Pentagon: పిజ్జా ఆర్డర్ల పెరుగుదలకు, పెంటగాన్ నిర్ణయాలకు ఏమిటి లింకు?

Pentagon Pizza Theory Linked to Rising Pizza Orders Amidst US Iran Tensions
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా తొలగిపోలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ విరామం కొనసాగుతున్నప్పటికీ... ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వద్ద ఓ విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అక్కడ పిజ్జా ఆర్డర్లు అకస్మాత్తుగా భారీగా పెరిగిపోయాయి. ఇది అమెరికా ఏదో పెద్ద సైనిక చర్యకు సిద్ధమవుతోందనడానికి సంకేతమంటూ ‘పెంటగాన్ పిజ్జా థియరీ’ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనూ పెంటగాన్ వద్ద ఫుడ్ డెలివరీల సరళిపై నాటి సోవియెట్ యూనియన్ నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచేవట.

ఏమిటీ పిజ్జా థియరీ?

అమెరికా సైన్యం ఏదైనా పెద్ద సైనిక చర్యకు ఉపక్రమించే ముందు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు రాత్రుళ్లు కార్యాలయాల్లోనే ఉండి పనిచేస్తుంటారు. ఆ సమయంలో త్వరితగతిన తినేందుకు పిజ్జాల వంటి ఫాస్ట్ ఫుడ్ డెలివరీలపై ఆధారపడతారు. దీంతో పెంటగాన్ సమీపంలోని పిజ్జా సెంటర్లకు ఆర్డర్లు వెల్లువెత్తుతాయి. తాజాగా గురువారం సాయంత్రం పాపా జాన్స్‌లో 296 శాతం, డొమినోస్‌లో 208 శాతం, పిజ్జా హట్‌లో 200 శాతం ఆర్డర్లు పెరిగినట్లు ఓ స్థానిక డెలివరీ ట్రాకింగ్ వెబ్‌సైట్ తెలిపింది. గతంలో వెనెజువెలాపై దాడికి ముందు కూడా ఇలాగే పిజ్జా ఆర్డర్లు వెిల్లువెత్తాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, ఇది రాబోయే ప్రమాదానికి సూచిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. 

భూసేనల మోహరింపునకు సన్నాహాలు

హర్మూజ్‌ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 10 రోజులు పొడిగించారు. తన హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాలని ఇరాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు, అమెరికా తన భూసేనలను ఆ ప్రాంతానికి పంపే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్ సమీపంలో అదనంగా 10 వేల మంది సైనికులను మోహరించాలని అమెరికా భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తన చైనా పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు.

ప్రతిదాడికి ఇరాన్ సిద్ధం

అమెరికా కవ్వింపు చర్యలపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అమెరికా భూదాడికి దీటుగా బదులిచ్చేందుకు 10 లక్షల మంది సైనికులను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో, హర్మూజ్ సమీపంలో జరిగిన దాడిలో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి. మరోవైపు, బుషేర్ అణు కేంద్రం సమీపంలో క్షిపణి దాడి జరగడం, అబుదాబిలో ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడితో సహా ఇద్దరు మరణించడం ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ పిజ్జా ఆర్డర్ల పెరుగుదల నిజంగా ఓ భారీ సైనిక చర్యకు నాంది పలుకుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. అయితే, ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Go Back to Shorts
Pentagon
Pentagon pizza theory
US Iran tensions
Middle East conflict
pizza orders
military action
Donald Trump
Hormuz Strait
Iran military
US military

More Telugu News