జీలకర్ర బెల్లం తర్వాత ట్విస్ట్.. ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లికూతురు
- మైలవరంలో పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిన వధువు
- జీలకర్ర బెల్లం తర్వాత ప్రియుడు రావడంతో అనూహ్య పరిణామం
- రూ.20 లక్షలు ఖర్చయిందని వరుడి కుటుంబం ఆవేదన
- పెద్దల పంచాయితీతో సమస్యను పరిష్కరించుకున్న ఇరువర్గాలు
మైలవరంలో ఓ వివాహ వేడుక బంధుమిత్రుల కోలాహలం మధ్య ఘనంగా జరుగుతోంది. ముహూర్తం సమయంలో వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. అదే సమయంలో ఓ యువకుడు హఠాత్తుగా మండపం వద్దకు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే వధువు పీటల మీద నుంచి లేచి "వచ్చావా" అంటూ అతడి వద్దకు వెళ్లింది. "ఇతను మా ఊరివాడే, మేమిద్దరం ప్రేమించుకున్నాం" అని అందరి ముందు ప్రకటించడంతో వరుడితో పాటు బంధువులంతా నిశ్చేష్టులయ్యారు.
ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన వరుడి తరఫు వారు ప్రియుడిపై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. తమ కొడుకు పెళ్లి కోసం రూ.20 లక్షల వరకు ఖర్చు చేశామని, తీరా చివరి నిమిషంలో ఇలా పరువు తీశారని వరుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు పెళ్లి ఆగిపోవడంతో శనివారం గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు పంచాయితీ నిర్వహించుకుని వివాదాన్ని పరిష్కరించుకున్నాయి. ప్రేమించిన వాడి కోసం వధువు పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయిన ఈ ఘటన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.