ఢిల్లీ అగ్నిప్రమాదం: ఆసుపత్రి పక్కనే అనంత లోకాలకు.. ఒకే ఇంట్లో 2 తరాలు ఖాళీ!
- ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మృతి
- గురుగ్రామ్ కుటుంబంలో ఎనిమిది మంది మృతి
- అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం వచ్చిన ఫ్యామిలీ
- ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని హోటల్లో బస
గురుగ్రామ్ సెక్టార్-46కు చెందిన వివేక్ అగర్వాల్ (48) తన తండ్రికి తోడుగా ఉండేందుకు భార్య తార్జిని, కుమార్తెలు జివిషా, వార్యలతో కలిసి వచ్చారు. వీరితో పాటు కుటుంబ పెద్దలు అశోక్ అగర్వాల్, కమల, ప్రేమ్‌లత, ఝవేరి కూడా అక్కడే బస చేశారు. అలాగే రాధేశ్యామ్‌ను పరామర్శించేందుకు తార్జిని మేనమామ అజయ్ గుప్తా వైపు బంధువులు మరో ముగ్గురు కూడా ఆ హోటల్‌కే వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల వారు ఇలా హోటల్ గదుల్లో ఉన్న సమయంలోనే మృత్యువు అగ్ని రూపంలో ముంచెత్తింది.
ఈ ప్రమాదంలో రాధేశ్యామ్ భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మనవరాళ్లతో పాటు ముగ్గురు బంధువులు కూడా తనువు చాలించారు. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్న ఆ వృద్ధుడికి, తన కుటుంబం మొత్తం ఇక లేదనే చేదు నిజం ఇంకా తెలియదు. బంధువులంతా మ్యాక్స్ ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న వారిని కదిలించాయి.