పాకిస్థాన్ లో పెళ్లిళ్ల కష్టాలు... విందులో ఒక వంటకమే!

Pakistan Wedding Industry Faces Crisis Due to Inflation
  • మధ్యప్రాచ్య సంక్షోభంతో పాక్ వెడ్డింగ్ పరిశ్రమకు కష్టాలు
  • పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంతో పెళ్లిళ్ల ఖర్చులు పైపైకి
  • రాత్రి 10 గంటలకే వేడుకలు ముగించాలంటూ ప్రభుత్వ కఠిన నిబంధనలు
  • 400 మంది నుంచి 150కి పడిపోయిన అతిథుల సంఖ్య
  • ఖర్చులు తగ్గించుకుంటూ చిన్న బడ్జెట్‌తో పెళ్లిళ్లు చేస్తున్న ప్రజలు
పెళ్లిళ్లంటే అంగరంగ వైభవంగా జరుపుకునే పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఆ వేడుకల కళ తప్పింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం, దేశంలో రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు ఆ దేశ వెడ్డింగ్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ఒకప్పుడు ఘనంగా జరిగే వివాహాలు ఇప్పుడు నిరాడంబరంగా, తక్కువ బడ్జెట్‌లో ముగుస్తున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ప్రముఖ దినపత్రిక 'డాన్'లో ఫాతిమా ఎస్ అత్తర్‌వాలా అనే రచయిత్రి తన కథనంలో విశ్లేషించారు.

పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం కారణంగా వెడ్డింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగాయని 'షాదియానా' అనే వెడ్డింగ్-టెక్ స్టార్టప్ సహ వ్యవస్థాపకురాలు ఇజ్జా జమాన్ చెప్పిన వివరాలను ఫాతిమా తన కథనంలో ఉటంకించారు. "చాలా కల్యాణ మండపాలు ఒక్కో వ్యక్తిపై రూ.500 వరకు రేట్లను పెంచేశాయి. ఇంధన ధరల అనిశ్చితి కారణంగా శీతాకాలం నాటి బుకింగ్స్‌కు ప్రస్తుత ధరలను ఖరారు చేయడానికి కూడా నిర్వాహకులు నిరాకరిస్తున్నారు" అని ఇజ్జా జమాన్ వివరించారు.

పెరుగుతున్న ధరలతో పాటు, పాక్ ప్రభుత్వ కఠిన నిబంధనలు కూడా ఈ పరిశ్రమను మరింత దెబ్బతీస్తున్నాయి. రాత్రి 10 గంటలకే వివాహ వేడుకలు ముగించాలని, ఫంక్షన్లలో ఒకే వంటకాన్ని (one-dish policy) మాత్రమే అందించాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఇస్లామాబాద్‌లోని అనేక ఫంక్షన్ హాళ్లు మూతపడ్డాయని ఫాతిమా పేర్కొన్నారు. 

అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి చర్చల సమయంలో మార్గల్లా హిల్స్ సమీపంలో విధించిన భద్రతా వలయాలు, నగరవ్యాప్తంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అమలుచేస్తున్న వీఐపీ ప్రోటోకాల్స్ వల్ల అతిథులు ఆలస్యంగా వస్తున్నారని, ఇది కూడా నిర్వాహకులకు సవాలుగా మారిందని ఆమె తెలిపారు.

పాకిస్థాన్ వెడ్డింగ్ పరిశ్రమ చాలా పెద్దది. గత శీతాకాలంలో కేవలం కరాచీ నగరంలోనే దాదాపు రూ.33 బిలియన్ల వ్యాపారం జరిగిందని మీడియా నివేదికలు చెబుతుండగా, మొత్తం పాక్ మార్కెట్ విలువ రూ.900 మిలియన్లుగా 'షాదియానా' అంచనా వేసింది. అయితే, ఈ పరిశ్రమ ఇప్పటికీ అసంఘటితంగానే ఉంది. ఉదాహరణకు, కరాచీలోని నార్త్ నాజిమాబాద్ వంటి ప్రాంతంలోనే 60 నుంచి 70 వెడ్డింగ్ హాళ్లు ఉంటాయి. సరైన వేదికను ఎంచుకోవడానికి ఒక చోటు నుంచి మరో చోటుకి తిరగాల్సిందే. తీరా వెళ్లాక చాలా వరకు హాళ్లు అప్పటికే బుక్ అయి ఉంటాయి.

యూఎస్-ఇరాన్ సంక్షోభం, ద్రవ్యోల్బణానికి ముందు 'షాదియానా' ప్లాట్‌ఫామ్‌లో సగటు వివాహ బడ్జెట్ రూ.6 లక్షలుగా ఉండేది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.20,000 నుంచి రూ.4.4 మిలియన్ల వరకు బడ్జెట్‌తో పెళ్లిళ్లు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు సగటున 400 మంది అతిథులతో జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు 150 మందికి పరిమితం అయ్యాయి. వెన్యూ, ఫొటోగ్రఫీ, క్యాటరింగ్ వంటి వాటిపై బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించుకుంటున్నారు.

మహమ్మారి సమయంలో కార్యకలాపాలు ప్రారంభించి, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, దేశీయ ఆర్థిక సంక్షోభం, ఇప్పుడు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నామని ఫాతిమా తన కథనంలో పేర్కొన్నారు. ఆర్థిక ఒత్తిళ్లు ఎంత పెరిగినా, వివాహాలు ఆగవని, కాకపోతే మునుపటి కంటే చాలా తక్కువ బడ్జెట్‌తో జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.


Go Back to Shorts
Pakistan Wedding Industry
Pakistan
Inflation
Wedding Costs
Wedding Venues
Karachi
Islamabad
शादियाना
Middle East Crisis

More Telugu News