RCB-RR: ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల అమ్మకం జోరు.. ఆర్‌సీబీ, రాజస్థాన్ కోసం భారీ పోటీ

RCB Rajasthan Royals Face Bidding War for IPL Franchise Sale
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అమ్మకం ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు రెండు దిగ్గ‌జ సంస్థ‌లు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,600 కోట్లు) భారీ విలువతో ఈ డీల్ ఖరారయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆర్‌సీబీకి 2 బిలియన్ డాలర్లు 
ఈ రేసులో స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'ఈక్యూటీ' ఒక ప్రధాన పోటీదారుగా నిలిచింది. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పాయ్, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కోల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్ & కో (KKR), సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ టెమాసెక్ కలిసి ఏర్పాటు చేసిన కన్సార్టియం కూడా గట్టి పోటీ ఇస్తోంది. గతంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులైన గ్లేజర్స్, ఆదార్ పూనావాలా వంటి వారు ఆసక్తి చూపినా, చివరికి వారు రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ 1.8 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వగా, ఈక్యూటీ తమ బిడ్‌ను 2 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచినట్టు తెలుస్తోంది. ఆర్‌సీబీ ప్రస్తుత యజమాని డియాజియో గ్రూప్, ఈ డీల్‌ను ఈ నెల‌ 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి సిద్ధం!
ఇదిలా ఉంటే... మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి సిద్ధమైంది. ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థల నుంచి బైండింగ్ బిడ్లు అందినట్లు సమాచారం. వీరిలో ఆదిత్య బిర్లా గ్రూప్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్‌తో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక కన్సార్టియంగా ఏర్పడి బిడ్ దాఖలు చేసింది. ఈ ఫ్రాంచైజీ కోసం 1.1 బిలియన్ డాలర్ల నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య బిడ్లు దాఖలయ్యాయి.

మొదట మెజారిటీ వాటాను మాత్రమే విక్రయించాలని భావించినా, ఇప్పుడు పూర్తి అమ్మకానికి కూడా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ అమ్మకం ప్రక్రియను ప్రముఖ 'రైన్ గ్రూప్' పర్యవేక్షిస్తోంది. ఆసక్తికరంగా ఈ డీల్‌కు కూడా మార్చి 31నే తుది గడువుగా భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ వర్గాల్లో ఈ రెండు ఫ్రాంచైజీల భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Go Back to Shorts
RCB-RR
Royal Challengers Bangalore
RCB sale
IPL franchise sale
Rajasthan Royals
Aditya Birla Group
Ranjan Pai
Kolberg Kravis Roberts
KKR
Equity Partners
Manipal Hospitals

More Telugu News