ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా

AP Government Focus on Ebola Special Vigilance at Airports
  • ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతున్న ఎబోలా కేసులు
  • అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాలపై కూడా నిఘా

ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా, సూడాన్ వంటి దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


రాష్ట్రంలోని అంతర్జాతీయ ప్రయాణాలు జరిగే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ వ్యవహారంపై అన్ని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎబోలా వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


కేవలం విమానాశ్రయాలే కాకుండా, రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవులు, అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాల్లోనూ నిఘా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ప్రయాణికులలో ఎవరికైనా ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే, వారిని తక్షణమే ఐసోలేట్ చేసి క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండటం అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.


Advertisement
AP Government
Ebola virus
Andhra Pradesh
Africa
Visakhapatnam
Tirupati
Vijayawada
Satya Kumar Yadav
Health Department

More Telugu News