ఖమేనీ హత్య... హైదరాబాదులో నల్ల దుస్తులు ధరించి రోడ్డెక్కిన షియా ముస్లింలు
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై హైదరాబాద్‌లో నిరసనలు
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ భారీ ర్యాలీ
- ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్ కాన్సులేట్ వద్ద జెండా అవనతం
- ముందస్తు జాగ్రత్తగా పాతబస్తీలో పోలీసుల భారీ బందోబస్తు
తంజీమ్-ఎ-జాఫరీ సంస్థ పిలుపు మేరకు పురానీ హవేలీలోని మజార్-ఎ-ఇబ్నే-ఖతూన్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు కంటతడి పెడుతూ నినాదాలు చేశారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకే ఖమేనీని పొట్టనబెట్టుకున్నారని, అగ్రరాజ్యాలకు తలొగ్గని నేతగా ఆయన నిలిచారని షియా మత పెద్దలు కొనియాడారు. ముస్లింల మధ్య ఐక్యత లేకపోవడమే ఈ విషాదానికి దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఖమేనీ మృతికి సంతాప సూచకంగా హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్ద ఆ దేశ జాతీయ జెండాను అవనతం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, శనివారం ఉదయం టెహ్రాన్‌లో తన నివాసంలోని కార్యాలయంలో ఉండగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారని ఇరాన్ మీడియా వెల్లడించింది.