Indian Seamen: పశ్చిమాసియాలో ఉద్రిక్తత.. ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Indian Seamen Killed in Iran Attacks in Oman Sea
  • ఒమన్ తీర ప్రాంతాల్లోని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు
  • ఇరాన్ దాడుల్లో ముగ్గురు మరణించారని తెలిపిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
  • నావికుల కోసం ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడి
ఒమన్ సముద్ర జలాల్లో రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడి ఘర్షణల కారణంగా మన దేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతి చెందారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది.

ఒమన్ తీర ప్రాంతాల్లోని పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో వీరు మరణించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అడ్వైజరీ జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్‌లలో పరిస్థితులను గమనిస్తున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ సమస్యలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. షిప్ ఆపరేటర్ల భద్రతను కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే రిపోర్టు చేయాలని సూచించింది.

భారత్ జెండా ఉన్న నౌకలను బంధించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారమైతే రాలేదని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ వెల్లడించారు. సిబ్బందిని స్వదేశానికి రప్పించడానికి ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

పర్షియన్ గల్ఫ్ సమీపంలో చిక్కుకున్న భారతీయ నావికులకు తక్షణ సాయం అందించడానికి, వారిని భారత్‌కు తరలించడానికి ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని నావికులతో అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. నావికుల కుటుంబాలు, షిప్పింగ్ కంపెనీలు, ట్రేడ్ యూనియన్లు, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్లు, సంబంధిత పోర్ట్ అధికారులతో కూడా ప్రత్యేక ప్రతిస్పందన బృందం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు.
Indian Seamen
Iran attacks
Oman Sea
shipping advisory
Persian Gulf
Directorate General of Shipping

More Telugu News