Ranjith Basha: ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

AP Inter Answer Sheet Valuation Starts Today Says Ranjith Basha
షార్ట్స్‌లో చూడండి
ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు ఇంటర్ విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మార్చి 25తో పరీక్షలు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో, ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు మార్చి 18తో ముగిశాయని గుర్తుచేశారు. మూల్యాంకనంలో భాగంగా ఒక్కో లెక్చరర్ ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యా శాఖ ఇప్పటికే జూనియర్ లెక్చరర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ముఖ్యంగా, విద్యార్థి చేతిరాత బాగాలేదన్న కారణంతో మార్కులు తగ్గించవద్దని ఈ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జవాబులో ఉన్న సమాధానాన్ని పూర్తిగా చదివి, దాని ఆధారంగానే మార్కులు వేయాలని సూచించింది. మూల్యాంకనం పూర్తయ్యాక, మార్కులను తిరిగి పరిశీలించి స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించింది.

ఈసారి మూల్యాంకనంలో తప్పులు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని బోర్డు హెచ్చరించింది. పొరపాట్లు చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.7,500 వరకు, వాటిని పరిశీలించిన వారికి రూ.2,000 నుంచి రూ.3,750 వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. మార్కుల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తే, సంబంధిత లెక్చరర్లను మూల్యాంకనం నుంచి డీబార్ చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కలిపి మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Ranjith Basha
AP Inter Exams
Inter Valuation
AP Intermediate
Board of Intermediate Education AP
Inter Results
AP Inter Results 2024
Intermediate Exams Andhra Pradesh
AP Education News
Spot Valuation

More Telugu News