Lawrence Bishnoi: ఈసారి నేరుగా నుదిటిపై షూట్ చేస్తాం.. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

Lawrence Bishnoi Gang Threatens Singer Badshah
ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్ బాద్‌షాకు గ్యాంగ్‌ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు వచ్చాయి. హర్యానాలోని పానిపట్‌లో జరిగిన ఒక కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ గ్యాంగ్.. అదే పోస్ట్‌లో బాద్‌షాను హెచ్చరించింది. ‘‘బాద్‌షా.. నువ్వు హర్యానా సంస్కృతిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నావు. 2024లో నీ క్లబ్ వద్ద జరిగిన పేలుడు కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఈసారి నేరుగా నీ నుదుటిపైనే కాల్పులు జరుపుతాం’’ అంటూ ‘రణదీప్ మాలిక్ - అనిల్ పండిట్’ పేరుతో ఉన్న ఖాతా నుంచి ఈ బెదిరింపులు వెలువడ్డాయి.

ప్రస్తుతం బాద్‌షా ‘టటీరీ’ అనే తన హర్యానా పాట విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పాటలోని సాహిత్యం అభ్యంతరకరంగా ఉందంటూ హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాద్‌షా విచారణకు సహకరించకపోతే అతడిని అరెస్ట్ చేయాలని, అవసరమైతే పాస్‌ పోర్ట్‌ ను కూడా జప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ పాట విషయంలో పలు చోట్ల బాద్‌షాపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన ఈ బెదిరింపులు బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపాయి.

ఈ నేపథ్యంలో బాద్‌షా స్పందిస్తూ.. తానొక గర్వించదగ్గ హర్యానా వ్యక్తినని, ఎవరినీ అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే, 2024 లో బాద్‌షాకు చెందిన చండీగఢ్ నైట్‌క్లబ్ వెలుపల పేలుడు సంభవించిన ఘటనకు కూడా బిష్ణోయ్ ముఠానే బాధ్యత వహించడం గమనార్హం. ప్రస్తుతం ఈ బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, బాద్‌షాకు భద్రత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Lawrence Bishnoi
Badshah
Bollywood singer
Haryana
Threats
Extortion
Tateeeri song controversy
Gangster
FIR
Chandigarh nightclub blast

More Telugu News