Chandrababu Naidu: మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!

Chandrababu Reviews AP Ministers Performance Anitha at Bottom
  • మంత్రుల పనితీరుకు చంద్రబాబు రేటింగ్స్
  • తొలి స్థానంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
  • నాలుగో స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా 'గణాంకాలతో కూడిన రేటింగ్స్' ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది.


ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందరికంటే వేగంగా ఫైళ్లను పరిష్కరిస్తూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన పనితీరుపై సీఎం ప్రశంసలు కురిపించారు. అచ్చెన్నాయుడు తర్వాత వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఉత్తమ రేటింగ్స్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.


అయితే, కీలకమైన హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరి స్థానంలో నిలవడం గమనార్హం. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల పరిపాలన కుంటుపడుతుందని, నిర్ణీత సమయంలోగా నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. మంత్రులందరూ తమ శాఖల్లో ఫైళ్ల కదలికపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం సహించబోమని ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు.

Chandrababu Naidu
Andhra Pradesh
AP Ministers
Collector Conference
File Clearance
Kinjarapu Atchannaidu
Nimmala Ramanayudu
Kondapalli Srinivas
Pawan Kalyan
Vangalapudi Anitha

More Telugu News