Abdolrahim Mousavi: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైన్యాధిపతి మౌసవి మృతి

Abdolrahim Mousavi Killed in US Israel Airstrikes
  • టెహ్రాన్‌లో రక్షణ మంత్రి, ఐఆర్‌జీసీ చీఫ్‌తో పాటు ఏడుగురు కమాండర్ల మరణం
  • సుప్రీం లీడర్ ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ ఆర్మీ
  • అమెరికా, ఇజ్రాయెల్ పై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడులు ఆ దేశానికి కోలుకోలేని దెబ్బతీశాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్లాహిం మౌసవి మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ టీవీ ఆదివారం వెల్లడించింది. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం.. టెహ్రాన్‌పై జరిగిన ఈ భీకర దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) చీఫ్ కమాండర్ మొహమ్మద్ పాక్‌పూర్, రక్షణ మండలి కార్యదర్శి అలీ షంఖానీ, రక్షణ మంత్రి అజీజ్ నసిర్‌జాదే కూడా ప్రాణాలు కోల్పోయారు.

టెహ్రాన్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇరాన్ ఉన్నతాధికారులు సమావేశమైనట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ గుర్తించిందని, ఆ వెంటనే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మెరుపు దాడులు చేసిందని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో రక్షణ మంత్రి, ఐఆర్‌జీసీ చీఫ్ సహా మొత్తం ఏడుగురు సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ స్పష్టం చేసింది. మరికొంతమంది బాధితుల వివరాలు వెల్లడికాాల్సి ఉందని స్థానిక మీడియా పేర్కొంది.

మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ టీవీ అధికారికంగా ధృవీకరించింది. తమ నాయకుడి మరణంపై ఐఆర్‌జీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ "హంతకులపై" ప్రతీకారం తీర్చుకుంటామని టెలిగ్రామ్ వేదికగా శపథం చేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత భీకరమైన దాడులతో (ఫెరోషియస్ అఫెన్సివ్) సమాధానం చెబుతామని, తమ దేశంపై దాడి చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.


Abdolrahim Mousavi
Iran
Israel
United States
Airstrikes
IRGC
Middle East Conflict
Ayatollah Ali Khamenei
Mohammad Pakpour
Ali Shamkhani

More Telugu News