హైడ్రాలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు... 'ఈగిల్ టీమ్' పేరిట విధులు

Telangana Government Provides Jobs to Transgenders in HYDRAA
  • తెలంగాణలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
  • హైడ్రా సంస్థలో... కబ్జాల తొలగింపు విధుల్లో నియామకం
  • 'హైడ్రా ఈగిల్ టీమ్' పేరుతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ
  • ఈ ఉద్యోగం తమకు గౌరవం, ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి
  • వారి పనితీరుపై అధికారుల ప్రశంసలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఓ వినూత్న నిర్ణయం, సమాజంలో మార్పునకు నాంది పలుకుతోంది. హైడ్రాలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు కల్పించి, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ చొరవ ద్వారా వారికి గౌరవప్రదమైన జీవనోపాధిని అందించి, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగస్వాములను చేసింది.

ఈ బృందంలో 11 మంది ట్రాన్స్ మహిళలు, ఐదుగురు ట్రాన్స్ పురుషులు ఉన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ భూములపై అక్రమ కట్టడాలను తొలగించడంలో వీరు చురుగ్గా పాల్గొంటున్నారు. కబ్జాదారులు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా భయపడకుండా, నిర్భయంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. వీరిని 'హైడ్రా ఈగిల్ టీమ్'గా పిలుస్తున్నారు. ఈ ఉద్యోగం తమకు కేవలం జీవనోపాధి మాత్రమే కాదని, జీవితానికి కొత్త గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ఇచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా యూనిఫాం ధరించి విధులకు హాజరవడం తమకు ఎంతో గర్వకారణమని చెబుతున్నారు.

ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని ఐలాపూర్‌లో 862 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని, మాదాపూర్‌లోని ఎదులకుంట చెరువును కబ్జాదారుల బారి నుంచి కాపాడటంలో ఈ బృందం కీలక పాత్ర పోషించింది. కబ్జాల తొలగింపు సమయంలో ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించడం, అధికారులు-ప్రజల మధ్య సమన్వయం చేయడంలో వీరు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు.

"గతంలో బతుకుదెరువు కోసం అడుక్కునేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా హేళన చేసేవారు. పని అడిగితే ముఖం మీదే లేదనేవారు. కానీ, ఇప్పుడు యూనిఫాంలో విధులకు వెళుతుంటే అందరూ మర్యాదగా మాట్లాడుతున్నారు" అని తాన్షి రాయ్ ఆనందంగా చెప్పారు. 

"అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణించగలరు. హైడ్రాలో మా విధులే దీనికి నిదర్శనం. ఇక్కడ అధికారులు, ఇతర సిబ్బంది మమ్మల్ని సమానంగా చూస్తారు" అని గాయత్రి తెలిపారు. 

ఈ ఉద్యోగం వల్ల వీరు ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడి, తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా 'మేము కూడా సమాజానికి సేవ చేయగలం' అనే ఆత్మవిశ్వాసం వారిలో వెల్లివిరుస్తోంది.
Go Back to Shorts
Transgenders
Telangana
HYDRAA
Hyderabad
Government assets
Transgender jobs
Ameenpur
Iilapur
Madapur lake
Transgender community

More Telugu News