మలయాళంలో బాసిల్ జోసెఫ్ కి మంచి క్రేజ్ ఉంది. కామెడీ టచ్ తో సాగే పాత్రలలో ఆయన నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓటీటీలలో ఆయన సినిమాలకి .. సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'పాల్తు జాన్వర్'. సంగీత్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2022 - సెప్టెంబర్ లో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత మలయాళంలో ఓటీటీకి వచ్చింది. రీసెంటుగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది.

ప్రసూన్ (బాసిల్ జోసెఫ్) యానిమేషన్ కి సంబంధించిన ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆర్ధికంగా దెబ్బతింటాడు. అదే సమయంలో అతని తండ్రి చనిపోతాడు. పశుసంవర్ధక శాఖలో ఆయన పనిచేస్తూ ఉండేవాడు. అందువలన ఆ జాబ్ ప్రసూన్ కి వస్తుంది. విలేజ్ వాతావరణం అతనికి ఎంతమాత్రం అలవాటు లేదు .. పశువులకు సంబంధించిన ఏ విషయాలు ప్రసూన్ కి తెలియదు. అయినా అక్కాబావల మాటను కాదనలేక, అయిష్టంగానే ఆ విలేజ్ కి వెళతాడు. 

పశువులకు  సంబంధించిన వైద్యశాలలో 'లైవ్ స్టాక్ ఇన్ స్పెక్టర్' గా అడుగుపెడతాడు. అక్కడ డాక్టర్ గా సునీల్ (షమ్మీ తిలకన్) ఉంటాడు. ఆయనకి తాను చేస్తున్న పనిపై ఎంత మాత్రం ధ్యాస ఉండదు. బయట బిజినెస్ లపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. ఇక అటెండర్ 'మాథ్యూస్' ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటూ ఉంటాడు. చర్చి ఫాదర్ తో కలిసి గ్రామసభలు ఏర్పాటు చేయడం .. హడావిడి చేయడం తనవంతు అన్నట్టుగా 'జార్జ్' ( ఇంద్రన్స్) వ్యవహరిస్తూ ఉంటాడు. అటు పంచాయితీపై .. ఇతి పశువైద్యశాలపై 'డేవిస్' (జాన్ ఆంటోని) కోపంగా ఉంటాడు.

తనకి ఇష్టం లేని జాబ్ కావడం వలన, ప్రసూన్ తన పని పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దాంతో అటు డాక్టర్ సునీల్ .. ఇటు గ్రామసభ సభ్యులు అతనిని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు .. నలుగురిలో అవమానిస్తూ ఉంటారు. తాను ఈ జాబ్ చేయాలా?మానేయాలా? అనే ఒక సందేహంలో ప్రసూన్ ఉండగానే, అతని కారణంగా ఒక పోలీస్ డాగ్ చనిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ సంఘటన ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? అనేది కథ.

జీవితంలో చాలామంది తాము చేస్తున్నది తమ స్థాయికి తగిన పని కాదనే ఒక అసంతృప్తితో రోజులు గడిపేస్తూ ఉంటారు. తమ స్థాయి పనికాదనే ఒక ఫీలింగ్ తో ఉండటం వలన, చేస్తున్న పనిపై శ్రద్ధ పెట్టలేరు. ఆ పనిలో నైపుణ్యాలను సాధించే ప్రయత్నాలు అసలే చేయలేరు. ఈ కథలోని కథానాయకుడి పరిస్థితి కూడా అదే. ఈ కారణంగా తన వృత్తి విషయంలో అతనికి ఎదురైన అనుభవాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

 ఎక్కడైనా .. ఏ రంగంలోనైనా పనిచేసే ప్రతి మనిషిలో రెండు కోణాలు కనిపిస్తాయి. ఇది మనం చేసే పనికాదు అనుకుంటే ఒకలా పనిచేస్తాడు. ఈ పనిని మనం చేయవలసిందే .. మరో మార్గం లేదు అనుకుంటే కష్టపడే తీరు వేరుగా ఉంటుంది. ఇష్టం లేని పని మానుకోవడానికి సవాలక్ష కారణాలు వెతుక్కునేవారు, తమ నిర్ణయాన్ని సమర్థించేవారు లేకపోతే వెనక్కి తగ్గడం చాలా చోట్లా జరిగేదే. ఒక మనిషిలోని భిన్నమైన ఈ కోణాలను చాలా సహజంగా ఆవిష్కరించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడనే చెప్పాలి.

విలేజ్ లలో పశువులను కూడా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఉంటారు. వాటి పోషణ - రక్షణ విషయంలో వాళ్లు చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అయితే అక్కడికి వెళ్లిన ప్రసూన్ కి ఈ విషయం ఆలస్యంగా అర్థమవుతుంది. పశువైనా దానిదీ ప్రాణమే .. ఆ పశువుతో అక్కడి వాళ్లకి ఎంతటి అటాచ్ మెంట్ ఉంటుందనేది అతని అనుభవంలోకి వస్తుంది .. ఆలోచింపజేస్తుంది. అతనిలోని ఈ మార్పును ఆవిష్కరించిన విధానం ఆడియన్స్ ను మెప్పిస్తుంది. 

'నా కూతురు కడుపుతో ఉంది .. మా ఆవు కూడా కడుపుతో ఉంది .. ఇద్దరినీ నేను ఒకేలా చూసుకుంటాను' అనే మాట, పశువుల పట్ల గ్రామస్తులకు ఉండే ప్రేమకి అద్దం పడుతుంది. ఇక గ్రామీణ ప్రజలలో చాలావరకూ మూఢ నమ్మకాలు ఉంటాయి. ఈ విషయంలో వాళ్ల బలహీనతను తమ బలంగా మార్చుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశాలు సున్నితమైన హాస్యాన్ని అందిస్తూ ముందుకు సాగుతాయి.

విలేజ్ నేపథ్యం .. పెద్దగా చదువుకోని మనుషులు .. వాళ్ల స్వభావాలు .. బలహీనతలను ఆవిష్కరిస్తూ వెళ్లే ఈ కథలో, ప్రతి పాత్ర చాలా సహజంగా కనిపిస్తుంది. ఈ కథ మన ఊళ్లో జరుగుతున్న భావన కలుగుతుంది. కథాకథనాలతో పాటు విలేజ్ నేపథ్యం మనసుకు హత్తుకుపోతుంది. గ్రామస్తులే తప్ప ఆర్టిస్టులు కనిపించరు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథ మరింత బలంగా కనెక్ట్ కావడంలో తమవంతు పాత్రను పోషించాయి. 

ఒక మారుమూల గ్రామం .. అక్కడి ప్రజలు .. పశువైద్యశాల .. అక్కడ పనిచేసే అధికారులను కలుపుకుంటూ ఈ కథ ముందు వెళుతుంది. ప్రధానమైన కథ ఒక ఆవు చుట్టూ తిరుగుతుంది. 'ఏ పని చేసినా మనసు పెట్టి చేయి .. అంకితభావంతో చేయి .. అప్పుడు పొందే ఆత్మసంతృప్తి మరెందులోను లభించదు' అనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. విలేజ్ నేసథ్యంలోని సినిమాలను ఇష్టపడేవారికి ఇది తప్పకుండా నచ్చుతుంది.