ఇది మీ ప్రభుత్వం, నేను మీ సోదరుడిని: ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Government is Yours I am Your Brother
  • హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
  • ముస్లింల సంక్షేమానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి
  • మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన 
  • మైనారిటీ నేతలకు కీలక పదవులు ఇచ్చామని స్పష్టీకరణ
ముస్లిం సమాజ సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ శక్తులు మతాల పేరిట సమాజాన్ని విభజించి, ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

"ఇది మీ ప్రభుత్వం, నేను మీ సోదరుడిని. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా నిలబడదాం" అని రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. 

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. "మనం సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అన్ని మతాల వారు ఐక్యంగా ఉండాలి. కొందరు మన మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

తమ ప్రభుత్వం ముస్లిం సమాజానికి ఇచ్చిన పదవులను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మహ్మద్ అజారుద్దీన్‌కు కేబినెట్ మంత్రి పదవి, సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్‌కు ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు, ఎనిమిది మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని తెలిపారు. క్రీడాకారులైన మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల బహుమతి అందించామని చెప్పారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారి విద్యా, ఉద్యోగావకాశాలకు బాటలు వేశారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Iftar Party
Muslim Welfare
Hyderabad
Mohammad Azharuddin
Asaduddin Owaisi
Minority Reservations
YS Rajasekhara Reddy

More Telugu News