ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్... తీవ్రంగా స్పందించిన బీజేపీ ఎంపీ

K Laxman Reacts to Speakers Clean Chit to MLAs
  • స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్న లక్ష్మణ్
  • ఎమ్మెల్యేలపై విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చారని విమర్శలు
  • తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ప్రయోగశాలగా మార్చారని ఎద్దేవా
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు. ఈ ఎమ్మెల్యేలపై విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చి, ఇప్పుడు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చందంగా క్లీన్ చిట్ ఇచ్చారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రాన్ని గత కొంతకాలంగా పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పార్టీ కండువాలు కప్పారని, కానీ ఇప్పుడు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నైతిక విలువలకు, ప్రజాతీర్పుకు గౌరవం ఇచ్చే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా నాడు వాజపేయి ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించలేదని అన్నారు.

తెలంగాణలోని ఫిరాయింపులపై ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నీతులు చెప్పే రాహుల్ గాంధీ, తెలంగాణలో వారి పార్టీ నాయకులు చేసే ఊసరవెల్లి రాజకీయాలపై మాట్లాడటం లేదని విమర్శించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తూ, కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు.
Go Back to Shorts
K Laxman
Telangana
BRS
Congress Party
Party defection
Gadadam Prasad Kumar
Revanth Reddy

More Telugu News