హారర్ కామెడీ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై లభించే ఆదరణ ఎక్కువ. అందునా మలయాళం నుంచి వచ్చే ఈ జోనర్ సినిమాల పట్ల మరింత ఆసక్తిని చూపుతుంటారు. అలా ఈ వారం ఓటీటీకి వచ్చిన సినిమాగా 'మహారాజా హాస్టల్' కనిపిస్తుంది. జూన్ 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది.
అరవింద్ .. మిథున్ .. వర్కి .. ముగ్గురూ మంచి స్నేహితులు. ముగ్గురూ మిడిల్ క్లాస్ కుర్రాళ్లే. ఇంజనీరింగ్ కి రాగానే, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారనే ఉద్దేశంతో పెద్ద కాలేజ్ లో చేరతారు. అయితే అక్కడ వాళ్లకి నిరాశే ఎదురవుతుంది. ఆ క్లాస్ లో అమ్మాయిలు పెద్దగా లేకపోవడంతో ముగ్గురూ డీలాపడిపోతారు. హాస్టల్ ఖర్చుల కోసం ఇంటి దగ్గర నుంచి వచ్చే డబ్బులు మిగుల్చుకుని, స్వేచ్ఛగా మందు కొట్టొచ్చని అనుకుంటారు. అందుకోసం ఎలాంటి వసతులు లేకపోయినా, ఒక పాతకాలం నాటి హాస్టల్లో చేరతారు.
కాలేజ్ లో అరవింద్ కి 'దీపిక' అనే అమ్మాయి పరిచయమవుతుంది. అయితే ఆమెతో 'శంభూ' అనే మరో స్టూడెంట్ చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటాడు. తనని గాయపరిచిన అరవింద్ టీమ్ పై కోపంతో అతను వాళ్లకి ఒక టాస్క్ ఇస్తాడు. అరవింద్ వాళ్లు అడవిలోకి వెళ్లి, అతను చెప్పిన చోటునున్న ఒక ఎర్ర క్లాత్ ను తీసుకురావలసి ఉంటుంది. ఆ అడవికి వెళ్లిన ముగ్గురూ భయంకరమైన ఆకారాన్ని చూసి, అక్కడి నుంచి పారిపోయి తిరిగొస్తారు. అప్పటి నుంచి ఆ ఆకారం తమను ఫాలో అవుతూ ఉండటం గమనిస్తారు.
ఇక హాస్టల్లో వార్డెన్ పేరుతో ఒక వ్యక్తి, అరవింద్ బ్యాచ్ ను టార్చర్ చేస్తుంటాడు. అతని గదిలో దుమ్ముపట్టిపోయిన అతని ఫొటో వారికి కనిపిస్తుంది. ఆ వ్యక్తి చనిపోయి చాలాకాలం అవుతోందనే విషయం అప్పుడు వాళ్లకు అర్థమవుతుంది. గతంలో ఆ హాస్టల్ ను రన్ చేసింది అతనేనని వాచ్ మెన్ ద్వారా తెలుసుకుంటారు. అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తే, గేటు దగ్గరే అడవి నుంచి తరుముకొచ్చిన ఆకారం అడ్డుకుంటూ ఉంటుంది.
అడవిలోని ఆ భయంకరమైన ఆకారం ఎవరిది? చనిపోయిన వ్యక్తి ఆత్మ హాస్టల్లోనే ఎందుకు ఉంటోంది. ఈ రెండింటికీ .. ఈ ముగ్గురు యువకులకు గల సంబంధం ఏమిటి? వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి ఉంటుంది? అనేది కథ.
ఇంజనీరింగ్ కాలేజ్ చేరిన ముగ్గురు మిడిల్ క్లాస్ కుర్రాళ్లు, డబ్బులు మిగుల్చుకోవడం కోసం ఒక పాతకాలం నాటి హాస్టల్ బిల్డింగ్ లో దిగుతారు. ఆ హాస్టల్లో ఉంటున్న ఆత్మ .. అడవి నుంచివారితో పాటు వచ్చిన ఒక మానవాతీత శక్తి వాళ్లను టార్చర్ చేస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ గండం నుంచి ఎలా బయటపడతారు? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.
అడవికి దగ్గరగా ఉన్న హాస్టల్ .. ఆ హాస్టల్లో దెయ్యం ఉండటం .. అది రాత్రి వేళల్లో స్టూడెంట్స్ ను భయభ్రాంతులకు గురిచేయడం .. ఆ దెయ్యంబారి నుంచి వాళ్లు ఎలా బయటపడతారు? అనే కథతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాగే కొంతమంది కాలేజ్ కుర్రాళ్లు అడవిలోకి వెళ్లి అక్కడి మానవాతీత శక్తిని నిద్రలేపడం .. అప్పటి నుంచి తరుముతున్న ఆశక్తి నుంచి తప్పించుకోవడం నేపథ్యంలోను చాలానే కథలు వచ్చాయి. అలాంటి రెండు కథలను కలుపుతూ తెరకెక్కించిన సినిమా ఇది.
ఇక హాస్టల్లో ఉన్న ఆత్మ ఎవరిది? ఎందుకు హాస్టల్లోనే తిరుగుతోంది? అడవిలో దాగిన ఆ శక్తి ఏమిటి? అంతకుముందు ఏం జరిగి ఉంటుంది? ఎందుకు అవి ఈ ముగ్గురినే టార్గెట్ చేస్తున్నాయి? అనేవి ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే అంశాలుగా కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకోవడం కోసం ఆడియన్స్, ఆ ముగ్గురు కుర్రాళ్లను ఫాలో అవుతూ ఉంటారు. అయితే అలా పరుగెత్తుతూ వెళ్లిన ఆడియన్స్ కి ఆయాసం వస్తుంది .. నిరాశ కలుగుతుంది అంతే.
ముగ్గురు కుర్రాళ్లు .. ఆకతాయి వేషాలు .. కాలేజ్ క్యాంపస్ గొడవలు .. హాస్టల్ అనుభవాలు .. ఇలా దర్శకుడు అసలు కథ దగ్గరికి తీసుకుని వెళ్లేసరికి సినిమాలో సగభాగం పూర్తవుతుంది. ఇక మిగతా సగంలో నైనా అసలు కథ ఏమైనా చెబుతాడేమోనని చూస్తే, అందుకు సంబంధించిన సన్నివేశాలను కూడా సాగదీస్తూ వెళ్లారు. హాస్టల్లో ఆత్మ వెనుక గల కథ .. అడవిలోని మానవాతీత శక్తి కథ కూడా చాలా పేలవంగా అనిపిస్తాయి.
లవ్ .. కామెడీ .. ఎమోషన్ .. హారర్ ఈ నాలుగు అంశాలను కలుపుకుంటూ ఒక ఆసక్తికరమైన కథను తయారు చేయడంలో విఫలం కావడం కనిపిస్తుంది. కథకు రెండు కళ్ల మాదిరిగా కనిపించే ఆత్మ పాత్రను .. మానవాతీత శక్తి పాత్రను డిజైన్ చేయడంలోను, చూపించడంలోను ఇదే పరిస్థితి. నటీనటుల నటన గురించి .. సాంకేతిక వర్గం పనితీరును గురించి మాట్లాడుకునే స్థాయిలో ఈ కంటెంట్ కనిపించదు.
కొన్ని హారర్ కామెడీ సినిమాలు నవ్విస్తూనే భయపెడతాయి. మరికొన్ని హారర్ కామెడీ సినిమాలు నవ్వించకపోగా .. భయపెట్టకపోగా .. బాధపెడతాయి. ఆ రెండో కోవకి చెందిన సినిమా ఇది అని చెప్పచ్చు.
'మహారాజా హాస్టల్' (ఆహా)మూవీ రివ్యూ!
Maharaja Hostel Review
Movie Details
Movie Name: Maharaja Hostel
Genre: Comedy, Horror
Release Date: 2026-09-11
Cast: Akhil NRD,Sarath Babu,Sandeep SP,Ann Maria,Abhirami Girish
Director: Charu Wakan
PRO: -
Music: Ashwin Ram
Banner: Charuchitra Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer