‘యుద్ధానికి సిద్ధం’ అంటున్న పాక్‌ మంత్రి.. సింధు జలాలపై కొత్త డ్రామా..!

Pakistan Minister Khawaja Asif says ready for war over Indus Waters Treaty
  • సింధు జలాల అంశంపై పాక్ రక్షణ మంత్రి యుద్ధ హెచ్చరిక
  • నీటి హక్కులు జాతీయ భద్రతలో భాగమని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్య
  • ఉగ్రదాడి తర్వాతే ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్
  • ఉగ్రవాదంపై చర్యలే భారత ప్రధాన డిమాండ్
  • నీటి సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాక్‌
ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలన్న భారత డిమాండ్‌ను పక్కనబెట్టి పాకిస్థాన్‌ మరోసారి యుద్ధ భాష మాట్లాడింది. సింధు జలాల అంశాన్ని కారణంగా చూపుతూ భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. నీటి ప్రవాహానికి ముప్పు వాటిల్లుతోందని భావిస్తే యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కవ్వించారు. ఇప్పటికే ఉగ్రవాదం, సరిహద్దు ఉద్రిక్తతలను సాకుగా వాడుకున్న పాక్.. ఇప్పుడు సింధూ జలాల అంశాన్ని రాజకీయం చేస్తోంది.

పాక్‌కు చెందిన ఏఆర్‌వై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతోందని భావిస్తే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో భాగమని పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందని, పాక్‌ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలే కారణమని భారత్ స్పష్టం చేసింది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదానికి చెక్ పెట్టకుండా పాక్‌ బాధిత దేశంలా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు ఒప్పందాల గురించి మాట్లాడటం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొంటున్నారు.

ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు పాక్‌లో కలకలం రేపాయి. భారత హక్కులకు చెందిన నీటిని పూర్తిగా వినియోగించుకునే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీనిని పాక్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే భారత భూభాగంలో లభించే జల వనరులను దేశ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు.

పాక్‌ ప్రస్తుతం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, నీటి నిర్వహణలో వైఫల్యాలు, పాతబడిన సాగునీటి వ్యవస్థల కారణంగా సమస్య మరింత తీవ్రమైంది. ఈ అంతర్గత వైఫల్యాలను పక్కనబెట్టి భారత్‌పై నిందలు మోపడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జలాల అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లినా, ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చకపోతే పాక్‌ వాదనలకు పెద్దగా మద్దతు లభించే అవకాశం లేదని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
Go Back to Shorts
Khawaja Asif
Indus Waters Treaty
India Pakistan relations
Pakistan water crisis
India Pakistan war threat
CR Patil

More Telugu News