Nara Lokesh: ఈ ప్రాజెక్టుపై అపోహలు వద్దు... మత్స్యకారులను కంటికిరెప్పలా చూసుకునే బాధ్యత మాది: జువ్వలదిన్నెలో లోకేశ్

Nara Lokesh on Maritime Project Concerns at Juvaladinn
  • మారిటైమ్ గ్లోబల్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతామన్న మంత్రి లోకేశ్
  • నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అటానమస్ షిప్ యార్డ్‌కు శంకుస్థాపన
  • దేశంలోనే ఇది తొలి అటానమస్ మారిటైమ్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్
  • ప్రాజెక్టుతో తీర భద్రత, మత్స్యకారుల ఉత్పాదకత పెరుగుతాయని వెల్లడి
  • ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు బ్రాండ్, డబుల్ ఇంజన్ సర్కారే కారణమన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ ఇన్నోవేషన్, అటానమస్ సిస్టమ్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, రాష్ట్రంలో దేశ సముద్ర సాంకేతికత, తీర భద్రత, బ్లూ ఎకానమీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక పరిశ్రమ ప్రారంభోత్సవం కాదని, భారతదేశ సముద్ర సాంకేతిక భవిష్యత్తుకు నాంది అని అభివర్ణించారు.

దేశంలోనే రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు సముద్రం జీవనోపాధి, వాణిజ్యం, సంస్కృతికి కేంద్రమని మంత్రి పేర్కొన్నారు. "లక్షలాది మత్స్యకార కుటుంబాలు సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వారి భద్రత, జీవనోపాధిని మెరుగుపరిచేందుకు సాంకేతికతను వినియోగించడం అత్యంత ముఖ్యం. ఈ రోజు ప్రారంభమవుతున్న ప్రాజెక్ట్ ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది" అని లోకేశ్ తెలిపారు.

దేశంలోనే తొలి అటానమస్ షిప్ బిల్డింగ్ సెంటర్ 
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పక్కనే 29.58 ఎకరాల విస్తీర్ణంలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ సంస్థ దేశంలోనే తొలి అటానమస్ మారిటైం షిప్ బిల్డింగ్, సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నిర్మిస్తోందని లోకేశ్ వెల్లడించారు. ఈ కేంద్రంలో మనుషులు లేని సముద్ర నౌకలు (అటానమస్ షిప్స్), అండర్ వాటర్ వెహికల్స్, ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు వంటి అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఇవి తీరప్రాంత భద్రత, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

మత్స్యకారులకు సాంకేతిక భరోసా
 ఈ ప్రాజెక్టుపై మత్స్యకార సోదరులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. "ఈ టెక్నాలజీ దేశ రక్షణకే కాదు, మీ జీవితాలను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మీకు రియల్ టైం వాతావరణ సమాచారం, చేపల గుంపులను గుర్తించడం, నావిగేషన్ సహాయం అందిస్తుంది. దీనివల్ల మీ భద్రత పెరిగి, ఇంధన వ్యయం తగ్గి, ఉత్పాదకత పెరుగుతుంది. మత్స్యకారులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది" అని హామీ ఇచ్చారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన సంస్థ ప్రతినిధులను కోరారు.

జువ్వలదిన్నె హార్బర్‌తో 25 వేల కుటుంబాలకు లబ్ధి 
రూ.288.80 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా ఇప్పటికే 25 వేల మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయని మంత్రి వివరించారు. ఈ హార్బర్‌లో 1,250 మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా నిలిపే సదుపాయంతో పాటు ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వేలం హాళ్లు, వలల మరమ్మతు యార్డులు వంటి ఆధునిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఏటా ఈ హార్బర్ ద్వారా 41 వేల టన్నుల చేపల దిగుబడి వస్తుందని, ఇది నెల్లూరు జిల్లా మత్స్య ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అంచనా వేశారు. తుపానుల సమయంలో మత్స్యకారులకు, వారి ఆస్తులకు ఈ హార్బర్ సురక్షిత ఆశ్రయంగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మా బలం 
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి మూడు బలమైన కారణాలు ఉన్నాయని లోకేశ్ అన్నారు. "మొదటిది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బ్రాండ్. ఆయన నాయకత్వం విశ్వసనీయతకు ప్రతీక. రెండోది, మా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’. ఇక్కడ పెట్టుబడి పెట్టాలని నిర్ణయిస్తే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా మారి వేగంగా పూర్తవుతుంది. మూడోది, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం. ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా సాగుతోంది. ‘నమో’ అంటే నాయుడుజీ, మోదీజీల కలయిక" అని ఆయన వ్యాఖ్యానించారు.

సాగర్ డిఫెన్స్ సంస్థకు భారత్ బయోటెక్ వంటి సంస్థలు మద్దతు ఇవ్వడం శుభపరిణామమని లోకేశ్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంజనీర్లు, రోబోటిక్స్ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, ఏ అవసరం వచ్చినా తాను ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్యనారాయణ, సాగర్ డిఫెన్స్ సీఈవో కెప్టెన్ నికుంజ్ పరాశర్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Maritime Innovation
Autonomous Systems
Juvaladinn Fishery Harbour
Sagar Defence Engineering
Nellore
Fishing
Blue Economy
AP Maritime Board

More Telugu News