జేఎన్‌యూ ఘటన: రాహుల్, ప్రియాంక మౌనంపై పురందేశ్వరి ఫైర్
Add ap7am to your home Screen

జేఎన్‌యూ ఘటన: రాహుల్, ప్రియాంక మౌనంపై పురందేశ్వరి ఫైర్

Purandeswari slams Rahul and Priyanka over silence on JNU incident
  • కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు
  • నిందిత ఎంపీని కాంగ్రెస్ కాపాడుతోందన్న పురందేశ్వరి
  • మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శ
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో కాంగ్రెస్ ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన ఘటనపై ఆ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మౌనంగా ఉండటంపై బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆరోపణ కాదని, నిజమని తేలిన వాస్తవమని ఆమె స్పష్టం చేశారు.

ఈ విషయంపై పురందేశ్వరి మాట్లాడుతూ... "జేఎన్‌యూ పరిపాలన విభాగం నియమించిన అంతర్గత విచారణ కమిటీ నివేదికలో, నిందితుడైన కాంగ్రెస్ ఎంపీ 11 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు స్పష్టంగా తేలింది. కాంగ్రెస్ ఎంపీపై ఇంతటి తీవ్రమైన నేరం రుజువైనప్పటికీ రాహుల్, ప్రియాంక ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరం" అని అన్నారు.

పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే రాహుల్ గాంధీ, ఈ విషయంలో మౌనంగా ఉంటూ నిందితుడికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. కనీసం ఒక ప్రకటన కూడా చేయకపోవడం అంటే నిందితుడిని కాపాడటమేనని విమర్శించారు. ఈ దుష్ప్రవర్తనకు పాల్పడిన ఎంపీని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బహిష్కరించాల్సిందని, కానీ అతనికి రక్షణ కల్పించడం ద్వారా ఆ పార్టీ ద్వంద్వ వైఖరి బయటపడిందని పురందేశ్వరి దుయ్యబట్టారు.

మహిళల భద్రత, గౌరవం పట్ల కాంగ్రెస్ నాయకులకు ఉన్న చిత్తశుద్ధిని ఆమె ప్రశ్నించారు. నిందితుడిపై తక్షణమే కఠినమైన చట్టపరమైన, రాజకీయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ మహిళా మోర్చా పురందేశ్వరి నేతృత్వంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టింది. 
Advertisement
Daggubati Purandeswari
Rahul Gandhi
Priyanka Gandhi
JNU sexual harassment case
Congress MP harassment
BJP Mahila Morcha protest

More Telugu News