ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు.. 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court Raps Centre Over Termination Of Teens Pregnancy
  • ఆమె పడిన వేదనను ఏదీ భర్తీ చేయలేదని చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
  • కోర్టు తీర్పును సవాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన కోర్టు
  • పౌరుల‌ వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవించాలని ప్రభుత్వానికి సూచన
అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక 31 వారాల గర్భాన్ని తొలగించాలంటూ గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

గురువారం ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై నిప్పులు చెరిగారు. "అత్యాచారం తర్వాత ఆమె (బాధితురాలు) పడిన వేదనను ఏదీ భర్తీ చేయలేదు. మేడమ్, ముందు పౌరులను గౌరవించడం నేర్చుకోండి" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కోర్టు ఇచ్చిన తీర్పును బాధితురాలు లేదా ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే సవాలు చేయగలరని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఆ హక్కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదని, బిడ్డకు జన్మనిచ్చి దత్తతకు ఇవ్వడమే ఏకైక మార్గమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

ఇదే ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి జోక్యం చేసుకుంటూ, "మేము వ్యక్తిగత ఎంపికలను గౌరవిస్తాము, మీరు కూడా అలాగే గౌరవించాలి" అని ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ, బాధితురాలి హక్కులకే అత్యున్నత న్యాయస్థానం పెద్దపీట వేసింది.
Go Back to Shorts
Supreme Court
Central Government
Teen's Pregnancy

More Telugu News