Iran: అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్

Iran Claims Downing US Drone F 16 Fighter Jet
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. అమెరికాకు చెందిన ఒక F-16 ఫైటింగ్ ఫాల్కన్ యుద్ధ విమానంతో పాటు, ఒక MQ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ (IRGC) సంచలన ప్రకటన చేసింది. తమ దేశ దక్షిణ గగనతలంలో ఈ ఘటనలు జరిగాయని తెలిపింది.

అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన పరిశ్రమలపై ప్రతీకార దాడులు చేస్తున్న క్రమంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు ఐఆర్‌జీసీ తన అధికారిక వార్తా సంస్థ ‘సెపా న్యూస్’ ద్వారా వెల్లడించింది. తమ F-16 విమానం లక్ష్యంగా దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటకామ్) కూడా అంగీకరించిందని ఇరాన్ పేర్కొంది. అయితే, "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఒక F-16 విమానం సురక్షితంగా మిడిల్ ఈస్ట్‌లోని బేస్‌లో ల్యాండ్ అయింది" అని సెంటకామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇదే సమయంలో, దుబాయ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన యాంటీ-డ్రోన్ పరికరాల గిడ్డంగిని కూడా ధ్వంసం చేసినట్లు ఐఆర్‌జీసీ శనివారం ప్రకటించింది. అమెరికా దళాలకు సహకరిస్తున్న ఈ గిడ్డంగిపై దాడి చేసి, అందులో ఉన్న 21 మంది ఉక్రెయిన్ పౌరులతో సహా మొత్తం కేంద్రాన్ని నాశనం చేశామని తెలిపింది.

అయితే, ఇరాన్ ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇదొక "అబద్ధం", "నిరాధారమైన ప్రచారం" అని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ సమాచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తుండగా, వాటికి ప్రతీకారంగా ఇరాన్, దాని మిత్రపక్షాలు దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Go Back to Shorts
Iran
US drone
F-16 Fighting Falcon
MQ-9 Reaper drone
Islamic Revolution Guard Corps
IRGC
Ukraine
Middle East
America Israel attacks

More Telugu News