Lokesh Kanagaraj: వ్యాన్‌లో ఏకే-47లు.. లోకేశ్‌ కనగరాజ్ యూనిట్ ఇచ్చిన ట్విస్ట్‌తో పోలీసులకే షాక్!

Chennai Police Shocked by AK 47s in Lokesh Kanagaraj Film Unit Van
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ సినిమాల్లో గ్యాంగ్‌స్టర్లు, గన్నుల మోత మోగడం సర్వసాధారణం. అయితే, అలాంటి ఓ ఘటనే నిజజీవితంలో చోటుచేసుకోవడంతో చెన్నై పోలీసులు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఓ వ్యాన్‌ను ఆపగా, అందులో భారీగా ఆయుధాలు కనిపించడంతో అది ఏదో పెద్ద స్మగ్లింగ్ ముఠా పనే అని భావించారు. కానీ, విచారణలో అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.

తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అశోక్ నగర్ జంక్షన్‌లో ఓ మినీ వ్యాన్‌ను ఆపి సోదా చేయగా, అందులోని దృశ్యం చూసి అధికారులు కంగుతిన్నారు. ఆ వాహనంలో ఏకంగా 10కి పైగా ఏకే-47 రైఫిళ్లు ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యారు.

లోతుగా విచారించగా, ఆ వాహనం దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ నటిస్తున్న 'డీసీ' సినిమా షూటింగ్ నుంచి వస్తోందని తెలిసింది. ఆ తుపాకులన్నీ కేవలం షూటింగ్ కోసం వాడిన ఇనుప డమ్మీ ప్రాప్స్ అని, వాటిని చిత్రీకరణ ముగిశాక వడపళనిలోని గోడౌన్‌కు తరలిస్తున్నారని చిత్ర యూనిట్ వివరించింది. ఇందుకు సంబంధించిన పక్కా అనుమతి పత్రాలను చూపించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో "సినిమాల్లోనే కాదు, బయట కూడా లోకేశ్‌ లెక్కలు వేరే లెవెల్‌లో ఉంటాయి" అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. లోకేశ్‌ కనగరాజ్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

కాగా, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ 'డీసీ' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బీ హీరోయిన్ గా నటిస్తోంది. 
Go Back to Shorts
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj movie
AK-47 rifles
Chennai police
election check
movie shooting
dummy guns
Tamil Nadu elections
Allu Arjun project

More Telugu News