అతని తల్లి శ్రీదేవి నిర్ణయించుకుంటుంది. కానీ కొంతకాలంగా కొడుకు ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలిసి, అతనిపై జ్యోతినే నిఘాపెడుతుంది. ఈ సీక్రెట్ ఆపరేషన్ పూర్తిచేయడానికి తన తమ్ముడు కార్తీక్ తో  కలిసి జ్యోతి రంగంలోకి దిగుతుంది. పర్యవసానంగా లావణ్య - రోహిత్ లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? రాజ్యలక్ష్మి - గోకుల్ లవ్ ట్రాక్ ఏమౌతుంది? జ్యోతి సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? అనేది కథ. 

ఈ సిరీస్ కి ఫ్రాన్సిస్ థామస్ - శ్రుతి రామచంద్రన్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. విష్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. ఇది లాక్ డౌన్ నేపథ్యంలో ఒక అపార్టుమెంటు పరిథిలో జరిగే కథ. అంటే ప్రధానమైన అరడజను పాత్రలు మినహా అపార్టుమెంటు వాసులెవరూ కనిపించరన్నమాట. అందువలన ఈ అరడజను పాత్రల మధ్య జరిగే దాగుడుమూతలాటనే మనం చూడవలసి ఉంటుంది.

లాక్ డౌన్ పేరుతో తక్కువ పాత్రలతో కథను అల్లుకున్న తీరు బాగుంది. అదే విధంగా లాక్ డౌన్ సందర్భంగా ట్రాకులను సెట్ చేసుకున్న తీరు కూడా తమాషాగానే అనిపిస్తుంది. అయితే కథనం చాలా నిదానంగా .. నింపాదిగా సాగుతూ ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ లో .. ఐదో ఎపిసోడ్ వరకూ కథ నీరసంగానే కదులుతూ ఉంటుంది. 5వ ఎపిసోడ్ నుంచి కథలో కాస్త కదలిక మొదలవుతుంది. 6వ ఎపిసోడ్ నుంచి సరదా .. సందడి మరింత పుంజుకుంటాయి. అందువలన కథ అసలు విషయాన్ని అందుకోవడంలో ఆలస్యమైందనే చెప్పాలి. 

రోహిత్ - లావణ్య ట్రాక్ .. గోకుల్ - రాజ్యలక్ష్మి ట్రాక్ .. జ్యోతి - కార్తీక్ ట్రాక్ కలిసి ఈ కథను నడిపిస్తాయి. అయితే ప్రధానమైన రెండు ట్రాకుల కంటే, పనిమనిషిగా జ్యోతి ట్రాక్ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. నటన పరంగా అందరూ బాగానే చేసినా, జ్యోతి పాత్ర ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం .. ఆదిత్య జవ్వాది ఫొటోగ్రఫీ .. రవితేజ గిరజాల ఎడిటింగ్ బాగానే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి తక్కువగానే ఉన్నా కంటెంట్ టైట్ గా అనిపించదు .. కథనంలో వేగం కనిపించదు. ఈ రెండూ కుదిరి ఉంటే, మరింత ఫన్ ను పిండటానికి అవకాశం ఉండేదేమో అనిపిస్తుంది.

Trailer

More Reviews