హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.. ఆరుగురి అరెస్ట్
- ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లు మోసం చేసిన ఆరుగురి అరెస్ట్
- వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, నకిలీ యాప్‌లతో హైదరాబాద్ వాసికి టోకరా
- నమ్మకం కోసం మొదట రూ.1.05 లక్షలు విత్‌డ్రాకు అనుమతి
- దేశవ్యాప్తంగా 26 కేసులతో సంబంధం ఉన్న బ్యాంక్ ఖాతా గుర్తింపు
- మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరాల డబ్బును బదిలీ చేస్తున్న ముఠా
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన బాధితుడిని ఈ ఏడాది జనవరిలో '282 బార్క్లేస్ ఇండియా హై-క్వాలిటీ స్టాక్ ట్రేడింగ్ రీసెర్చ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. అధిక రాబడులు, ఐపీఓ కేటాయింపుల పేరుతో ఆశ చూపి BarclaysDailyTrading.com, app.bulishmark.com వంటి నకిలీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టించారు. నమ్మకం కలిగించేందుకు తొలుత రూ.1,05,000 విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించారు. అది నమ్మిన బాధితుడు 19 లావాదేవీల్లో మొత్తం రూ.1,22,18,029 పెట్టుబడిగా పెట్టారు.
అనంతరం, బాధితుడి ఖాతాలో రూ.15.69 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీగా చూపించి, ఐపీఓల విడుదల కోసం మరో రూ.35 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.
సైబర్ క్రైమ్స్ డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఈ మోసాలకు పాల్పడ్డారు. కంపెనీలను స్థాపించి, అధిక విలువ గల కరెంట్ ఖాతాలు తెరిచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను మూడో పక్షానికి అందించి కమీషన్ పొందేవారు. విచారణలో ఒక యెస్ బ్యాంక్ ఖాతాకు దేశవ్యాప్తంగా 26 కేసులు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు 18 కేసులతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ ఖాతాల ద్వారా రూ.కోట్లలో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.