FBI: పౌరుల ప్రైవసీకి ముప్పు.. అమెరికాలో మళ్లీ తెరపైకి ప్రభుత్వ నిఘా

FBI Admits Buying Americans Location Data Without Warrants
షార్ట్స్‌లో చూడండి
అగ్రరాజ్యం అమెరికాలో పెను దుమారం రేగింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తమ సొంత పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా వారి లొకేషన్ హిస్టరీని ఎలాంటి వారెంట్ లేకుండానే కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించింది. బుధవారం జరిగిన సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్ పటేల్ స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది పౌరుల ప్రైవసీ హక్కులను కాలరాయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సెనేట్ కమిటీ విచారణ సందర్భంగా, వారెంట్ లేకుండా అమెరికన్ల ప్రైవేట్ డేటాను కొనుగోలు చేసే పద్ధతిని నిలిపివేస్తారా? అని డెమోక్రాట్ సెనేటర్ రాన్ వైడెన్ ప్రశ్నించారు. దీనికి కశ్ పటేల్ సమాధానమిస్తూ.. "మా విధి నిర్వహణకు అవసరమైన అన్ని సాధనాలను ఎఫ్‌బీఐ ఉపయోగిస్తుంది. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడే వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని మేం కొనుగోలు చేస్తున్నాం. ఈ ప్రక్రియ ద్వారా మాకు ఎంతో విలువైన ఇంటెలిజెన్స్ లభించింది" అని తన చర్యను సమర్థించుకున్నారు.

పటేల్ వాదనను సెనేటర్ రాన్ వైడెన్ తీవ్రంగా ఖండించారు. వారెంట్ లేకుండా అమెరికన్ల సమాచారాన్ని కొనుగోలు చేయడం రాజ్యాంగంలోని నాలుగో సవరణను ఉల్లంఘించడమేనని ఆయన మండిపడ్డారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో భారీ మొత్తంలో ప్రైవేట్ సమాచారాన్ని విశ్లేషించే ఈ తరుణంలో ఇది మరింత ప్రమాదకరం. ప్రభుత్వ నిఘాను సంస్కరించడానికి మేం ప్రతిపాదిస్తున్న 'గవర్నమెంట్ సర్వైలెన్స్ రిఫార్మ్ యాక్ట్' బిల్లును ఎందుకు ఆమోదించాలో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ" అని వైడెన్ పేర్కొన్నారు.

గతంలో ఈ పద్ధతిని ఆపేశామని చెప్పిన ఎఫ్‌బీఐ.. ఇప్పుడు మళ్లీ మొదలు
గతంలో కూడా ఎఫ్‌బీఐపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 2023లో అప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే మాట్లాడుతూ, ఏజెన్సీ గతంలో లొకేషన్ డేటాను కొనుగోలు చేసిందని, కానీ ప్రస్తుతం ఆ ప్రక్రియను నిలిపివేసిందని సెనేటర్లకు తెలిపారు. ఒక జాతీయ భద్రతా పైలట్ ప్రాజెక్ట్ కోసం అలా చేశామని, కానీ అది చాలా కాలంగా నిలిచిపోయిందని చెప్పారు. అయితే, ఇప్పుడు మళ్లీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నట్లు ప్రస్తుత డైరెక్టర్ అంగీకరించడంతో పౌర హక్కుల సంఘాలు, చట్టసభ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
FBI
Federal Bureau of Investigation
US surveillance
Kash Patel
Ron Wyden
American privacy
Government Surveillance Reform Act
location data
warrantless searches
fourth amendment

More Telugu News