మలయాళంలో సైజు కురుప్ కి మంచి ఇమేజ్ ఉంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు అందుకు కారణమని చెప్పాలి. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే 'భరత్ నాట్యం'. 2024 లో ఆగస్టు 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమాకి థియేటర్ల వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది.
భరత్ నాయుడు ( మలయాళ సాయికుమార్) పదవీ విరమణ తరువాత ఇంటిపట్టునే ఉంటాడు. ఆయన భార్య 'సరస్వతి' ఆయనను అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది.పెద్ద కొడుకు శశిధర్ ( సైజు కురుప్) పొలాలు .. తోటలు అందుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాడు. ఇక పై చదువులకు పట్నం వెళ్లాలనేది చిన్న కొడుకు అరుణ్ (జినిల్) ఆలోచన. పెద్ద కూతురు 'శాంతి' ఆమె భర్త 'అశోకన్' ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా, చిన్న కూతురు శ్రీలత .. ఆమె భర్త గోపాలన్ కూడా ఆ ఇంటికి చేరతారు.
ఈ నేపథ్యంలోనే భరత్ నాయుడికి గుండెపోటు వస్తుంది. వెంటనే ఆయనను హాస్పిటల్లో చేరుస్తారు. ఆయన పరిస్థితి కష్టంగానే ఉందని డాక్టర్ చెబుతుంది. ఆ సమయంలోనే భరత్ నాయుడు తన పెద్ద కొడుకైన శశిధర్ ను పిలిచి, తనకి రెండో భార్య ఉందనీ .. ఆమెకి 'అజయ్' అనే కుమారుడు కూడా ఉన్నాడనే ఒక నిజాన్ని చెబుతాడు. వాళ్లిద్దరినీ చూడాలని ఉందనీ, శ్రీకంఠపురం వెళ్లి వాళ్లను తీసుకురమ్మని కోరతాడు. తండ్రి చివరి మాటను తల్లితో చెప్పి ఒప్పిస్తాడు శశిధర్. శ్రీకంఠపురం నుంచి రుక్మిణీ - అజయ్ లను తీసుకొస్తాడు.
అయితే ఊహించని విధంగా భరత్ నాయుడు కోలుకుంటాడు. దాంతో రుక్మిణీ - అజయ్ లను ఊరికి పంపించేయాలని చూస్తాడు శశిధర్. కుదరకపోవడంతో తన ఇంట్లోనే పై గదిలో వాళ్లను రహస్యంగా ఉంచుతాడు. వాళ్లు ఊళ్లో ఎవరి కంట్లో పడకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఆస్తిలో వాళ్లు వాటా అడుగుతారేమోనని శశిధర్ భయపడతాడు. సరస్వతితో పెళ్లి రిజిస్టర్ కాలేదనీ, రుక్మిణితో పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయనే విషయం ఆ సమయంలోనే అతనికి తెలుస్తుంది. అప్పుడు శశిధర్ ఏం చేస్తాడు? చివరికి ఆస్తి ఎవరికి దక్కుతుంది? అనేది కథ.
తండ్రి చావు బ్రతుకులలో ఉండగా, ఆయనకి రెండో ఫ్యామిలీ ఉందనే విషయం శశిధర్ కి తెలుస్తుంది. ఆయన చివరి కోరికను తీర్చడం కోసం, ఆ ఫ్యామిలీని తీసుకొస్తాడు. భరత్ నాయుడు మొదటి పెళ్లికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉండవు. కానీ రెండో పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు పక్కాగా ఉంటాయి. దాంతో తనకి దక్కుతుందని భావించిన ఆస్తులకు రెక్కలు వచ్చాయని భయపడిన శశిధర్ ఏం చేస్తాడనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
ఉమ్మడి కుటుంబంలోని సమస్యలు .. బరువు బాధ్యతలు .. తండ్రికి సీరియస్ కావడం .. అతనికి సెకండ్ ఫ్యామిలీ ఉందని తెలియడం .. వాళ్లను ఊరు నుంచి తీసుకురావడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. తండ్రికి సెకండ్ ఫ్యామిలీ ఉందనే నిజం బయటికి తెలియకుండా దాచడానికి చేసే ప్రయత్నాలు .. ఆస్తుల విషయంలో అభద్రతా భావం తాలూకు సన్నివేశాలు సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి.
దర్శకుడు ఈ కథను మొదటి నుంచి చివరివరకూ చాలా పట్టుగా నడిపించాడు. సహజత్వంతో కూడిన సన్నివేశాలను, ఆసక్తికరంగా ఆవిష్కరిస్తూ వెళ్లాడు. కావాలని ఇరికించినట్టుగా కాకుండా, సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ వెళ్లాడు. తన తండ్రికి సెకండ్ ఫ్యామిలీ ఉందనే విషయం ఊళ్లోవాళ్లకి తెలియకుండా దాచడం కోసం శశిధర్ పడే పాట్లు, అతని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సన్నిహితులు చేసే ప్రయత్నాలు సరదాగా నవ్విస్తాయి.
ముఖ్యంగా భరత్ నాయుడు మొదటి భార్య రెండో కొడుకు అరుణ్ .. రెండో భార్య కొడుకు అజయ్ లను ట్విన్స్ గా డిజైన్ చేసిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఈ ఇద్దరూ ఒకే చోట కనిపిస్తే ఊళ్లో వాళ్లకు డౌట్ వస్తుందనే ఉద్దేశంతో నడిపించే ఒక కన్ఫ్యూజన్ డ్రామా కామెడీని బాగా వర్కౌట్ చేసింది. ఈ సినిమాను వినోదభరితంగా మరింత బలంగా మార్చడానికి ఈ ట్రాక్ బాగా ఉపయోగపడిందని చెప్పాలి.
దర్శకుడు ఈ కథలోని పాత్రలను మలిచిన తీరు .. వాటిని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఆశలు .. అవసరాలు .. ఆపదలు .. ఆస్తులు అనేవి మనుషుల స్వభావాలను ఎలా మారుస్తాయి? అనే అంశాన్ని దర్శకుడు తెరమీదకి తీసుకొచ్చిన తీరు ఆలోచింపజేస్తుంది. ఆస్తుల కంటే బంధాలు .. అనుబంధాలు గొప్పవి. ఒక వ్యక్తిని ప్రేమించడమంటే ఆ వ్యక్తిలోని బలహీనతలను అర్థం చేసుకుని అంగీకరించడం అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది.
కథాకథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. బబ్లూ ఫొటోగ్రఫీ .. శామ్యూల్ సంగీతం .. షఫీక్ ఎడిటింగ్ ఈ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయని చెప్పాలి. నటీనటులంతా తమ పాత్రలకు జీవం పోశారు. సందేశం .. వినోదం సమపాళ్లలో కలిసిన ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడొచ్చు.
'భరత్ నాట్యం' (ఆహా) మూవీ రివ్యూ!
Bharath Natyam Review
Movie Details
Movie Name: Bharath Natyam
Genre: Comedy, Drama
Release Date: 2026-09-11
Cast: Sai Kumar, Saiju Kurup, Abhiram Radhakrishnan, Kalaranjini, Sreeja Ravi
Director: Krishnadas Murali
PRO: -
Music: Samuel Aby
Banner: Thomas Thiruvalla Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer