మధుబాల - ఇంద్రన్స్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమానే 'చిన్న చిన్న ఆశై'. వర్ష వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (జులై 28వ తేదీ) నుంచి తమిళ .. మలయాళ భాషలతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. గతంలో మధుబాల కథానాయికగా నటించిన 'రోజా' సినిమాలోని పాట నుంచి వచ్చిన టైటిల్ కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది.
'వారణాసి'లో మాధవన్ మాస్టారు (ఇంద్రన్స్) కూతురు జానకి (అపర్ణ బాలమురళి) చదువుకుంటూ సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ఆమెను చూడటం కోసం కేరళ నుంచి అప్పుడప్పుడు అతను వచ్చి వెళుతుంటాడు. అలా వారణాసి వచ్చిన అతనికి, భయంతో ఒంటరిగా మిగిలిపోయిన ఒక మహిళ కనిపిస్తుంది. తన పేరు 'లీల' (మధుబాల) అని ఆమె అతనితో చెబుతుంది. 'తంజావూరు' నుంచి తామంతా ఒక బృందంగా వచ్చినట్టు చెబుతుంది.
'లీల' సెల్ ఫోన్ .. ఆమె 'పర్స్' ను దొంగ కాజేశాడనీ, అతనిని వెంబడించే ప్రయత్నంలో ఆమె తన బృందం నుంచి తప్పిపోయిందని మాధవన్ అర్థం చేసుకుంటాడు. తప్పిపోయినవారి సమాచారాన్ని అందించే కేంద్రంలో 'లీల' పేరు రాయించిన మాధవన్, ఆమె కోసం ఎవరైనా వస్తే తనకి కాల్ చేయమని చెప్పి తన సెల్ నెంబర్ ఇస్తాడు. భయపడవలసిన పనిలేదనీ, తంజావూరు టీమ్ తో కలిసి తిరిగి వెళ్లిపోవచ్చని ఆమెకి మాధవన్ ధైర్యం చెబుతాడు.
మొదట్లో కాస్త భయపడినప్పటికీ, ఆ తరువాత ఆమె తన గురించిన వివరాలను అతనికి చెబుతుంది. అతను కూడా తన భార్య తనకి శాశ్వతంగా దూరమైపోయిందంటూ తన కథను వివరిస్తాడు. లీలకి వారణాసి చూడాలని ఉందని తెలుసుకున్న మాధవన్, ఆమెను వెంటబెట్టుకుని ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూపిస్తాడు. ఆ సమయంలో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆ పరిచయం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది మిగతా కథ.
జీవితం సమస్యలతో సతమతం చేసినప్పుడు .. విధి ఒంటరిని చేసి నిలబెట్టినప్పుడు ఆ మనసు ప్రశాంతతను కోరుకుంటుంది. స్వచ్ఛమైన మరో మనసు తోడును కోరుకుంటుంది. అలాంటి తోడు దొరికినప్పుడు ప్రతి చిన్న సంఘటన ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోతూ ఉంటుంది .. గుండె గదులను అనుభూతిగా హత్తుకుపోతూ ఉంటుంది. అలాంటి రెండు ఒంటరి మనుషుల కథ ఇది .. ఒంటరి మనసుల కథ ఇది.
జీవితం ఒక మోడుగా మారిపోయిందని నిరాశపడిపోయిన 'లీల' .. ఒంటరి తనాన్ని మరిచిపోవడం కోసం ఆనందాన్ని వెతుక్కునే మాధవన్, 'వారణాసి'లో అనుకోకుండా కలుసుకుంటారు. వేదాంతం .. వైరాగ్యం అడగకుండానే అనుభవంలోకి వచ్చే దృశ్యాల మధ్య, జీవితం చేసిన గాయాలను వాళ్లిద్దరూ పంచుకుంటారు. చిన్న చిన్న ఆశలను నెరేవేర్చుకోవడానికి పెద్దగా సమయాన్ని కేటాయించవలసిన పనిలేదని భావించే ఇద్దరు మనుషుల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
వారణాసిలో .. ఒకే ఒక రోజులో జరిగే పరిచయం రెండు మనసులను ఎంతగా ప్రభావితం చేస్తుంది .. ఎంతగా ఊరట కలిగిస్తుందనేది దర్శకుడు ఆవిష్కరిస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ఫీల్ కోసం కేటాయించిన సమయం, ఆడియన్స్ కి సాగతీతగా అనిపిస్తుంది. సన్నివేశాలు మరీ నిదానంగా సాగుతున్న భావన కలుగుతుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ మనసును తాకుతుంది.
ఇంద్రన్స్ నటనకు వంకబెట్టవలసిన పనిలేదు. ఇక మధుబాల దగ్గరికి వచ్చేసరికి, ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కాస్త అయోమయంలో పడేస్తుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ లోని ఆంతర్యం ఏమిటనే కన్ఫ్యూజన్ ప్రేక్షకులకు ఉండిపోతుంది. ప్రధానమైన పాత్రలకు తారసపడే రెండు మూడు పాత్రలు కూడా విషయం లేనివిగానే అనిపిస్తాయి. అపర్ణ బాలమురళి పై చిత్రీకరించిన పాట ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి.
జీవితంలో ఓడిపోయినప్పుడు .. ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ప్రతి మనసు ఒక తోడును కోరుకుంటుంది. అలాంటి ఒక పరిచయం జరిగితే అది శాశ్వతంగా నిలిచిపోవాలని ఆశపడుతుంది. కరిగే కాలం ఆ కోరికను మన్నిస్తుందా? లేదా? అనే ఒక సందేహానికి సమాధానంగా ఈ కథ నడుస్తుంది. ఫీల్ ఉన్నప్పటికీ .. కథనం మరీ నిదానించినట్టుగా అనిపిస్తుంది.
'చిన్న చిన్న ఆశై' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Chinna Chinna Aasai Review
Movie Details
Movie Name: Chinna Chinna Aasai
Release Date: 2026-07-28
Cast: Madhubala, Indrans, Aparna Balamurali, Vishnu Agasthya, Thambi Ramayya
Director: Varsha Vasudev
Music: Govind Vasantha
Banner: Babuji Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer