నవలి ప్రాజెక్టుపై చర్చలకు చంద్రబాబు రావడం లేదు: డీకే శివకుమార్

DK Shivakumar Says Chandrababu Not Attending Navali Project Talks
  • చర్చలకు ఏపీ సీఎం సమయం ఇవ్వడం లేదన్న డీకే  
  • తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు దాదాపు పూర్తి
  • మే 15న గేట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
  • గేట్ల ఏర్పాటు ఖర్చును కర్ణాటక, ఏపీ పంచుకున్నాయని వెల్లడి
  • బోర్డు సమావేశంలోనే నవలిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ
తుంగభద్ర డ్యామ్‌కు కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయని, అయితే నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చల్లో జాప్యం జరుగుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఆదివారం ఆయన తుంగభద్ర డ్యామ్ వద్ద గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. "తుంగభద్ర డ్యామ్‌కు మొత్తం 33 కొత్త గేట్లను అమర్చాం. కేవలం కొద్దిపాటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 7 నాటికి ఆ పనులను పూర్తి చేసి, మే 15న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం" అని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.54 కోట్లు ఖర్చయిందని, ఈ వ్యయాన్ని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 64:34 నిష్పత్తిలో భరించాయని ఆయన వివరించారు. ఈ గేట్ల ఏర్పాటుతో 7.50 లక్షల మంది రైతుల ప్రయోజనాలు కాపాడినట్లు అవుతుందని అన్నారు.

అనంతరం నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డ్యామ్‌లో పూడికతీత అంశాలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. "ఈ విషయంలో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాకు సమయం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఏపీకి ఎక్కువ నీరు అందుతుండటంతో ఆయనకు ఆసక్తి లేనట్లుంది. ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు సమావేశంలోనే చర్చించి తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. డ్యామ్‌లో పూడిక తొలగించడం అంత సులభమైన విషయం కాదని, దానికి గ్లోబల్ టెండర్ పిలవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కొత్త గేట్లు రాబోయే 50 ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం ఒక పంటను త్యాగం చేసిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
DK Shivakumar
Tungabhadra Dam
Navali project
Andhra Pradesh
Karnataka
Chandrababu Naidu
irrigation project
reservoir construction
water resources
new crest gates

More Telugu News