వేసవి ప్రతాపానికి యూర‌ప్‌ విలవిల.. 50,000 మంది బలి.. రూ.1.79 లక్షల కోట్ల ఆర్థిక నష్టం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేసవి ప్రతాపానికి యూర‌ప్‌ విలవిల.. 50,000 మంది బలి.. రూ.1.79 లక్షల కోట్ల ఆర్థిక నష్టం!

Europe heatwave kills 50000 people and causes 19 billion dollar economic loss
  • యూర‌ప్‌లో రికార్డు స్థాయి వేసవి తాపానికి 50,000 మంది మరణించినట్లు అంచనా
  • సుమారు 19 బిలియన్ డాలర్ల జీడీపీ నష్టం వాటిల్లినట్లు మరో అధ్యయనం వెల్లడి
  • శిలాజ ఇంధనాల వాడకంతో పెరిగిన ఉష్ణోగ్రతలే ఈ మరణాలకు ప్రధాన కారణం
  • పశ్చిమ, దక్షిణ యూర‌ప్‌ దేశాలపై అత్యధికంగా ఉన్న వడగాల్పుల ప్రభావం 
  • గత దశాబ్దపు సగటు నష్టంతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లు అధికం
వాతావరణ మార్పుల తీవ్రతకు యూర‌ప్‌ విలవిల్లాడుతోంది. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగా సుమారు 50,000 మంది మరణించారని, దాదాపు 19 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.79 లక్షల కోట్లు) ఆర్థిక నష్టం వాటిల్లిందని రెండు వేర్వేరు అధ్యయనాలు సంచలన విషయాలు వెల్లడించాయి. మరణాలు, ఆర్థిక నష్టాల పరంగా యూర‌ప్‌ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన వేసవిగా నిలిచింది.

వివిధ నగరాల్లో సంభవించిన మరణాలపై ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల నేతృత్వంలో ఒక అధ్యయనం జరిగింది. యూరోపియన్ యూనియన్, యూకే, స్విట్జర్లాండ్, నార్వే సహా 30 దేశాల్లోని 854 నగరాల్లో ఈ పరిశోధన నిర్వహించారు. ఈ ప్రాంతాల్లోని మొత్తం జనాభాలో ఇది 40 శాతానికి సమానం. ఈ అధ్యయనం ప్రకారం రికార్డు స్థాయిలో సుమారు 50,000 మంది వేసవి తాపానికి బలయ్యారు. 

శిలాజ ఇంధనాల వాడకం వల్ల పెరిగిన వాతావరణ మార్పులు లేకపోయి ఉంటే, ఈ మరణాల్లో మూడింట రెండొంతుల మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని నివేదిక స్పష్టం చేసింది. గతంలో 2022లో 29,000, 2003లో 28,000 మరణాలు సంభవించగా, ఈసారి ఆ సంఖ్యను మించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

'బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్' చేసిన మరో విశ్లేషణలో ఆర్థిక నష్టాలపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో యూర‌ప్‌ సమాఖ్య జీడీపీలో 0.17 శాతం నష్టం వాటిల్లిందని, దీని విలువ 17 బిలియన్ యూరోలు ($19 బిలియన్లు) ఉంటుందని అంచనా వేసింది. 

గత దశాబ్దంలో ఇదే కాలానికి సంబంధించిన సగటు నష్టంతో పోలిస్తే ఇది ఏకంగా రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ వేడి కారణంగా ఫ్రాన్స్ జీడీపీ 0.2 శాతం, జర్మనీ 0.1 శాతం, స్పెయిన్ 0.05 శాతం మేర తగ్గుదల నమోదు చేశాయి.

ఈ ఏడాది యూర‌ప్‌లో మే నెలలోనే వడగాల్పులు ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగాయి. ముఖ్యంగా పశ్చిమ యూర‌ప్‌లో 1991-2020 మధ్య కాలంలోని సగటు వేసవి ఉష్ణోగ్రతల కంటే దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. కొన్ని రోజులైతే సాధారణం కంటే 12 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉష్ణోగ్రతలు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. 

దక్షిణ, పశ్చిమ యూర‌ప్‌ దేశాలు ఈ తీవ్రతకు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ ఎండల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, కార్చిచ్చులు చెలరేగడం, ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరగడం, రవాణా వ్యవస్థలకు అంతరాయం కలగడం, కూలింగ్ సిస్టమ్స్ విఫలమవడం వంటి సమస్యలు తలెత్తాయి.

అయితే, వేడి కారణంగా సంభవించే మరణాల సంఖ్య తరచుగా తక్కువగా నమోదవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. అధిక ఉష్ణోగ్రతలు నేరుగా మరణానికి కారణంగా కాకుండా, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తాయని, దాంతో అసలు కారణాన్ని గుర్తించడం కష్టమవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన వాస్తవ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Advertisement
Europe
Europe Heatwave Deaths
Climate Change Impact
Europe Economic Loss
Global Warming
Imperial College London Study

More Telugu News