సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు!

Radha Gayatri murder case FIR filed as husband Sricharan flees Simhachalam hotel
  • గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి
  •  జూన్ 14న ఉత్తరాఖండ్ టూర్‌లో ఉండగా ముస్సోరి హోటల్‌లో రాధ మృతి
  • ముక్కు నుంచి రక్తం వచ్చిన స్థితిలో శవమై కనిపించిన గాయత్రి
  • గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై యూపీ, ముస్సోరిలో హత్య కేసు నమోదు 
  • మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తింపు
  • కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించినట్లు ఎఫ్ఐఆర్‌లో నమోదు
విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి హిల్‌స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుమార్తె మృతిపై ఆమె తండ్రి, ఆర్మీ మాజీ ఉద్యోగి అయిన సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు, సమర్పించిన పక్కా ఆధారాలతో ముస్సోరి పోలీసులు గాయత్రి భర్త శ్రీచరణ్‌పై హత్య కేసు నమోదు చేశారు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఈ దంపతులు ఇటీవల ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లగా, జూన్ 14న ముస్సోరిలోని ఒక హోటల్ గదిలో రాధా గాయత్రి శవమై కనిపించింది. మృతి చెందిన సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తం కారినట్లు గుర్తించిన పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, తాజా దర్యాప్తులో భర్త శ్రీచరణ్ ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసి, మరణానికి కారణమయ్యే ప్రమాదకర మందులను వాడించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ హత్య కేసు నమోదు కావడంతో విశాఖపట్నంలో ఉన్న భర్త శ్రీచరణ్ అప్రమత్తమై పరారయ్యాడు.

గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ మొదటి నుంచి అబద్ధాలు చెబుతూ పోలీసులను, భార్య కుటుంబ సభ్యులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ టూర్ ప్లాన్‌కు సంబంధించి మృతురాలి తండ్రి సుధాకర్ పోలీసులకు కీలక ఆధారాలు అందజేశారు. నిందితుడు తమకు కేవలం రిషికేశ్, హరిద్వార్ యాత్రల గురించే చెప్పాడని, ముస్సోరి వెళ్తున్నట్లు గానీ, అక్కడ బస చేస్తున్నట్లు గానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాచాడని ఆయన ఆరోపించారు. తాను స్వయంగా ముస్సోరి వెళ్లి, పోలీసులు, డెహ్రాడూన్ ఉన్నతాధికారులను కలిసి న్యాయం చేయాలని కోరారు. అలాగే కూతురు చనిపోయిన హోటల్ యాజమాన్యంతో మాట్లాడగా, అక్కడ ఎలాంటి మద్యం గానీ, మాదకద్రవ్యాలు గానీ సరఫరా చేయలేదని వారు స్పష్టం చేసినట్లు సుధాకర్ వెల్లడించారు.

దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవ చేసిన తన కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటని సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతికి కారణమైన అల్లుడిపై కఠిన చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం ఆపనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక అత్యంత కీలకంగా మారనుంది. మరోవైపు, విశాఖపట్నంలోని సింహాచలంలో ఒక హోటల్ రూమ్‌లో బస చేసిన శ్రీచరణ్, తనపై ముస్సోరిలో హత్య కేసు నమోదైనట్లు తెలియడంతో అక్కడి నుంచి రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాడు. పరారైన నిందితుడి కోసం ఉత్తరాఖండ్, విశాఖపట్నం పోలీసులు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపట్టారు.  
Go Back to Shorts
Radha Gayatri
Sricharan
Mussoorie murder case
Visakhapatnam software engineer death
Uttarakhand police investigation
Simhachalam hotel escape

More Telugu News