హైదరాబాద్‌లో ఘోరం.. వ్యక్తిని కారు బానెట్‌పై 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్!

Car driver drags man 2km on bonnet in Hyderabad hit and run
  • మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టిన కారు
  • కారును ఆపేందుకు ప్రయత్నించిన తండ్రి
  • బానెట్‌పై పడినా ఆపకుండా 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం 
  • కారుపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ స్టిక్కర్
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. యాక్సిడెంట్ చేసి, ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఓ కారు డ్రైవర్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నారు. గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జిలానీ, ఫైసల్ కిందపడిపోగా, ఫైసల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.

అయినా డ్రైవర్ ఆపకుండా, బానెట్‌పై ఉన్న జిలానీ సహా కారును బాలాపూర్ చౌరస్తా మీదుగా మంద మల్లమ్మ చౌరస్తా వరకు సుమారు 2 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు కారును అడ్డుకోవడంతో డ్రైవర్ బాధితుడిని వదిలి పరారయ్యాడు. ఆ కారుకు 'ఆన్ గవర్నమెంట్ డ్యూటీ' అనే స్టిక్కర్ ఉన్నట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఫైసల్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు జిలానీ ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
SK Jilani
Hyderabad accident
Mirpet police
car driver
hit and run
Balapur
crime news
Telangana news
road accident
LB Nagar

More Telugu News