హాలీవుడ్ నుంచి వచ్చే సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీలలో మంచి డిమాండ్ ఉంది. ఈ జోనర్ కి సంబంధించిన కథలను హాలీవుడ్ మేకర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తారనే ఒక బలమైన నమ్మకం ప్రేక్షకులలో ఉంది. అలాంటి జోనర్లో రూపొందిన సినిమానే 'థ్రాష్'. టామీ విర్కోలా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. నేరుగా ఓటీటీకి వచ్చిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

అది 'అట్లాంటిక్' సముద్రతీర ప్రాంతం. ఆ తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న నగరాలలో నెమ్మదిగా వర్షం మొదలవుతుంది. మరికొన్ని గంటలలో 'హరికేన్' విరుచుకుపడనుందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తుంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలను విడిచి రావొద్దని ప్రకటిస్తుంది. అయితే అప్పటికే కార్లో బయటికి వచ్చిన 'లీసా' (ఫోబ్ డైనేవర్)కి విషయం అర్ధమయ్యేసరికి ఆలస్యమవుతుంది. ఆమె నిండు గర్భవతి. అందువలన సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటుంది. 

ఉప్పెన కారణంగా నగరాలపై సముద్రం విరుచుకు పడుతుంది. దాంతో సముద్రంలోని ప్రమాదకరమైన సొరచేప (షార్క్)లు నగరాలలోకి కొట్టుకుని వచ్చేస్తాయి. నీళ్లలోకి అడుగుపెట్టిన మరుక్షణమే అవి వాళ్లను చంపేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో 'లీసా' ఆ తుఫానులో చిక్కుకుపోతుంది. ఒక చెట్టుకొమ్మ కారణంగా ఆమె ఆ కారులో నుంచి దిగే అవకాశం లేకుండా పోతుంది. 

అక్కడికి కాస్త దూరంలోనే 'డకోటా'(విట్నీ పీక్) ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి మొదటి అంతస్తువరకూ నీళ్లు వచ్చేస్తాయి. ఆమెను రక్షించడం కోసం ఆమె మేనమామ ఒక బోట్ పై బయల్దేరతాడు. షార్క్ లపై పరోశోధన చేస్తున్న ఆయనకి, వాటిని ఎలా నియంత్రించాలనేది తెలుసు. ఆయన కోసం డకోటా ఎదురుచూస్తూ ఉంటుంది. తన ఇంటికి ఎదురుగా చిక్కుకుపోయిన 'లీసా' కారు, నీటిలో మునిగిపోతుండటం చూస్తూనే ఉంటుంది.  

తాను గర్భవతిననీ .. తనని కాపాడమని డకోటాను 'లీసా' కోరుతుంది. ఆ మాట వినగానే డకోటా తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంది. అయితే ఆ కారు చుట్టూ సొరచేపలు తిరుగుతుండటంతో ఆలోచనలో పడుతుంది. చివరికి 'లీసా'ను రక్షించాలనే నిర్ణయానికి వచ్చిన డకోటా, ధైర్యంతో నీటి ప్రవాహంలోకి దిగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? లీసాను డకోటా కాపాడగలుగుతుందా? లీసా కడుపులోని బిడ్డ, ప్రాణాలతో బయటపడుతుందా? అనేది కథ.

తుపాను .. సునామీ .. నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటి విపత్కర పరిస్థితులను ఎవరెవరు ఎలా ఎదుర్కున్నారనే దిశగా ఆ కథలు నడిచాయి. ఈ కథ విషయానికి వచ్చేసరికి, ఒక నిండు గర్భవతి ఇలాంటి ఒక 'ఉప్పెన'లో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? ఆ ప్రళయం నుంచి బయటపడటానికి ఆమె ఏం చేస్తుంది? అనేది దర్శకుడు ఎంచుకున్న ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవాలి. 

సాధారణంగా నిండు గర్భవతికి ఏదైనా కష్టం వస్తేనే, చూసేవాళ్లు తట్టుకోలేకపోతారు. అలాంటి ఒక గర్భవతి ఉప్పెనలో .. కారులో చిక్కుకుపోతుంది. అంతకంతకూ నీటి మట్టం పెరుగుతూ పోతుంటుంది. సముద్రం నుంచి కొట్టుకొచ్చిన సొరచేపలు అక్కడ తిరుగుతుంటాయి. అందువలన ఆమెను రక్షించే సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి. అలా అన్ని వైపుల నుంచి దర్శకుడు దిగ్బంధనం చేసిన తీరు ఉత్కంఠను పెంచుతుంది.

ఈ కథలో ప్రధానమైనవిగా కనిపించే ప్రమాదకరమైన అంశాలు రెండు. ఒకటి హరికేన్ సృష్టించే విలయం అయితే, మరొకటి సముద్రపు నీటితో పాటు కొట్టుకొచ్చిన సొరచేపలు. ఈ రెండింటిని తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. హరికేన్ విరుచుకుపడే దృశ్యాలు .. సొరచేపలు దాడి చేసే దృశ్యాలు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. విలయాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న ఫీలింగును కలిగిస్తాయి. 

సముద్రం అల్లకల్లోలంగా మారడం .. నగరాలపై విరుచుకు పడటం .. ఇళ్లలోకి వరద వచ్చేయడం వంటి సన్నివేశాలను తెరపైకి తీసుకొచ్చిన విధానం ఆశ్చర్యచకితులను చేస్తాయి. సొరచేపల మధ్యలో ఉన్న గర్భిణీ స్త్రీని కాపాడటానికి 'డకోటా' వెళ్లే సన్నివేశం .. తనని తాను కాపాడుకుంటూ, అప్పుడే పుట్టిన పసికందును రక్షించుకోవడం కోసం సొరచేపలతో ఓ తల్లి చేసే పోరాటం ఈ సినిమా హైలైట్స్ లో మనకి కనిపిస్తాయి.

ఈ సినిమాలో మరికొన్ని పాత్రలు ఉన్నప్పటికీ, ప్రధానంగా కనిపించేది ఫోబ్ డైనేవర్ - విట్నీ పీక్. ఈ ఇద్దరి నటన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి మరింత బలాన్ని చేకూర్చాయి. గర్భిణీ స్త్రీకి సంబంధించిన ప్రధానమైన అంశం ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పటికీ, కంటెంట్ మొత్తంగా చూసుకుంటే మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది. షార్క్ చేపల దాడి .. రక్తపాతం గల ఈ సినిమాను, పిల్లలతో కాకుండా చూడటమే కరెక్ట్ అనిపిస్తుంది.