అగ్నిమాపక శాఖ ప్రక్షాళనకు ఏపీ హోంమంత్రి ఆదేశాలు.. 1275 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Vangalapudi Anitha Orders Fire Department Overhaul 1275 Posts Approved
  • అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష
  • అత్యవసర స్పందన సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించాలని సూచన
  • ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసే యోచన
  • పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరి చేయాలని నిర్ణయం
రాష్ట్ర అగ్నిమాపక శాఖను పటిష్టం చేసే దిశగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సచివాలయంలో శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించిన ఆమె, శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, అత్యవసర స్పందన సమయాన్ని (రెస్పాన్స్ టైం) గణనీయంగా తగ్గించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 22 నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఫైర్ స్టేషన్లు లేకపోవడంపై మంత్రి దృష్టి సారించారు. కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు 1,275 ఖాళీలను దశలవారీగా భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉన్న 305 పోస్టుల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం 25-30 నిమిషాలుగా ఉన్న స్పందన సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకాన్ని తప్పనిసరి చేయడంతో పాటు, లైసెన్సుల రెన్యువల్‌కు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలన్నారు. అడవి మంటల నివారణకు డ్రోన్ల వినియోగం, పాఠశాలలు, ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. సింగపూర్, స్విట్జర్లాండ్, చండీగఢ్ వంటి ప్రాంతాల విపత్తు నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు చేయదగిన అంశాలపై నివేదిక ఇవ్వాలని కోరారు.
 

Go Back to Shorts
Vangalapudi Anitha
AP Home Minister
Andhra Pradesh Fire Department
Fire Stations
Fire Safety
Job Calendar
Fire Department Recruitment
Visakha West Constituency
Industrial Fire Safety
Emergency Response Time

More Telugu News