పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు.. తీవ్రంగా స్పందించిన సీపీఐ రామకృష్ణ
- సోదాలు నిర్వహించిన అధికారులు ఒట్టి చేతులతోనే వెనక్కి వెళ్లిపోయారన్న రామకృష్ణ
- విజయన్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే దాడులు చేశారని ఆరోపణ
- బీజేపీ కండువా కప్పుకునే వారిపై దాడులు ఉండవని వ్యాఖ్య
పదేళ్ల పాటు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ కు ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని... ఆ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈడీ దాడులు జరిగాయని రామకృష్ణ విమర్శించారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలపై ఈడీ దాడులు, అక్రమ కేసులు సాధారణమై పోయాయని దుయ్యబట్టారు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా విషయంలో కూడా ఇదే జరిగిందని రామకృష్ణ అన్నారు. బీజేపీ కండువా కప్పుకునే వారు ఎవరైనా సరే వారిపై ఎలాంటి దాడులు జరగవని చెప్పారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బెంగాల్ సీఎం సువేందు అధికారిపై కూడా గతంలో మోదీ ఆరోపణలు చేశారని... అయితే, వారు బీజేపీలో చేరడంతో వాళ్లపై ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. కేవలం ప్రతిపక్ష నేతలపై మాత్రమే ఒక పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు.