Wang Yi: భారత్, చైనా ఒకరికొకరు ముప్పు అని భావించుకోవద్దు.. ప్రత్యర్థుల్లా చూసుకోవద్దు: చైనా విదేశాంగ మంత్రి

Wang Yi says India China should not see each other as threats
  • రెండు దేశాలు పరస్పరం ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా ఉండాలని సూచన
  • అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా సంబంధాలు మెరుగుపరుచుకోవాలని వ్యాఖ్య
  • మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ తర్వాత సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్న వాంగ్ యీ
భారత్, చైనా దేశాలు ఒకరికొకరు ముప్పు అని భావించకుండా అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ అన్నారు. ఈ రెండు దేశాలు పరస్పరం ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా ఉండాలని అన్నారు. వార్షిక మీడియా సమావేశంలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా సంబంధాలను మెరుగుపరుచుకునే అంశంలో ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని అన్నారు.

పొరుగు దేశాలుగా, గ్లోబల్ సౌత్ సభ్యులుగా భారత్, చైనా దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. పరస్పర విశ్వాసం, సహకారం అనేవి రెండు దేశాల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. విభజనవాదం, ఘర్షణలు అభివృద్ధిని దెబ్బతీస్తాయని సూచించారు. రెండేళ్ల క్రితం కజాన్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం అనంతరం భారత్, చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు.

గత ఏడాది తియాంజిన్‌లో మోదీ, జిన్‌పింగ్ మరోసారి భేటీ అయ్యారని, ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరిచాయని అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకోవడం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటం వంటివి ఇరుదేశాలకూ ప్రయోజనం చేకూర్చాయని అన్నారు. ఇరు దేశాలు సత్సంబంధాలు, స్నేహాన్ని కాపాడుకోవాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగాలని, అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.
Wang Yi
China
India
India China relations
Chinese Foreign Minister
Narendra Modi

More Telugu News