కొంత కాలంగా కెరీర్లో బలమైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుడు వరుణ్‌తేజ్. ఇప్పటి వరకు అన్ని తరహా చిత్రాలు చేసిన వరుణ్ ఈ సారి సక్సెస్ కోసం హారర్ ఎంటర్టైన్మెంట్ను ఎంచుకున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా? వరుణ్‌తేజ్‌కి ఈ సినిమా విజయాన్ని అందించిందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కనకరాజు చెక్క భజన మండలి పేరుతో ప్రదర్శనలు ఇస్తూ ఆ డబ్బుతో కుటుంబానికి ఆర్థికంగా తోడుండే యువకుడు కనకరాజు (వరుణ్‌తేజ్). స్నేహితుడు కిష్టప్ప (సత్య) అండ్ గ్యాంగ్‌తో స్నేహాం చేస్తూ, ఎమ్మేల్యే అవ్వాలని ప్రయత్నించే చెంగారెడ్డి (సునీల్) మనుషులతో గొడవలతో జీవితాన్ని గడుపుతుంటాడు. కియా కార్ కంపెనీలో పనిచేస్తూ ఎప్పటికైనా కొరియాకు వెళ్లి అక్కడే స్థిరపడాలని అనుకునే చైత్ర (రితికా నాయక్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇంతలో అనుకోకుండా కొరియా నుంచి రకరకాలుగా ట్రావెల్ అవుతూ వచ్చిన కొరియాకు చెందిన ఓ వస్తువు నుంచి కనకరాజు శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పట్నుంచీ కనకరాజు చేష్టలు, ప్రవర్తన వింతగా మారిపోతుంది.
తనలో ఓ కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశించిందని తెలుసుకున్న కనకరాజు ఆ ఆత్మ కోరికలు తెలుసుకోని అవి నెరవేర్చడానికి, స్నేహితుడు కిష్టప్ప, కొరియా భాష తెలిసిన చైత్రతో కొరియాకు వెళ్లతాడు. అయితే కనకరాజుకు అక్కడికి వెళ్లాక జరిగిందేమిటి? కనకరాజు బాడీలో నుంచి ఆ ఆత్మ బయటికొచ్చిందా? కొరియాకు వెళ్లిన తరువాత తెలిసిన నిజమేమిటి? ఆ ఆత్మ నుంచి కనకరాజుకు ఎలా విముక్తి దొరికింది? అనేది మిగతా కథ.
హారర్, ఎంటర్టైన్మెంట్ సినిమా నుంచి ప్రేక్షకులు ఏమీ ఆశించి వస్తారో ఫక్తుగా అలాంటి కమర్షియల్ అంశాలను జోడించి దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్ర కథ,కథనాలు రాసుకున్నాడు.ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఫక్తు కమర్షియల్ హిలేరియస్ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'. అయితే ప్రేక్షకులను భయపెట్టే అంశాలపై కాకుండా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్పైనే దర్శకుడు గురిపెట్టాడు. సినిమా తొలిభాగం కాస్త స్లోగా ప్రారంభమైనప్పటికీ ఇంటర్వెల్‌కు వచ్చే సరికి కథ, కథనాలు ఆసక్తిగా మారుతాయి. సినిమా మొదట్నుంచీ ఎంటర్టైన్మెంట్గ బాగానే వర్కవుట్ అయ్యింది. హారర్ కామెడీ మిక్స్డ్ సన్నివేశాలతో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఎంటర్టైన్మెంట్ను పంచారు. ఓ సాధారణ కథకు కొరియన్ నేపథ్యం జోడించడంతో కామెడీకి స్కోప్ పెరిగింది. ఈ అవకాశాన్ని దర్శకుడు చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇక సెకండాఫ్‌లో అక్కడక్కడ సాగతీతగా అనిపించి, తడబడినా ఎంటర్టైన్మెంట్తో దర్శకుడు గట్టెక్కించాడు.
ముఖ్యంగా సత్య కామెడీ టైమింగ్, సత్య, వరుణ్‌తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌కు వినోదాన్ని పంచుతాయి. ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశించినప్పటి నుండి సత్య, వరుణ్‌లు కామెడీతో నవ్వులు పూయించారు. అయితే పెంపుడు కుక్క కనిపించకపోవడం సన్నివేశంలోని ట్విస్ట్ కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అక్కడ కామెడీ వర్కవుట్ అయినా అలాంటి సన్నివేశాన్ని అందరూ జీర్ణించుకోలేరు. కొరియన్ గ్యాంగ్స్‌తో చేసే యాక్షన్ సన్నివేశాలతో పాటు అక్కడి సన్నివేశాల్లో కామెడీ ఆకట్టుకుంటుంది. అయితే ఇలాంటి కథల్లో లాజిక్లను దర్శకులు పెద్దగా పట్టించుకోరు.
తమ కన్వీనెంట్ రైటింగ్‌తో సన్నివేశాల్లో వినోదం ఎలా జొప్పించాలో, ఆ సన్నివేశాన్ని ఎలా గట్టెక్కించాలో అనేది వాళ్ల మైండ్‌లో ఉంటుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా ఈ సినిమా విషయంలో అన్నీ లాజిక్లను విస్మరించాడు. అంతేకాదు లాజిక్‌లు ఆలోచించే సమయం కూడా ప్రేక్షకుడు ఆలోచనలో లేకుండా వినోదాన్నిపంచడంలో సక్సెస్ అయ్యాడు. వీడియో కాల్లో మురళీధర్ గౌడ్ చేయించే క్షుద్ర పూజలో ఉండే హిలేరియస్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్.అయితే పతాక సన్నివేశాల్లో ఆత్మల ఫైట్ మాత్రం ఫోర్స్డ్గా పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చూసే ప్రేక్షకులు ఇలాంటి మైనస్‌లను పట్టించుకునే అవకాశం లేదు.
వరుణ్‌తేజ్ సరికొత్త పాత్రలో కనిపించాడు. ఒకవైపు హాస్యాన్ని పంచుతూనే మరోవైపు ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ నటనను కనబరిచాడు. యాస, లుక్ కూడా కొత్తగా ఉంది. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ ఎఫ్-2లో వరుణ్ పాత్రను గుర్తుచేస్తుంది. ఇక కమెడియన్ సత్య ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. ఆయన పండించిన వినోదం ఆడియన్స్‌ను హిలేరియస్‌గా నవ్విస్తుంది. ఆయన పంచ్‌లు, కామెడీ టైమింగ్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.మురళీధర్ గౌడ్‌తో చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.
చెంగారెడ్డి పాత్రలో విలన్‌గా కనిపిస్తూనే కామెడీ పండించాడు సునీల్. రితికా నాయక్ నటనతో అలరిస్తుంది. మురళీధర్ గౌడ్ నవ్వులు పండించాడు. తమన్ నేపథ్య సంగీతం సన్నివేశాన్ని మరింత బలంగా మార్చింది. మనోజ్‌రెడ్డి ఫోటోగ్రఫీ కథ మూడ్‌ను క్యారీ చేసింది. ట్విస్ట్‌లపై, ప్రేక్షకులను భయపెట్టే అంశాలపై కాకుండా, పూర్తి ఎంటర్టైన్మెంట్పై దృష్టిని పెట్టి ఈ చిత్ర కథ, కథనాలు బలంగా రాసుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ఫైనల్‌గా లాజిక్‌లు ఆలోచించకుండా ఫన్ మ్యాజిక్‌ను ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్‌కు పూర్తి సంతృప్తినిచ్చే చిత్రమిది.
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ:
Korean Kanakaraju Review
Movie Details
Movie Name: Korean Kanakaraju
Release Date: 2026-08-07
Cast: varun Tej, Ritika Nayak, Satya
Director: Merlapaka Gandhi
Music: Thaman S
Banner: UV Creations, First Frame Entertainment
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer