తమిళంలో అర్జున్ దాస్ కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులోను ఆయన నటనకీ .. వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అర్జున్ దాస్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'కాన్ సిటీ'. హరీశ్ దురై రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అన్నా బెన్ .. యోగిబాబు .. వడివుక్కరసు కీలకమైన పాత్రలను పోషించారు. జూన్ 26వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి  'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులో ఉంది.

శరవణన్ (అర్జున్ దాస్) ఓ ప్రభుత్వ ఉద్యోగి. శ్రీమంతుల కుటుంబానికి చెందిన ఐశ్వర్య (సాక్షి వైద్య)  అతణ్ణి ప్రేమిస్తుంటుంది. వాళ్లిద్దరికీ వివాహం జరిపించాలనుకున్న ఆమె తండ్రి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. అందుకు కారణం శరవణన్ కి గల అప్పు. సొంత ఇంటికోసం తల్లి చేసిన అప్పు తీర్చడం కోసం, శరవణన్ అవినీతికి పాల్పడటం మొదలుపెడతాడు. ఈ విషయంలో అతనికి 'సదా' సహకరిస్తాడు. ఇద్దరూ కలిసి పెద్ద స్థాయి మోసాలకు శ్రీకారం చుడతారు. 

ఇక 'మిత్ర' (అన్నా బెన్) నమ్మినవాడి చేతిలో మోసపోతుంది. గర్భవతిగా ఉన్న ఆమె, ఎలాంటి కష్టం చేయలేని స్థితిలో ఉన్న ఆమె .. అవినీతి మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇళ్లు లీజ్ కి ఇప్పిస్తానని చెప్పి మోసం చేయడం మొదలుపెడుతుంది. అదే ప్రాంతానికి చెందిన జానకి (వడి ఉక్కరసు),తన కొడుకు 'జాకీ'(యోగిబాబు)తో కలిసి 'ట్రస్ట్' పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది. తాము చేస్తున్నది అన్యాయమని కొడుకు చెబుతున్నా ఆమె వినిపించుకోదు.

ఇలా ముగ్గురూ అవినీతి మార్గంలో సంపాదిస్తారు. తమ మోసాలు బయటపడే సమయానికి వేరే ప్రాంతానికి పారిపోయి అక్కడ తలదాచుకుంటారు. ఆ సమయంలోనే 'మిత్ర' కొడుకు కిడ్నాప్ కి గురవుతాడు. కిడ్నాపర్ ఎవరో కాదు ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఉన్న కల్యాణ సుందరం (నందగోపాల్) అని తెలుసుకుంటారు. ఈ ముగ్గురూ చేసిన మోసాలు ఎలా బయటపడతాయి? ఒక పోలీస్ ఆఫీసర్ కిడ్నాపర్ గా ఎందుకు మారతాడు? అవినీతి సొమ్మంతా ఏమైపోతుంది? అనేదే కథ.         

జీవితాన్ని ప్రభావితం చేసేవి అవసరాలు .. ఆపదలు.. అలవాట్లు. ఒక మనిషి దారితప్పడంలో ఇవే ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అవసరాలలో నుంచి .. ఆపదలలో నుంచి బయటపడాలంటే డబ్బు కావాలి. అలవాట్లు మానుకోలేని బలహీనతకు డబ్బుకి మించిన మందులేదు. అందువలన ఈజీ మని కోసం అలాంటివాళ్లు అక్రమ మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.

అందంగా బ్రతకాలి .. అందరి కంటే గొప్పగా బ్రతకాలి అనే ఆశనే మనిషిని పెడత్రోవ పట్టిస్తుంది. మోసం చేసేవాడు డబ్బు పట్ల ఆశతోనే చేస్తాడు. మోసపోయేవాడు డబ్బు పట్ల ఆశతోనే మోసపోతాడు అనే సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నాన్ని దర్శకుడు చేసిన తీరు ఆలోచింపజేస్తుంది. పెద్దవాళ్లు తమ 'కల' .. తమ 'ఆశ' .. అంటూ పిల్లలను అప్పుల పాలు చేసి, వాళ్ల చెడు మార్గంలో వెళ్లడానికి కారకులు అవుతున్నారంటూ చెప్పిన విధానం బాగుంది. 

అప్పులు .. అవస్థలు .. ఈజీమని కోసం నేరం దిశగా అడుగులు ఫస్టాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఆ నేరాలు చేసినందుకు బాధపడుతూ ఇక మారిపోవాలనుకున్న బ్యాచ్ కీ, గతంలో కంటే పెద్ద నేరం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనే దిశగా సెకండాఫ్ కొనసాగుతుంది. దర్శకుడు అల్లుకున్న కథ .. వేసుకున్న స్క్రీన్ ప్లే .. ప్రధానమైన నాలుగు పాత్రలను మలిచిన విధానం ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. 

ఈ కంటెంట్ లో కథనే హీరో. పరిస్థితులను బట్టి పాత్రలు పరిగెడుతూ ఉంటాయి .. సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాయి. అర్జున్ దాస్ మార్క్ ను చూపించాడనికి గానీ .. యోగిబాబు మార్కును చూపించడానికి గాని దర్శకుడు ప్రయత్నించలేదు. పరిస్థితులకు తగినట్టుగానే ఆ పాత్రలు ప్రవర్తిస్తాయి. సన్నివేశాలు కూడా సహజత్వాన్ని దాటుకుని వెళ్లకపోవడం మనం గమనించవచ్చు. అందరూ తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఎవరూ కూడా నటిస్తున్నట్టుగా ఉండదు. అరవింద్ విశ్వనాథన్ ఫొటోగ్రఫీ .. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం .. అరుళ్ మోసెస్ ఎడిటింగ్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. 

డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు .. కానీ నమ్మకమనేది పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేము. కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే నిలుస్తుంది. మోసంతో కూడబెట్టిన ధనం .. అలాగే చేజారిపోతుంది అనే సందేశం బలంగా ఇచ్చిన కంటెంట్ ఇది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కంటెంట్ గా చెప్పుకోవచ్చు. ఎక్కడా బోర్ అనిపించకుండా ఆసక్తికరంగా సాగిపోయే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.