జెన్‌జీ కథలతో ఈతరం దర్శకులు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం 'ఎపిక్': ఫస్ట్ సెమిస్టర్. బోల్డ్ కంటెంట్‌తో ట్రైలర్‌ను విడుదల చేసి యూత్‌ను సినిమా వైపు ఆకర్షించేలా చేశారు. ఇక 'బేబీ'తో హిట్ జోడిగా గుర్తింపు పొందిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. విజయవంతమైన 90'స్ వెబ్ సీరిస్‌కు కొనసాగింపు కథ ఇది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన ఈ చిత్రాన్ని నిర్మించారు.
90'స్ వెబ్ సీరిస్‌లో చంద్రశేఖర్ (శివాజీ) కొడుకు ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) కథ ఇది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సినిమా దర్శకుడు కావాలనేది కల. ఇందుకోసం షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మధ్య తరగతి కుటుంబాల ఆలోచన తరహాలోనే కట్నం ఎక్కువ వస్తుందని ఆలోచించే అమ్మ, జీవితంలో తొందరగా స్థిరపడతావని నాన్న బలవంతంతో పై చదువుల కోసమని లండన్ వెళతాడు. అయితే అక్కడికి వెళ్లినా చదువు పూర్తి చేసుకుని మళ్లీ ఇండియాకు వచ్చి.. దర్శకుడిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాలని అనుకుంటాడు. లండన్ యూనివర్శిటిలో తెలుగమ్మాయి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. పరిచయమైన కొన్ని గంటల్లోనే ఒకరికొకరు ఆకర్షితులవుతారు. ఆ తరువాత లివిన్ రిలేషన్‌షిప్‌ను మొదలుపెడతారు. ఆ తరువాత ఏం జరిగింది? ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? పెళ్లి విషయంలో ఇద్దరి ఆలోచనలు కలిశాయా? ఆదిత్య కెరీర్ కోసం పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనేది మిగతా కథ.
ఈతరం దర్శకుల్లో కొంత మంది జెన్‌జీ పేరిట యూత్ బోల్డ్ సినిమాల వెంట పడ్డారు.. జెన్‌జీ అనగానే కోలీవింగ్. లివ్‌ఇన్ రిలేషన్ షిప్‌లో ఉండటం, వారి లైఫ్‌స్టయిల్, వాళ్ల బందాలు, గందరగోళ సమస్యల్ని సృష్టించడం.. వాటి చుట్టు తమకు కావాల్సిన కన్వీనెంట్ కథతో, సన్నివేశాలతో సినిమాను తెరకెక్కించడం. ఇలాంటి జాబితాలో తెరకెక్కిన సినిమానే 'ఎపిక్': ఫస్ట్ సెమిస్టర్. ఈతరానికి చెందిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి కెరీర్ కోసం లండన్ వెళ్లి వాళ్లు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు, వారి జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఈ సినిమా. చదువుల కోసమని వెళ్లిన వాళ్ల కెరీర్ సంబంధించిన అంశాల కంటే యూత్‌ను ఎలా ఆకర్షించాలనే అంశంపైనే దర్శకుడు గురిపెట్టాడు.ఈ సినిమాలోని సన్నివేశాలు చూసి నేటి యూత్ కనెక్ట్ అవుతారనే అపోహలో దర్శకుడు ఈ కథ రాసుకున్నాడు. అయితే వాళ్లు తీసుకునే నిర్ణయాలు, ఇన్‌మెచ్యూర్డ్ డిసిషన్స్‌కు అందరూ కనెక్ట్ అవ్వడం మాత్రం కష్టం.
ఓ సినిమాటిక్ జంటకు లండన్‌లో ఎదురైన సవాళ్లు చూస్తున్నమనే భావన కలుగుతుంది తప్ప ఎక్కడా రియలిస్టిక్‌గా అనిపించదు. హీరో ఇన్నోసెంట్ నుంచి వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప ప్రత్యేక వినోదమేమీ ఈ చిత్రంలో కనిపించదు. సినిమా ఆద్యంతం స్లోగా ఉండటంతో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లెంగ్తీ డైలాగ్స్ విసుగు తెప్పిస్తాయి. ఈ జంటతో కనెక్ట్ అయ్యి ప్రయాణించే ఆడియన్స్ చాలా తక్కువగా ఉంటారు. మిడిల్ క్లాస్ బయోపిక్ సీరిస్ కంటిన్యూగా ఈ కథ మొదలుగానే కాసేపు పెద్దతెరపై సీరిస్ చూస్తున్నమనే భావన కలిగేలా కథ, కథనాలు స్లోగా నడుస్తుంటాయి. హీరో లండన్ వెళ్లిన తరువాత కథనం ఊపందుకుంటుందని భావించిన ప్రేక్షకుడి నిరాశే ఎదురవుంది. అక్కడ హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, బోల్డ్ సీన్స్ మినహా పెద్దగా ఆసక్తి కలిగించే సన్నివేశాలేమీ చూసిన ఫీలింగ్ కలగదు.
ఈ సినిమాలో ఓ సన్నివేశంలో హీరో నాన్న చంద్రశేఖర్, హీరో ఆదిత్యని ఓ పదం చెప్పి దానికి నానార్థాలు చెప్పమంటాడు. ఈ సినిమాలో కూడా ఒకే అంశాన్ని..పదే పదే పలు రకాల సన్నివేశాలతో, ఒకే రకమైన సంభాషణలను, పలు రకాలుగా చెప్పిన భావనను సినిమా ఆద్యంతం కలిగించింది. మధ్యతరగతి అబ్బాయి విదేశాలకు వెళితే, అతనిపై కుటుంబభారం ఎలా ఉంటుంది? అనే అంశాన్ని, ఆ సమయంలో కెరీర్, పెళ్లి విషయంలో అబ్బాయి మానసిక సంఘర్షణను చూపించే ప్రయత్నం నేటి మిడిల్ క్లాస్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది. ఫస్టాఫ్ ఓ మోస్తరు ఆసక్తి కలిగించిన ఈ సినిమా సెకండాఫ్‌లో గాడి తప్పింది. ఈ సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది ప్రశ్నార్థకమే! ఇక మొదటి నుంచి ప్రచారంలో భాగంగా ఈ సినిమా పతాక సన్నివేశాలు అసంపూర్తిగా ఉంటాయని మేకర్స్ చెప్పినట్లుగానే ఈ చిత్రం క్లైమాక్స్‌ను అసంపూర్ణంగా వదిలేశారు. ఇది ప్రేక్షకులకు కన్వీన్సింగ్‌గా అనిపించదు. ఈ అంశం కూడా సినిమాకు మైనస్‌గానే మారింది.
ఆదిత్య, కడలి పాత్రల్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి దిబెస్ట్ పర్‌పార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు ఎంతో సహజంగా నటించారు. ఇద్దరి పాత్రల్లోనూ నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలే. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఆనంద్ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు ఇన్నోసెంట్ యువకుడిగా మెప్పించాడు. ఈ సినిమాలో స్నేహితులుగా నటించిన దర్శకుడు కల్యాణ్ శంకర్, గవిరెడ్డి శ్రీనివాస రెడ్డిలు అక్కడక్కడా నవ్వించారు. హేషమ్ పాటలు, నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. దర్శకుడు ఆదిత్యహాసన్ ఈ కథను ముందుగానే రెండు పార్ట్‌లుగా.. రెండు సెమిస్టర్లుగా చెప్పాలనుకునే ప్రయత్నంలో సెకండ్ సెమిస్టర్‌లో అసలు ఎమోషన్‌ను ప్రజెంట్ చేయాలనే భావనతో ఫస్ట్ సెమిస్టర్‌ను ఇన్‌కంప్లీట్‌గా ఫినిష్ చేశాడానే ఫీలింగ్ కలుగుతుంది. ఆదిత్యహాసన్ కథా రచయితగా, దర్శకుడిగా కంటే డైలాగ్ రైటర్‌గా ఈ సినిమాలో మంచి మార్కులు సంపాందించుకున్నాడు.
సమాజంలో ఎక్కడో అరుదుగా కనిపించే అంశాన్ని ప్రధాన కథా వస్తువుగా తీసుకుని, ఈ సినిమా అందరూ కనెక్ట్ అవుతారు.. మీ జీవితాన్ని చూసినట్లుగా ఉంటుంది అని పబ్లిసిటిలో ప్రస్తావించడం ఎంత వరకు సమంజసం. అయితే ఇలాంటి దర్శకులకు ఎన్నో అవరోధాల్ని అధిగమిస్తూ శిఖరాలు చేరుతున్న సక్సెస్‌స్టోరీలు కనిపించవా? అనిపిస్తుంది? ఈ రోజుల్లో చాలా మంది యువతీ యువకులు చాలా ప్లాన్‌డ్‌గా మెచ్యూర్టీ తో ఆలోచిస్తున్నారు. జెన్‌జీ సినిమా అంటే బోల్డ్ సీన్లు, విలాసాలు, ఇంటిమేట్ సన్నివేశాలేనా అనిపిస్తుంది? ఈ రోజుల్లో ఇవన్నీ కామనే అనే చెప్పడమే ఈ తరహా కథల ఉద్దేశామా? అనే ఆలోచన కలుగుతుంది? ఈ 'ఎపిక్': ఫస్ట్ సెమిస్టర్‌కు దర్శకుడు కూడా ఇదే సిలబస్ ఫాలో అయ్యాడా? అనే ఆలోచన ప్రేక్షకుడి మదిలో కలుగుతుంది. ఓవరాల్‌గా ఈ 'ఎపిక్' ఫస్ట్ సెమిస్టర్ సిలబస్‌ను, సబ్జెక్ట్ సరైన రీతిలో ప్రీపేర్ కాకుండానే ఎగ్జామ్‌ను రాసిన ఫీలింగ్ కలిగింది. ఈ సెమిస్టర్ మిస్ అయితే సప్లిమెంటరి (సెకండ్ సెమిస్టర్) రాసుకోవచ్చులే అనే కాన్ఫిడెన్స్ కాబోలు!
'ఎపిక్': ఫస్ట్ సెమిస్టర్ సినిమా రివ్యూ !
EPIC: First Semester Review
Movie Details
Movie Name: EPIC: First Semester
Genre: Comedy
Release Date: 2026-09-11
Cast: Anand Deverakonda, Vaishnavi Chaitanya
Director: Aditya Haasan
PRO: venu gopal
Music: Hesham Abdul Wahab
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer