ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథల పట్ల ఆడియన్స్ చాలా కుతూహలంతో ఉంటారు. నేరస్థుల వ్యూహాలు .. ఆధారాలతో సహా వాళ్లను చట్టానికి పట్టించడానికి జర్నలిస్టులు చేసే ప్రయత్నాలు వంటి కథల పట్ల ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాంటి ఒక కంటెంట్ తో ఓటీటీ స్క్రీన్ పైకి వచ్చిన సినిమానే 'రిపోర్టింగ్ లైవ్'. పరిణీతి చోప్రా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వం వహించాడు. ఈ నెల 9వ తేదీన నేరుగా 'నెట్ ఫ్లిక్స్'లో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
సంధ్య యాదవ్ (పరిణీతి చోప్రా) ఒక పేరున్న టీవీ ఛానల్ లో న్యూస్ రిపోర్టర్. కెమెరామెన్ వినోద్ శర్మ ( దేవెన్ భోజాని)తో కలిసి ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఆ సిటీలో ఆమె నాయనమ్మతో కలిసి నివసిస్తూ ఉంటుంది. సొంతఇల్లు కొనుక్కుని సెటిలై పోవాలనేది ఆమె కోరిక. ఇక వినోద్ కి భార్య పూజ .. కూతురు 'ఇరా'నే లోకం. వాళ్ల కోసమే అతను కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. వీడియో జర్నలిస్ట్ అనిపించుకోవాలనేది అతని ముందున్న ఆశయం. ఇక తాము అందించే సమాచారంతో, ఛానల్ రేటింగ్ పెంచాలనేది వాళ్ల ముఖ్య ఉద్దేశం.
అలాంటి పరిస్థితులలోనే 'విసర్గావ్' అనే విలేజ్ దగ్గర 'సుమతి' నదిపై కట్టిన బ్రిడ్జ్ కూలిపోతుంది. ఆ వంతెనపై నుంచి వెళుతున్న స్కూల్ వ్యాన్ ఆ నదిలో పడిపోవడంతో స్కూల్ పిల్లలంతా చనిపోతారు. ఈ న్యూస్ ను కవర్ చేయడానికి సంధ్య - వినోద్ అక్కడికి వెళతారు. అక్కడ వాళ్లకి 'శివయ్య' తారసపడతాడు. నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనీ, బ్రిడ్జ్ కూలిపోవడానికి ఇసుక తవ్వకాలే కారణమని అతను చెబుతాడు. అంతే కాకుండా రాత్రి వేళలోను తవ్వకాలు జరుగుతున్న తీరును రహస్యంగా చూపిస్తాడు.
ఇసుక తవ్వకాల కారణంగా నది తన ప్రవాహ దిశను మార్చుకుందనీ, అందువలన వేల ఎకరాలు బీడు భూములుగా మారిపోయాయని సంధ్య వాళ్లకి తెలుస్తుంది. పోలీస్ అధికారులు .. ఇతర ప్రభుత్వ అధికారుల జేబులు నిండుతూ ఉండటం వల్లనే, ఇదంతా యధేశ్చగా సాగుతుందనే విషయాన్ని కవర్ చేస్తారు. దీని వెనకాల ఉన్న పెద్ద తలకాయ ఎవరిదన్నది తెలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఫలితంగా వాళ్లకి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
'విసర్గావ్' అనే ఒక విలేజ్ దగ్గర .. సుమతి అనే నదిపై నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోతుంది. ఆ ప్రమాదంలో స్కూల్ పిల్లలు చాలామంది చనిపోతారు. అది కేవలం ఒక ప్రమాదంగా భావించి, కవర్ చేయడానికి వెళుతుంది రిపోర్టర్ సంధ్య. అయితే ఆ ప్రమాదం వెనుక ఇసుక మాఫియా ఉందని తెలుసుకున్న ఆమె, ఆ నిజాన్ని బయటపెట్టడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందనే అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
ఒక విలేజ్ ను అడ్డాగా చేసుకుని ఇసుక మాఫియా ఎలా జరుగుతుంది .. ఇసుక ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా తరలించబడుతుంది .. ఈ విషయమై ప్రశ్నించిన వాళ్లంతా ఎలా అదృశ్యమైపోతున్నారనే విషయంపై జర్నలిస్ట్ సంధ్య ఆరా తీయడం గురించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఆ నిజాలను బయటపెట్టడంతో ఆమె ఎదుర్కునే పరిణామాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
ఇసుక మాఫియాను నేపథ్యంగా చేసుకుని అల్లుకున్న కథ ఇది. ఇసుకను అక్రమంగా ఎలా తరలిస్తారు .. రహస్యంగా జరిగే ఈ కార్యక్రమం వెనుక ఎంతమంది పనిచేస్తారు. పోలీస్ అధికారులు .. రాజకీయనాయకులు ఎందుకు తమకేమీ పట్టనట్టుగా ఉంటారనే విషయాలను దర్శకుడు టచ్ చేస్తూ వెళ్లిన తీరు .. సాధారణ ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది.
అలాగే టీవీ ఛానల్స్ కొన్ని వార్తలను ప్రసారం చేయడానికి ఎందుకు ఆలోచిస్తాయి .. దాని వెనక ఆర్థికపరమైన లావాదేవీలు ఎలా ఉంటాయి .. నిజాయితీ పరులైన జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఆవిష్కరించిన విధానం కూడా ఆలోచింపజేస్తుంది. కొందరు అక్రమార్కులను .. కొందరు అవినీతి పరులను పావులుగా ఉపయోగించుకుంటూ కొన్ని స్వార్థ శక్తులు ఎలా ఎదుగుతూ వెళుతున్నాయనేది దర్శకుడు చూపించిన విధానం బాగానే ఉంది.
సంధ్య ఫ్యామిలీ వైపు నుంచి గానీ .. వినోద్ ఫ్యామిలీ వైపు నుంచి గానీ బలమైన ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు రాసుకోలేదు. చూపించిన సన్నివేశాలు చాలా తేలికగా అనిపిస్తాయి. ఇక నాజర్ ఈ సినిమాకి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఆయన పాత్రకు కూడా అంతగా పవర్ పెంచే ప్రయత్నం జరగలేదు. ప్రధానమైన .. కీలకమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.
గతంలో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. సినిమాలుగా .. సిరీస్ లుగా ప్రేక్షకులను పలకరించాయి. వాటికి భిన్నమైన సన్నివేశాలేవీ ఇందులో కనిపించవు. ట్విస్టులు కూడా అంతగా ఆడియన్స్ పై ప్రభావం చూపించవు. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ముందుగానే మన అంచనాలకు దొరికిపోతూనే ఉంటుంది. రొటీన్ గానే ఈ కంటెంట్ మొదలవుతుంది .. అంతే రొటీన్ గా ముగుస్తుంది. ఓ మాదిరి కేటగిరిలోకే జారిపోయే కంటెంట్ ఇది.
'రిపోర్టింగ్ లైవ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Reporting Live Review
Movie Details
Movie Name: Reporting Live
Genre: Crime, Thriller
Release Date: 2026-10-09
Cast: Parineeti Chopra, Deven Bhojani, Amol Palekar, Shekhar Suman, Adil Hussain,Nasser
Director: Dhruv Tripathi
PRO: -
Music: Zubin Balaporia - Vijay Prakash
Banner: Old Monk Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer